బస్సు ప్రమాదంలో 16 మంది అమర్‌నాథ్ యాత్రికుల మృతి- విచారం వ్యక్తంచేసిన ప్రధాని

ఆదివారం జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలోని రాంబాన్ జిల్లాల్లో బస్సు ప్రమాదవశాత్తు ఇరుకుదారిలో పడి 16 మంది అమర్‌నాథ్ యాత్రికులు మరణించారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన 19 మందికి వైద్య సహాయం అందించే నిమిత్తం విమానం ద్వారా బాధితులను తరలించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు  వెల్లడించారు. 8 మందికి మాత్రం తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయని అధికారి తెలిపారు.

శ్రీనగర్ నుంచి అమర్‌నాథ్‌ బస్సు వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  బనిహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నచిలానా సైనిక శిబిరం దగ్గరలో బస్సు టైరు పేలి ఈ దుర్ఘటన జరిగింది.

బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమర్‌నాథ్ యాత్రికుల పట్ల ప్రధాని మోది తన విచారాన్ని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను తలచుకుంటే ఎంతో బాధగా ఉందన్నారు. గాయపడిన వారు తొందరగా కోలుకుంటారనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తంచేశారు.

బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు ఒక్కొంక్కటికీ రెండు లక్షల రూపాయల సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయల సహాయాన్ని అందిస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బస్సు దుర్ఘటనపై విచారాన్ని ప్రకటించారు. మంత్రి జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యల గురించి ముఫ్తీ  హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.