24 నుంచి ఆర్మేనియా, పోలాండ్ దేశాల్లో ఉపరాష్ట్రపతి పర్యటన

ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఆర్మేనియా, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా దేశాల అగ్రనాయకులతో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు.

ఆయా దేశాలతో సుహృద్భావ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన వివిధ అంశాలపై భాగస్వామ్యాన్ని, సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ఉపరాష్ట్రపతి పర్యటన జరుగుతోందని విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) ప్రీతి శరణ్ విలేకరులకు తెలిపారు. ఈ దేశాల్లో భారత ఉపరాష్ట్రపతి పర్యటించటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

ఈ ఏడాదితో ఆర్మేనియాతో ద్వైపాక్షిక సంబంధాల 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఉన్నతస్థాయి బృందంతో మంగళవారం ఆర్మేనియా రాజధాని యెరెవన్ చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడు సెర్జ్ దర్శన్, ప్రధానమంత్రి కరేన్ కరపెత్యన్, విదేశాంగ మంత్రితో భేటీ అవుతారు. ఆర్మేనియా స్టేట్ యూనివర్శిటీని కూడా ఆయన సందర్శిస్తారు.

అనంతరం పోలండ్ పర్యటనకు బయలుదేరి వార్సా చేరుకుంటారు. పోలండ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, స్పీకర్ లతో భేటీ అవుతారు. భారత్, పోలండ్ దేశాల మధ్య వర్తకం గత ఏడాది కాలంలో 25 శాతం పెరిగింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి అయిన పోలండ్ తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారతదేశం భావిస్తోంది.