కీలకమైన రేట్లలో మార్పు చేయని ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ-మానిటరీ పాలసీ కమిటీ) తన ఐదో ద్వైమాసిక విధాన ప్రకటనను విడుదల చేసింది. పరపతి విధాన కమిటీకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో కొనసాగుతుంది. రిజర్వ్ బ్యాంక్ రేట్ల విషయంలో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. రేట్లను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేట్లను పాత పద్ధతిలో 6 శాతం వద్ద, రివర్స్ రేపో రేట్టలను 5.75 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా ద్రవ్యోల్బణం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.3-4.7 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఆర్బీఐ చట్టం 1934కి చేసిన సవరణలో భాగంగా భారత దేశంలో పరపతి విధాన కమిటీని నియమించారు. విధానపరమైన రేట్లపై కేవలం ఆర్బీఐ గవర్నర్ ఒక్కడే తీసుకోకుండా చట్టబద్ధమైన, సంస్థాగతమైన ఎంపీసీ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆర్బీఐ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత సూక్ష్మ విధాన రూపకల్పన కోసం చేసిన ఈ సంస్థాగత సంస్కరణ ఫలితంగా ‘ఎన్ఎంఎఫ్’ (‘‘న్యూ మానిటరీ ఫ్రేమ్‌వర్క్’’)తోపాటు సెంట్రల్ బ్యాంకు లక్ష్యాలను కూడా పునర్ నిర్వచించవచ్చు. ఈ సంస్థాగతమైన సంస్కరణ అనంతరం ఆర్బీఐ ప్రధాన లక్ష్యం ధరల స్థిరీకరణగా మారిపోయింది. అప్పటి నుంచి ఆర్బీఐ ఎక్స్చేంజీ రేటు, ఉపాధి, అభివృద్ధి రంగాలలో బహుముఖ సూచి విధానానికి బదులు ద్రవ్యోల్బణంపై దృష్టి సారించడం మొదలుపెట్టింది.

పరపతి విధానంలో తటస్థ వైఖరిని అనుసరించాలనే ఎంపీసీ నిర్ణయంలో భాగంగా 6 శాతం కొనసాగించాలని భావించింది. దీంతో ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద అదుపులో ఉంటుందని అభిప్రాయపడింది. దీంతో ఆర్థికాభివృద్ధి తిరిగి పుంజుకుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సంస్కరణ చర్యలైన జీఎస్‌టీ, బ్యాంక్ రీ క్యాపిటలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు మెరుగుపడడడం లాంటి పరిస్థితుల వల్ల ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని ఎంపీసీ అంచనా వేసింది. వార్షిక జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) అంచనాలు 2018 ఆర్థిక సంవత్సరానికి 6.7 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఐదవ ద్వైమాసిన పరపతి విధాన ప్రకటన 2017-18లో ఆర్బీఐ 2017-18 అక్టోబర్ తీర్మానంలో వాస్తవ జీవీఏ వృద్ధి 6.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా ఈ రేటులో మార్పు ఉండదని భావిస్తోంది. ఐదవ ద్వైమాసిన పరపతి విధాన ప్రకటనలో ఆర్బీఐ పరోక్ష పన్నుల రాబడి తగ్గడం వల్ల ఫిస్కల్ స్లిప్పేజ్ సమస్య ఉంటుందని హెచ్చరించింది. ఇటీవల 178 వస్తువులపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు, పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గింపు, కొన్ని రాష్ట్రాలు వ్యవసాయం రుణాలు మాఫీ చేసిన కారణంగా ఈ రాబడి తగ్గుతోంది. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది.

అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లలో చేటుచేసుకుంటున్న పరిణామాలను కూడా ఎంపీసీ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యంగా బాండ్లలోని మార్పులు గమనించి రేట్లను యధాతథంగా కొనసాగించేందుకు దారి తీసింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని వడ్డీ రేట్లలో మార్పులు కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

తటస్థ వైఖరి అనుసరించాలని ఆర్బీఐ నిర్ణయంతో కొంత నిరాశ కూడా వ్యక్తమైంది. రేట్లను తగ్గించి ఉన్నట్లైతే దేశీయంగా మంచి డిమాండ్ పెరిగి, ప్రైవేటు పెట్టుబడులకు ఊతం వచ్చేదనీ, తద్వారా ఆర్థికాభివృద్ధి పుంజుకునేదనీ వాదన కూడా వినిపిస్తోంది.

అయితే రెపో రేట్లలో మార్పు చేసినప్పటికీ బ్యాంకులు తమ డిపాజిట్లను గానీ, వడ్డీ రేట్లలో గానీ ఎలాంటి సర్దుబాటు చేయని ఉదంతాలు ఉన్నాయి. విధాన పరమైన నిర్ణయాల వల్ల ప్రయోజనాలను ఆశించడం సహజమే అయినా భారత ఆర్థిక వ్యవస్థలోని వడ్డీ రేట్ల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రెపే రేట్లను తగ్గించడం ద్వారా ఆర్థికాభివృద్ధి ఊపందుకుంటుందనే విషయం కూడా వాస్తవం కాదు. ఈ నేపధ్యంలో ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ రేట్లలో యధాతథంగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం సమర్థనీయమైనదే. ఆర్బీఐ గవర్నర్ ఈ విషయమై మాట్లాడుతూ ఆహార, చమురు ధరల మార్పులతో వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చిందనీ, వాటి ప్రభావం ద్రవ్యోల్బణంపై పడుతుందన్నారు. అంతేకాక జీవన పరిస్థితుల వ్యయ భారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రేట్లను యధాతథంగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణమైందన్నారు.

ఎంపీసీ విధాన పరమైన నిర్ణయం ముందుగా ఊహించినట్లుగానే కార్పోరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ వర్గాలు ఈ వార్తను సానుకూలంగా స్వీకరించాయి. ద్రవ్యోల్బణంలో అదుపులో ఉంచాలనే ఒత్తిడి, అమెరికా ఫెడరల్ బ్యాంక్ (ఫెడ్) ఛైర్ పర్సన్ జానెట్ యెల్లెన్ తీసుకున్న నిర్ణయాలు రేట్లను యధాతథంగా ఉంచాలనే ఆర్బీఐ తాజా నిర్ణయానికి కారణమైంది. జానెట్ యెల్లెన్ ఇటీవల నవంబర్ నెలలో తీసుకున్న నిర్ణయంలో ఫెడ్ వడ్డీ రేట్లు భవిష్యత్తులో పెంచే అవకాశాలున్నాయని సూచనాప్రాయంగా తెలిపారు. దీని ప్రభావం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చిపడే పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఆర్బీఐ రేట్ల విషయంలో కొనసాగించిన తటస్థ వైఖరి ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌కు ఊతం ఇస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాక రుణాల పెంపు, ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.

రచన : డాక్టర్ లేఖ ఎస్.చక్రవర్తి, అసోసియేట్ ప్రొఫెసర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ