కార్టిశాట్ -2 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వీ సి- 40 ఉపగ్రహం ద్వారా ఈ ఉదయం ప్రయోగించడానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది.

అంతరిక్ష ప్రయోగాల్లో మరో రికార్డు సాధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో సంసిద్ధమైంది. తన వందో ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాతావరణం అనుకూలిస్తే ఈ ఉదయం 9.29 గంటలకు ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లాలలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్ర నుంచి  పిఎస్.ఎల్.వీ-సి-40 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా 30 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. వీటిలో భారత్ కు చెందిన కార్టిశాట్ -2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్మ ఉప గ్రహాం ఉన్నాయి. వీటి ప్రయోగంతో భారత్ కు చెందిన మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లవుతుంది.

కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాకు చెందిన 28 ఉపగ్రహాలు కక్ష్యలోకి వెళ్లనున్నాయి. వీటిలో 25 నానో, మూడు మైక్రో ఉపగ్రహాలు ఉన్నాయి. కార్టటోశాట్-2ఇ బరువు 710 కిలోలు, మిగిలిన ఉపగ్రహాల బరువు 613 కిలోలు. పిఎస్ఎల్వీ శ్రేణిలో ఇది 42వ ప్రయోగం. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్ డౌన్ కార్యక్రమం గురువారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైంది. ఇది 28 గంటలపాటు కొనసాగుతోంది. ఇస్రో అధిపతి కిరణ్ కుమార్ శ్రీహరికోట చేరుకుని రాకెట్ ప్రయోగంపై శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ఆగస్టు 31న పిఎస్ఎల్వీ వైఫల్యం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ప్రయోగం ఇది.