భారత్-జమైకా సంబంధాలు : సరికొత్త రాగం

కరీబియన్ సముద్రంలోని ద్వీపకల్ప దేశమైన జమైకా దేశ విదేశీ వ్యవహారాలు, విదేశీ వాణిజ్య మంత్రి కమినా జాన్సన్ స్మిత్ భారత్ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపును తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతేకాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కూడా మరింత ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోంది. జమైకా విదేశాంగ మంత్రి భారత దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఆమె పర్యటన న్యూఢిల్లీ, కింగ్‌స్టన్‌ల నడుమ విదేశీ వ్యవహారాల కార్యాలయాల సంభాషణల 5వ భేటీ సందర్భంగా చోటుచేసుకుంది. భారత దేశానికి జమైకాతో ఇంతో కాలంగా మంచి సంబంధాలున్నాయి. భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వి.కె.సింగ్ (రిటైర్డ్) గత రెండేళ్లలో రెండు పర్యాయాలు కింగ్‌స్టన్ పర్యటన చేయడమే అందుకు తార్కాణం.

జమైకా మంత్రి స్మిత్ తన పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాంతీయ, బహుపాక్షిక అంశాల్లో పరస్పర ఆసక్తులకు సంబంధిచింన అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, వైద్య పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, సంస్కృతి, పర్యాటక రంగాలకు సంబంధించిన అంశాల్లో దృఢమైన సహకారం అందజేసుకునే దిశలో పని చేయాలని వారిరువురు ఈ సందర్భంగా నిర్ణయించారు. భారత దేశం జమైకాకు 150,000 అమెరికన్ డాలర్ల విలువ చేసే ఔషధాలను సరఫరా చేసినందుకు జమైకన్ మంత్రి తన కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితోపాటు ఇటీవలి తుపానులకు ప్రభావితమైన ఇతర దేశాలకు 200,000 అమెరికన్ డాలర్ల సహాయం పట్ల కూడా ఆమె తన కృతజ్ఞతలు తెలిపారు.

జమైకన్ మంత్రి పర్యాటక సహాయ మంత్రి కె.జె.ఆల్ఫన్స్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి.నడ్డాలను కూడా కలిసారు. వారితో పర్యటక రంగం, ఆరోగ్య సంరక్షణ అంశాల్లో సహకారంపై చర్చించారు. వీటితోపాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సభ్యులతో కూడా సంభాషణలు జరిగాయి. ముంబైలోని ప్రముఖ ఐటీ కంపెనీలు, వ్యాపారవేత్తలను కూడా అమె కలుసుకున్నారు.

అయితే, భారత్-జమైకాల నడుమ ఆర్థిక, వాణిజ్య రంగంలోని ద్వైపాక్షిక చర్చలు జమైకా యొక్క స్వల్ప ఆర్థిక వ్యవస్థ, భారత దేశం నుంచి ఉండే దూరంతో కొన్ని పరిమితులకు లోబడ్డాయి. అయినప్పటికీ కరీబియన్ దేశంతో వాణిజ్యం విషయంలో గణనీయమైన ఒప్పందమే కుదిరింది. జమైకాలోని వాటర్ పంపుల నిర్మాణం కోసం భారత దేశం 2001లోనే 7.5 బిలియన్ అమెరికన్ డాలర్లు అప్పుగా ఇచ్చింది. అంతేకాక 2009లో ఐసీటీ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీ ఆ దేశంలో ఒక ఐటీ కేంద్రాన్ని కూడా నెలకొల్పింది. 2004లోని ఇవాన్ తుపాను బీభత్సంలోని బాధిత ప్రజలకు వైద్యం కోసం మానవతా సహాయంలో భాగంగా భారత దేశం 200,000 అమెరికన్ డాలర్ల ఔషదాలను, ఇతర వైద్య వస్తువులను సరఫరా చేసింది. 2014 మార్చిలో భారత ప్రభుత్వం, జమైకా ప్రభుత్వాల నడుమ సబినా పార్కులో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసేందుకు 2.1 మిలియన్ అమెరికన్ డాలర్లను అందజేసేందుకు ఒక అవగాహనా ఒప్పందం (ఎంవోయు) కుదిరింది.

కాగా, కాలక్రమంలో ఇరు దేశాల నడుమ వాణిజ్యం కూడా గణనీయంగా పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలోని గణాంకాలను పరిశీలిస్తే జమైకాకు భారత దేశం 43.44 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు చేసింది. అదే సమయంలో 1.17 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. దీన్ని బట్టి ఇరు దేశాల నడుమ 44.61 మిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారం జరిగగా ట్రేడ్ బ్యాలెన్స్ 42.27 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ నాటికి భారత దేశం నుంచి జమైకాకు 11.27 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తుల ఎగుమతి జరగగా, 2.92 మిలియన్ అమెరికన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. అంటే ఇరు దేశాల నడుమ 14.19 అమెరికన్ డాలర్ల వ్యాపారం జరగగా 8.35 మిలియన్ అమెరిన్ డాలర్ల బ్యాలెన్స్ మిగిలిపోయింది.

భారత దేశం నుంచి జమైకాకు ఔషధ ఉత్పత్తులు, మోటార్ పార్టులు, మినరల్ ఇంధనాలు, మినరల్ నూనెలు, వస్త్రాలు, పత్తి, పారిశ్రామిక మిషనరీలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ప్రిషియస్, సెమీ ప్రిషియస్ స్టోన్లు, ఆర్టిఫిషియల్ జువెలరీలు ఎగుమతి అవుతాయి. కాగా భారత దేశానికి దిగుమతి అయ్యే ఉత్పత్తుల్లో బీవరేజెస్, ఆర్గానిక్ కెమికల్స్, ఉక్కు వ్యర్థాలతోపాటు మరికొన్ని వస్తువులు ఉన్నాయి.

కరీబియన్ ద్వీప సమూహంలోని వివిధ దేశాలతో భారత్‌కు ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధాలున్నాయి. జమైకా, ట్రినిడాడ్, టొబాగో, గయానా, సురినామి దేశాల్లో భారీ సంఖ్యలో భారతీయ సంతతికి చెందిన వారు ఎంతో కాలం క్రితం నుంచే  స్థిరపడ్డారు. క్రికెట్ పట్ల ఇరు దేశాలకు ఉన్న ప్రేమ కూడా కరీబియన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. ఆఫ్రికా, ఆసియా, యురోపియన్ సంస్కృతుల కలబోతగా, వివిధ సంస్కృతుల సమ్మేళనంగా పేరుగాంచిన జమైకాలో భారత సంతతికి చెందిన వారు సుమారుగా 70,000 మంది ఉంటారు. వీరి పూర్వీకులు భారత దేశం నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. జమైకా జనాభాలో భారత సంతతికి చెందిన వారు దాదాపుగా మూడు శాతంగా ఉంటారు. గమనించవలసిన విషయం ఏమంటే జమైకాలో ప్రతి ఏటా మే 10వ తేదీన ‘భారత వారసత్వ దినాన్ని’ అధికారికంగా జరుపుతారు. డ్యూట ఫ్రీ వ్యాపారమైన జువెలరీ, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాల మార్కెట్‌పై ఇండో-జమైకన్ సంతతికి చెందిన వారే గుత్తాధిపత్యం చెలయించడం గమనార్హం.

రచన : వినిత్ వాహి, జర్నలిస్టు