రూ.34 వేల కోట్ల సహారా ఆంబీవ్యాలీని అమ్మేయండి : సుప్రీం కోర్టు ఆదేశం

సహారా గ్రూపుకు చెందిన రూ.34 వేల కోట్ల విలువైన ఆంబీవ్యాలీని విక్రయించాలని బాంబే హైకోర్టును సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అలాగే ఏప్రిల్ 28వ తేదీలోపు సహారా అధిపతి సుబ్రతా రాయ్ తమ ముందు హాజరు కావాలని కూడా ఆదేశించింది.

రూ.5 వేల కోట్లు సమర్పించాలన్న తమ ఆదేశాలను పాటించని నేపథ్యంలో రాయ్ తీరుపై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోవటం అంటే చట్టం ఆగ్రహానికి గురైనట్లేనని, దానివల్ల రాయ్ కష్టాలు కొనితెచ్చుకుంటారని తెలిపింది.

ఆంబీవ్యాలీ ఆస్తులను విక్రయించి తమకు తెలియజేయాలని బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్ కు ధర్మాసనం తెలిపింది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని లిక్విడేటర్ కు 48 గంటల్లో ఇవ్వాలని రాయ్, సహారా గ్రూప్, సెబీలకు ధర్మాసనం ఆదేశాలిచ్చింది.