ఖాంట్మండులో బిమ్‌స్టెక్ మంత్రుల సమావేశం

రచన: రత్తన్ సల్దీ, రాజ్యకీయ వ్యాఖ్యాత

నేపాల్ రాజధాని ఖాట్మండులో ‘బే ఆప్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్-బిఐఎంఎస్‌టిఈసి) దేశాల విదేశాంగ మంత్రుల 15వ సమావేశం జరుగింది. బంగాళాఖతం పరిధిలోని దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలు తమ మధ్య ప్రాంతీయ సహకారం కోసం బిమ్‌స్టెక్ పేరిట సమావేశం కావడం ఆనవాయితీ. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లు బిమ్‌స్టెక్ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. రెండు రోజుల సమావేశాల్లో మన దేశం తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. మావోయిస్టు సెంటర్ నేత ప్రచండ పేరిట ప్రఖ్యాతిగాంచిన పుష్ప కమాల్ దహల్ స్థానంలో అధికారంలోకి వచ్చిన నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దూబా తన సొంత ప్రభుత్వం ఏర్పాటు చేశాక భారత్ ఈ మంచుశ్రేణుల దేశానికి ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపడం ఇదే తొలిసారి. అధికార మార్పిడి పేరిట ఈ ఏడాది జూన్‌లోనే ప్రచండ స్థానంలో దూబా ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు.

ఈ సమావేశాలను ప్రారంభించిన నేపాల్ ప్రధాని దూబా బిమ్‌స్టెక్ దేశాలు తమ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు దృఢమైన భాగస్వామ్యాన్ని, లోతైన సంబంధాలను ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల తీరులోనే బిమ్‌స్టెక్ భాగస్వామ్య దేశాలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. బహుళజాతి నేరాలు, ఉగ్రవాదం, డగ్ర్స్ అక్రమ సరఫరా, అక్రమ ఆయుధాల రవాణలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో 14 విభిన్నమైన అంశాలు చర్చకు వచ్చాయి. అందులో వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం, పర్యాటకం, వ్యవసాయం, పేదరిక నిర్మూలన, ఉగ్రవాదంపై పోరు, పర్యావరణం, వాతావరణ మార్పులు అనే అంశాలు కొన్ని. బిమ్‌స్టెక్ దేశాల నడుమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరాల్సిన అవసరాన్ని గతంలో జరిగిన బిమ్‌స్టెక్ దేశాల ఉన్నతాధికారుల 18వ సమావేశం నొక్కిచెప్పింది.

బిమ్‌స్టెక్ సమావేశాల సమయంలోనే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖాట్మండులో నేపాల్ నాయకులతో ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల గురించి విడిగా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఇరు దేశాల నడుమ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దూబా ప్రభుత్వం మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడిలో ఉన్న సమయంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. మాదేశీ పార్టీలు రెండు ప్రావిన్సుల్లో ఎన్నికలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. ఎన్నికలు సెప్టెంబర్ 18వ తేదీన జరగాల్సి ఉంది. గాకా ఫెడరల్, ప్రావిన్షియల్ ప్రభుత్వాల కోసం 2018 జనవరి 21వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ప్రస్తుత పార్లమెంట్ గడువు ముగుస్తుంది. కాగా రాజ్యాంగ సవరణలు, ప్రొవిన్షియల్ సరిహద్దుల ప్రాంతాల్లో మార్పులపై మాదేశీ సంస్థలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక సంస్థలతోపాటు ప్రావిన్షియల్, ఫెడరల్ ఎన్నికలకు ముందే తమ డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబడుతున్నాయి. భారత్‌కు సమీపంలోని నేపాల్ సరిహద్దుల్లోని తెరాయ్ ప్రాంతంలో నివసిస్తున్న పురాతన జన జాతులు, తరూస్‌లతోపాటు మరికొన్ని మైనార్టీ గ్రూపులను మాదేశీలుగా వ్యవహరిస్తున్నారు.

భూటాన్ సరిహద్దుల్లోని దోక్లామ్ త్రికోణంలో భారత్, చైనాల నడుమ ప్రతిష్టంభన నెలకొన్న నేపధ్యంలో సుష్మా స్వరాజ్ పర్యటన చేటుచేసుకున్న విషయం కూడా గమనార్హం. భారత్, చైనాలతో సరిహద్దులను పంచుకుంటున్న నేపాల్‌ కూడా ఈ విషయంలో ఆసక్తి చూపుతోంది. నేపాల్ పార్లమెంటులో కూడా ఈ అంశమై చర్చ జరిగిందంటే ఆ దేశానికి ఈ అంశం ఎంత కీలకమైనదో అర్ధం చేసుకోవచ్చు. కాగా నేపాల్ నాయకత్వం ఈ విషయంలో భారత్, చైనాలు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని ఆశిస్తూ ప్రకటన చేసింది. సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటనను గమనించిన చైనా ఆమె దారిలో వచ్చే వారం వైస్ ప్రిమియర్ అయిన వాంగ్ యాంగ్ నేతృత్వంలో నాలుగురు ప్రతినిధుల బృందం ఖాట్మండుకు రానుంది. నేపాల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం పర్యటనకు వస్తున్నట్లు చైనా ప్రకటించింది. చైనా చాలా కాలంగా నేపాల్‌తో సంబంధ బాంధవ్యాల కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం, రైలు, రోడ్డు మార్గాల అనుసంధాన రంగాల్లో తన సంబంధాలను విస్తృతపరుచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.

సుష్మా స్వరాజ్ తన పర్యటనలో భాగంగా నేపాల్ అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ, ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దూబాలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇరువురు నేతలతో వివిధ అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మౌలిక వనరుల అభివృద్ధి, ఇంధనం, అనుసంధానం, జల విద్యుత్ ఉత్పత్తిలో సహకారం లాంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. దీంతోపాటు నేపాల్ ప్రధాని దుబా ఆ నెల 23వ తేదీన భారత్ పర్యటనపై కూడా ఆమె చర్చించారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విదేశీ పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనర్హం. సుష్మా స్వరాజ్ తన పర్యటనలో నేపాల్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి కృష్ణ బహదూర్ మహారాను కలిసి భారత్ ఆర్ధిక సహకారంతో నేపాల్‌లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోభివృద్ధికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న నేపాల్ మూడో దశ స్థానిక ఎన్నికలకు ముందే రాజ్యాంగ సవరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్‌ను నేపాల్‌కు చెందిన రాష్ట్రీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం కూడా సుష్మా స్వరాజ్‌ను కలిసింది. తమ డిమాండ్‌ను వివరిస్తూ ఆమెకు వినతి పత్రం సమర్పించారు.

నేపాల్ పార్లమెంట్‌లోని వివిధ పక్షాలు విభిన్న అభిప్రాయాలతో ఉన్న నేపథ్యంలో ప్రధాని దూబా ప్రభుత్వానికి రాజ్యంగ సవరణ విషయంలో ఏకాభిప్రాయం సాధించడం, మూడింట్లో రెండో వంతు మద్దతు కూడగట్టడం సాధ్యమయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. కాగా భారత్ మాత్రం నేపాల్‌లో నిత్యం శాంతి, సుస్ధితర, సామాజిక ఆర్ధిక అభివృద్ధి జరగాలనే ఆకాంక్షకు కట్టుబడి ఉంది.