నాల్కోలో 9.2 శాతం వాటా విక్రయించి రూ.1200 కోట్లు సేకరించిన ప్రభుత్వం

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో 9.2 శాతం వాటాను విక్రయించటం ద్వారా ప్రభుత్వం గురువారం రూ.1200 కోట్లను సమీకరించింది. వాస్తవానికి పెట్టుబడిలో 5 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ మార్కెట్ నుంచి భారీగా స్పందన రావటంతో 9.2 శాతం వాటా విక్రయించింది.

ఈ లావాదేవీలతో నాల్కోలో ప్రభుత్వ వాటా 65.73 శాతానికి తగ్గింది. ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ప్రభుత్వం పెట్టుబడుల ద్వారా రూ.46,247 కోట్లు సమీకరించింది.