వార్తా వ్యాఖ్య

ఊపందుకుంటున్న ఇండో-బెలారూసియన్‌ సహకారం

రచన: సునీల్ గటాడె, రాజకీయ వ్యాఖ్యాత

వివిధ రంగాల్లో సహకారాన్నిమరింత పెంపొందించుకునేందుకు భారత్, బెలారస్‌లు పదికి పైగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. బెలారస్ అధ్యక్షుడు అలగ్జాండర్ లుకాషెంకో భారత పర్యటన ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు రక్షణ రంగంలో అభివృద్ధికి, తయారీకి సంయుక్తంగా కృషి చేయాలని నిశ్చయించుకున్నాయి.

భారత్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బెలోరస్‌తో  రక్షణ పరమైన సహకారాన్ని పెంపొందించుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని భారత్ గుర్తించింది. ఎందుకంటే సోవియట్ యూనియన్ శకం నుంచి బెలారస్ రక్షణ తయారీ రంగంలో, సాంకేతిక ప్రగతిలో తనకంటూ విశిష్ట స్థానాన్ని కలిగుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెలారష్యాన్ అధ్యక్షుడు లుకాషెంకోల మధ్య విస్తృత స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఇందులో ఇరుదేశాల నాయకులు ఆర్థిక రంగంలో సంయుక్త కృషి చేపట్టాలని భావించారు. అందులో భాగంగా వ్యాపారం, పెట్టుబడుల రంగాల్లో మంచి అవకాశాలు ఉండడాన్ని కూడా గుర్తించారు. చర్చలు విస్తృత పరిధిలో జరిగాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు విజయవంతంగా ముందుకుసాగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. బెలారష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ  రెండు దేశాలు నూతన తరహా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునే స్తాయిలోకి ప్రవేశించాయని వ్యాఖ్యానించారు. బహుళ-ధృవ ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలని కూడా  ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015, మేలో బెలారస్‌లో పర్యటించారు. బెలారస్‌తో భారత్ ఎంతో స్నేహపూరిత సంబంధాలను కలిగి ఉంది. 1991 సంవత్సరంలో రష్యా చీలిపోయిన తర్వాత, బెలారస్‌ను స్వతంత్రదేశంగా గుర్తించిన దేశాల్లో భారత్ కూడా ఉంది. బెలారస్‌తో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. అంతేకాదు భారత దౌత్య మిషన్ 1992లో మిన్సెక్‌లో ప్రారంభమైంది. న్యూఢిల్లీలో బెలారస్  రాయబార కార్యాలయం 1998లో మొదలైంది.

భారతదేశాన్ని సందర్శించిన బెలారస్ అధ్యక్షులలో లుకాషెంకో మూడవ వారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఆయన భారత పర్యటన చోటుచేసుకోవడం మరో విశేషం. అంతేకాదు  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోలు సంయుక్తంగా పోస్టేజ్ స్టాంపును కూడా విడుదల చేశారు.

రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న పలు ఒప్పందాలు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత పెంపొందిస్తాయనడంలో సందేహం లేదు. చమురు, సహజవాయువు, వ్యవసాయం, శాస్త్ర, సాంకేతిక రంగం, విద్య, క్రీడా రంగాల్లో ఇరుదేశాలు సహాయసహకారాలిన ఇచ్చిపుచ్చుకోవాలని తమ ఒప్పందాల్లో ఇరుదేశాలూ అంగీకరించాయి. భారత వినూత్న కార్యక్రమం ‘మేక్ ఇన్ ఇండియా’ కింద ఇరుదేశాలూ సంయుక్తంగా రక్షణ రంగం అభివృద్ధి, తయారీల్లో సంయుక్తంగా కృషి చేయాలని నిశ్చయించుకున్నాయి. బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో భారత పెట్టుబడుదారులను తమ దేశానికి ఆహ్వానించారు. బెలారస్‌లో వారు వ్యాపారం చేసుకునేందుకు అనువైన పరిస్థితుల కల్పనకు పూనుకోనున్నట్టు కూడా మాటిచ్చారు. బెలారస్‌తో భారత్ బహుళపక్ష ఆర్థిక కార్యక్రమాలలో పాల్గొననుంది. ఇరేషియన్ ఆర్థిక యూనియన్ (ఇఇయు), అంతర్జాతీయ నార్త్-సౌత్ రవాణా కారిడార్ వంటి కార్యక్రమాల్లో భారత్ ఉంది. స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సంబంధించి ప్రస్తుతం ఇరేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో భారత్ అనుసంధాన చర్చలు నెరపుతోంది. ఇఇయులోని ఐదు సభ్య దేశాల్లో బెలారస్ ఒకటి. మధ్య ఆసియా బ్లాక్‌లోని అత్యంత ప్రభావిత దేశం బెలారస్. 2016లో భారత్, బెలారస్‌ల మధ్య 402 మిలియన్ అమెరికన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం చోటుచేసుకుంది.  అంతేకాదు వివిధ రంగాల్లో వ్యాపార పెట్టుబడుల అవకాశాలు సైతం వీరి మధ్య పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో ఫార్మాస్యుటికల్స్, చమురు, సహజవాయువు రంగాలు కూడా ఉండడం విశేషం.

ఇరుదేశాల మధ్య నూతన ఆర్థిక సంబంధాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఇరుదేశాలకు చెందిన కంపెనీలు కొనుగోలుదారు-అమ్మకందారుల ఫ్రేమ్‌వర్కును పటిష్టం చేసుకోవడం ద్వారా ఈ రంగంలో మరింత ముందుకు దూసుకుపోవాలని మోదీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఇరుదేశాలూ ఒకరికొకరు బాసటగా నిలిచినట్టు ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. బహుళపాక్షిక ప్రాతిపదికన రాజకీయ రంగంలో కూడా ఇరుదేశాల ప్రయోజనాల కనుగుణాంగా ముందుకు సాగాలని, సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, బెలారస్‌లు నిశ్చయించుకున్నాయి. పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాల పట్ల ఇరుదేశాల దృక్కోణం ఒకటిగా ఉండడాన్ని ఈ సందర్భంగా ఇరుదేశాలూ పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెలారస్ తన మద్దతును సైతం తెలిపింది. న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూపు (ఎన్ ఎస్ జి)లో భారత్ ఉండడాన్ని కూడా బెలారస్ సమర్థించింది. అలాగే భారత్ అలీన ఉద్యమ వేదికలో బెలారస్ సభ్యత్వానికి భారత్ మద్దతు తెలిపింది.  అంతేకాదు ఇతర అంతర్జాతీయ, బహుళపక్ష వేదికలైన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) వంటి వాటిల్లో కూడా బెలారస్ ప్రవేశాన్ని సమర్థించింది.

జెనీవా,న్యూయార్కులలో చేపట్టిన పలు తీర్మానాలకు భారత్ మద్దతు తెలిపింది. ముఖ్యంగా బెలారస్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై అలాగే భావప్రకటనా స్వేచ్ఛపై పరిమితులను నిరాకరిస్తూ భారత్ అండగా నిలవడం పట్ల బెలారస్ తన ఆనందాన్ని వ్యక్తంచేసింది. భారత్‌ కొత్తగా ఎదుగుతున్న ప్రపంచ శక్తిగా బెలారస్ గుర్తించింది. అందుకే భారత్‌తో వ్యూహాత్మక సంబంధాల్ని పెంపొందించుకోవాలని కోరుకుంటోంది. ఇటీవల ముగిసిన బెలారస్ అధ్యక్షుడి భారత పర్యటన ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది. అందుకే భారత్‌తో ఆర్థికపరమైన సంబంధాలను వేగవంతం చేసే దిశగా ప్రయత్నాలను ఆ దేశం ప్రారంభించింది. ఇది రెండు దేశాలకూ లబ్ది చేకూరుస్తుంది.