చైనా రాయబారితో భేటీ అయిన సోనోవాల్

భారతదేశంలో చైనా రాయబారి లువో ఝవొహుయితో అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ సోమవారం గువాహటిలో భేటీ అయ్యారు. ఇరు ప్రాంతాల ప్రయోజనాలతో ముడిపడిన పలు అంశాలపై చర్చలు జరిపారు.

చైనాకు భౌగోళికంగా అస్సాం దగ్గరగా ఉన్నందున తాము వ్యాపారం, ప్రజల లబ్ధి, ప్రయోజనాల్లో సహజసిద్ధమైన మిత్రపక్షాలని సోనోవాల్ తెలిపారు. హువాంగ్ హో నది నిర్వహణపై అథ్యయనం చేసేందుకు తమ బృంద పర్యటనకు సహకరించాలని చైనా రాయబారిని ఆయన కోరారు. బ్రహ్మపుత్ర నది నిర్వహణ అస్సాంకు చాలాపెద్ద అంశమని, హో నది సమస్యను వనరుగా మార్చుకున్న చైనా అనుభవం తమకు ఉపయోగపడుతుందని సోనోవాల్ చెప్పారు.

స్టిల్ వెల్ రోడ్డును పున:ప్రారంభించాలన్న ఝవొహుయి విన్నపంపై స్పందిస్తూ.. ఆగ్నేయ ఆసియాకు ప్రధాన వర్తక ప్రాంతంగా ఈశాన్య భారతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని, ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో రహదారులను ప్రారంభించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని సోనోవాల్ చెప్పారు.

కాగా, కున్మియాంగ్ లో ఈ ఏడాది జూన్ లో జరిగే వర్తక సమ్మేళనంలో పాల్గొనాల్సిందిగా సోనోవాల్ కు చైనా రాయబారి ఆహ్వానం పలికారు.