కెన్య అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైన ఉహూరు కెన్యట్టా

కెన్యా అధ్యక్షునిగా ఉహూరు కెన్యట్టా మరోమారు ఎన్నికయ్యారు. మంగళ వారం జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ మేరకు వెలువడ్డాయి.

కెన్యా ఎన్నికల కమిషన్ అధిపతి వఫూలా చెబుకటి రాజధాని నౌరోబీలో ఈ విషయాన్ని ప్రకటించారు. కెన్యట్టాకు 54.27 శాతం ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి రైఫా ఒడింగాకు 44.74 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.

తన ఎన్నికలను అధికారికంగా ప్రకటించిన అనంతరం కెన్యట్టా మాట్లాడుతూ తామంతా ఒకటేననీ, శత్రువులం కాదనీ, అందరం కలసిమెలసి ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

కాగా విపక్షాలు మాత్రం ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే వాటిని తిరస్కరించాయి. ఎన్నికల్లో గందరగోళం జరిగిందని ఆరోపించింది.

కాగా కెన్యట్టా ఈ ఆరోపణలు ఖండిస్తూ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో నిజాయితీ జరిగాయని అన్నారు.

కాగా ఎన్నికల నేపథ్యంలో దేశంలో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు మరణించగా, కొందరు గాయపడ్డారు.