విదేశాల్లో భారత సంతతి వారు, విదేశాల‌లోని ప్ర‌వాస భార‌తీయులు – భారతదేశ గుర్తింపును పెంపొందించార‌ని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు.

విదేశాల్లో ఉంటున్న భార‌త సంత‌తికి చెందిన వారు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త‌దేశం గుర్తింపు, భార‌త ప్ర‌జ‌ల ప్ర‌తిష్ఠ‌ను ఉన్న‌త‌స్థాయికి తీసుకువెళ్లార‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఈ ఉద‌యం కొత్త ఢిల్లీలో భార‌త సంత‌తికి చెందిన పార్ల‌మెంటేరియ‌న్ల అంత‌ర్జాతీయ స‌ద‌స్సును ప్రారంభిస్తూ ఆయ‌న ఈ మాటల‌న్నారు. విదేశాల్లోని భార‌తీయ సంత‌తివారు భార‌తీయ సంస్కృతికి క‌ట్టుబ‌డి ఉన్నార‌ని, వేల‌మైళ్ల దూరంలో ఉన్నా వారు త‌మ మూలాల‌తో గొప్ప బంధం కొన‌సాగిస్తున్నార‌ని అన్నారు. ఇవాళ భార‌తీయ వంట‌కాల‌కు, భార‌తీయ సినిమాల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్ ఉందంటే అందుకు కార‌ణం భార‌త సంత‌తికి చెందిన వారు వీటిని సుదూర ప్రాంతాల‌లో ప‌రిచ‌యం చేయ‌డ‌మే న‌ని అన్నారు. భార‌తీయ సంత‌తికి చెందిన వారు దాదాపు అన్ని దేశాల‌లో ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నార‌ని, వారు ఎక్క‌డ ఉన్నా దానినే త‌మ ఇంటిగా భావించార‌ని అక్క‌డి స‌మాజం అభివృద్ధికి, ఆదేశ పురోభివృద్ధికి దోహ‌ద‌ప‌డ్డార‌ని అన్నారు.