చైనాతో స‌హ‌నం, శాంతియుత విధానం అనుస‌రించ‌నున్న భార‌త్

 ర‌చ‌న : డాక్ట‌ర్ అష్ నారాయ‌న్ రాయ్, డైరెక్ట‌ర్‌, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌, ఢిల్లీ
బీజింగ్ గిల్లిక‌జ్జాల ప్ర‌వ‌ర్త‌న‌తో భార‌త్‌-చైనాల నడుమ డోక్ల‌మ్ వ‌ద్ద నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న అలాగే కొన‌సాగుతోంది. చైనా మీడియా ఉప‌యోగిస్తున్న క‌ఠిన‌మైన ప‌ద‌జాలాన్ని కూడా వ్యూహాత్మ‌క విశ్లేష‌కులు చైనా వైఖ‌రి ఎలా ఉందో స్ప‌ష్టం చేస్తోంద‌ని చెబుతున్నారు. చైనా ఆ ప్రాంతంలో మోహ‌రిస్తున్న సేన‌లు కూడా ఊహించ‌ని ప‌రిణామం. ప్ర‌స్తుత ప్ర‌తిష్టంభ‌న‌కు జూన్ 16తో ప్రారంభ‌మైంది. చైనా సేన‌లు భూటాన్ భూభాగంలోకి నిర్మాణ రంగ వాహ‌నాలు, రోడ్డు నిర్మాణ సామాగ్రితో క‌లిసి వ‌చ్చిన‌పుడు స‌మ‌స్య మొద‌లైంది. భార‌త్‌తో మిల‌ట‌రీ, ఆర్ధిక రంగాల‌లో మంచి సంబంధాల‌తో ఉన్న భూటాన్ మ‌న దేశాన్ని ఈ విష‌యంలో స‌హాయం చేయ‌మ‌ని అర్ధించింది. దాంతో భార‌త్, చైనా సైన్యాన్ని ముందుకు రాకుండా అడ్డుకునేందుకు సైన్యాన్ని పంపింది.
చైనా మీడియా దీనిపై ప‌లు ర‌కాల క‌థనాలు రాస్తూ భార‌త్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసే ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చింది. అయితే భార‌త్ మాత్రం ధీటుగానే జ‌వాబు ఇస్తూ వ‌స్తోంది. అయితే ఇరు దేశాల న‌డుమ నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేసింది. చైనా, భార‌త్ ప‌ట్ల ఇంత క‌ఠిన వైఖ‌రిని ఎందుకు అవ‌లంబించిందో అర్థం కాని ప‌రిస్థితి. చైనా అధినేత‌, ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ వివిధ అంశాల‌పై చుట్టుప‌క్క‌ల ఉన్న డ‌జ‌నుకు పైగా దేశాల‌తో నిత్యం వివాదాల‌కు దిగుతూనే ఉన్నారు. చివ‌ర‌కు సౌత్ చైనా స‌ముద్రం విష‌యంలో కూడా ఆయ‌న ప‌క్క దేశాల‌తో గిల్లిక‌జ్జాల‌కు దిగుతూనే ఉన్నారు.
చైనా నాయ‌కత్వం గ‌తంలోని తాను అనుస‌రించిన విధానాలను మార్చుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌న కాలానికి క‌ట్టుబ‌డాలి, మ‌న‌పై మ‌నం దృష్టి సారించాల‌నే ధోర‌ణితోపాటు వెలుగును దాచు, చీక‌టిని పెంచు అనే విధానానికి తిలోద‌కాలిచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇటీవ‌ల ప‌రిణామాలు కొన్ని ప‌రిశీలిస్తే చైనా  శాంతియుత‌, స‌హ‌న శీల ఉనికిని కూడా అంత‌గా న‌మ్ముకున్న‌ట్లు అనిపించ‌డం లేదు. యురోపియ‌న్ పార్ల‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రైజ‌ర్ద్ జార్నెకీ ఇటీవ‌ల ఈ విష‌యంలో చాలా ఘాటుగా చేసిన ఒక వ్యాఖ్యను దీనికి దుష్టాంతంగా చెప్పుకోవ‌చ్చు. చైనా రూపొందించుకున్న విదేశాంగ పాల‌సీని ప‌రిశీలిస్తే అది అంత‌ర్జాతీయ నియ‌మాల‌ను ఉల్లంఘించే రీతిలో ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంత‌ర్జాతీయ స‌మాజానికి బీజింగ్ శాంతియుత ఉత్తానం పేరిట చేప‌డ‌తాన‌న్న చ‌ర్య‌లు ప్ర‌పంచ శాంతికి భంగం క‌లిగించ‌లేద‌ని దీంతో స్ప‌ష్ట‌మ‌వుతోంది.
చైనా అధ్య‌క్షుడు జి జిన్‌పింగ్ త‌న చిర‌కాల స్వ‌ప్పంగా చెప్పుకునే..విశాల చైనా కోసం అఖండ ప్ర‌య‌త్న‌మే చైనీయుల ఆకాంక్ష అనే నినాదం ఈ ధోర‌ణి వెన‌క ఉండి ఉంటుంద‌ని అనిపిస్తోంది. చైనా ప్ర‌వ‌ర్త‌నకు గ‌తంలో ఆ దేశ సామ్రాజ్య వాద కాంక్ష‌ను కొంద‌రు మేధావులు గుర్తు చేసుకుంటున్నారు. ప‌క్క దేశాల‌ను ఆక్ర‌మించాల‌నే కాంక్ష చైనాకు తొలి నాళ్ల నుంచి ఉంద‌ని వాళ్లు విశ్లేషించారు. దీని కోసం చైనా సేన‌లు చేసిన దాడులు, యుద్ధాల విష‌యంలో చైనా చ‌క్ర‌వ‌ర్తులు ఎన్న‌డూ ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించ‌లేదు.
చైనా దుందుడుకు ప్ర‌వ‌ర్త‌న‌కు ఆ దేశంలోని అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు కూడా కార‌ణంగా ఉన్నాయి. ఒక‌నాడు బ‌ల‌హీనమైన నాయ‌కునిగా, అధికారం ఎప్పుడు చేజారుతుందోన‌నే ప‌రిస్థితిలో ఉన్న‌ ప్రెసిడెంట్ జీ ఇపుడిపుడే త‌న ఉనికిని చాటుకుంటున్నారు. 2012లో ఆయ‌న జాతీయ నాయ‌కునిగా ఎదిగారు. అప్ప‌టి నుంచి దేశ ఆర్ధిక‌, సైనిక శ‌క్తి సామార్థ్యాల్ని ఒక దారిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయ‌న బెల్ట్ అండ్ రోడ్ విధానం ఆయ‌న‌కు అంత‌ర్జాతీయంగా పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న చైనా క‌మ్యునిస్టు పార్టీ 19వ జాతీయ కాంగ్రెస్‌లో త‌న‌కు మ‌రో ద‌ఫా ఇదే ప‌ద‌విలో కొన‌సాగించే అవ‌కాశం ఇస్తార‌నే ఆశ కూడా జీలో ఉంది. అందుకే ఆయ‌న ట్రై జంక్ష‌న్ అయిన భార‌త్‌, చైనా, భూటాన్ స‌రిహ‌ద్దుల విష‌యంలో క‌ఠినంగా ఉన్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.
కాగా చైనా మీడియా దూకుడు త‌నానికి భార‌త్ చాలా నెమ్మ‌దిగా, మృధువుగా, ప‌రిణితితో స్పందిస్తోంది. మీడియా క‌వ‌రేజ్ విష‌యంలో ఎంతో నియంత్ర‌ణ‌తో వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు దౌత్య‌ప‌ర‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఓపిక ప‌డుతోంది. విదేశాంగ కార్య‌ద‌ర్శి ఎస్‌.జైశంక‌ర్ ఈ విష‌యంలో స్పందిస్తూ రెండు దేశాలు త‌మ మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోలేవ‌నే మాట‌లో అర్థం లేద‌ని కొట్టి పారేశారు. అంతేకాదు ఆయ‌న మ‌రో ముఖ్య‌మైన వ్యాఖ్య కూడా చేశారు. భార‌త్‌, చైనాలు త‌మ మ‌ధ్య విబేధాల‌ను వివాదంగా మార్చుకోకూడ‌ద‌ని కూడా అన్నారు. కానీ చైనా అధికార మీడియా మాత్రం ఈ విష‌యాన్ని మ‌రింత వివాదాస్పదంగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. స‌రిహ‌ద్దులే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అంటోంది. స‌రిహ‌ద్దుల్లో ఉన్న భార‌త సేన‌ల‌ను ఉప‌సంహ‌రించుకునే వ‌ర‌కు చ‌ర్చ‌ల‌కు ఆస్కార‌మే లేద‌ని కొట్టి పారేస్తోంది.
కాగా ఇరు వైపులా ఉన్న వ్యాపార సంబంధాల‌ను దృష్టిలో పెట్టుకొని ఇరుప‌క్షాల న‌డుమ ఉన్న ఉష్టోగ్ర‌త‌ల‌ను త‌గ్గించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. ప్ర‌భుత్వం త‌ర‌పున కొంద‌రు మేధావులు ఇరు ప‌క్షాల న‌డుమ ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించే ప్ర‌యత్నం చేస్తున్న‌ట్లుగా స‌మాచారం అందుతోంది. ఇలాంటి ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల న‌డుమే భార‌త్ మంత్రులు ఇటీవ‌ల బీజింగ్‌లో జ‌రిగిన బ్రిక్స్ దేశాల స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. హాంబ‌ర్గ్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హారాదు అజిత్ థోవ‌ల్ బీజింగ్‌లోని బ్రిక్స్ ఎన్ఎస్ఎ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు బ‌య‌లు దేరి వెళ్తున్నారు.
భార‌త ప్ర‌భుత్వం విప‌క్షాల‌కు కూడా చైనా విష‌యంలో అనుస‌రించే వైఖ‌రిని చాలా స్ప‌ష్టంగా తెలిపింది. శాంతి, స‌హ‌నంతో ప‌రిస్థితిని చ‌క్క‌బెట్టేందుకు య‌త్నిస్తున్నామ‌ని వివ‌రించింది. మొత్తం మీద చైనా దూకుడు ప్ర‌వ‌ర్త‌న‌కు ఆ దేశ విదేశాంగ విధానంలోని వ్యూహం కార‌ణ‌మ‌ని చెప్పుకోవ‌చ్చు. ప‌ర్వ‌త శిఖ‌రంపై ఉన్న‌పుడు, అక్క‌డ వీచే చ‌లి గాలుల‌కు నిల‌దొక్కుకొని నిల‌డ‌లేం అనేదే ఆ వ్యూహం.