దుబాయ్ లో స్టార్టప్ ఇండియా సదస్సు

రెండు రోజుల స్టార్టప్ ఇండియా సదస్సు ఈనెల 23, 24 తేదీల్లో దుబాయ్ లో జరుగనుంది. సీజీఐ దుబాయ్, భారత రాయబార కార్యాలయం, ఐస్పిరిట్ స్వచ్ఛంద సంస్థ, టీఐఈల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగనుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్టార్టప్ సమ్మిట్ నిర్వహించటం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య స్టార్టప్ సానుకూల వ్యవస్థల ఏర్పాటుకు, సహకారాన్ని పెంపొందించుకునేందుకు, ఆలోచనలను పంచుకునేందుకు, పరిశ్రమ, పెట్టుబడి, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చించేందుకు ఈ సదస్సు జరుగుతోంది.

స్టార్టప్ లకు అవసరమైన సహకారం పొందేందుకు కూడా ఈ సదస్సు ఉపకరిస్తుంది.

భారతదేశం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫిన్ టెక్, డిజి మెడిసిన్, హెల్త్ కేర్ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ సర్వీస్ తదితర రంగాలకు చెందిన 17 స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొంటాయని దుబాయ్ లో భారత కాన్సుల్ జనరల్ విపుల్ తెలిపారు.