పెద్దనోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ తమ ముందు హాజరు కావాలన్న పార్లమెంటరీ ప్యానెల్

పెద్దనోట్ల రద్దు అంశానికి సంబంధించి మే 25వ తేదీన తమ ముందు మరోమారు హాజరు కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు పార్లమెంటరీ సంఘం తెలిపింది.

పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన చర్చ ఇంకా ముగియనందున దీనిపై సభ్యులకు వివరాలు వెల్లడించేందుకు గాను ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక శాఖ అధికారులు తమ ముందు హాజరు కావాలని ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం తెలిపిందని న్యూఢిల్లీలో సంబంధిత వర్గాలు చెప్పాయి.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలోని ఈ కమిటీ గత జనవరిలో సైతం పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన వివరాలు తెలపాలంటూ ఆర్థిక శాఖ, ఆర్బీఐ అధికారులను పిలిపించింది.

ఇదిలా ఉండగా.. టీ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలోని 15 మంది సభ్యుల సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ పెద్దనోట్ల రద్దు తర్వాత పరిణామాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆర్బీఐని కోరింది.