గల్ఫ్ దేశాల్లో ప్రధాన మంత్రి విజయవంతమైన పర్యటన

రచన : పదమ్ సింగ్, ఆలిండియా రేడియో, వార్తా విశ్లేషకులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మధ్య ప్రాచర్యం విషయంలో భారత దేశ తీరుతెన్నుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో ఈ సంబంధాలు వ్యూహాత్మక స్థాయికి చేరాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన మరింత గుణాత్మక మార్పులు తీసుకువచ్చింది. పాలస్తినా, యూఏఈ, ఒమన్ దేశాల్లో ఆయన చేసిన పర్యటన ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతంతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసింది. పాలస్తినా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ అనంతరం అబు ధాబీ, దుబాయ్‌ల పర్యటన చేశారు. దుబాయ్‌లో ప్రధాని మోదీ ఆరవ ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో ‘గెస్ట్ ఆఫ్ హానర్’గా పాలుపంచుకున్నారు. అక్కడ ఆయన ‘సాంకేతికత, అభివృద్ధి’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు.

ప్రధాన మంత్రి మోదీ తన పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు, అబు ధాబీ పాలకుడు షేక్ ఖాలీఫా బిన్ జాయెద్అల్ నహ్యాన్, రాజకుమారుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లతో చర్చలు జరిపారు. యూఏఈ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ ముఖటౌమ్‌తో కూడా భేటీ అయ్యారు.

ఇరు వైపుల ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. యూఏఈతో భారత్‌కు ఇంధన సంబంధాలపై ఏకైక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారత దేశానికి చెందిన కంపెనీల కూటమి ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఓవీఎల్ (ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్) నేతృత్వంలో ఐవోసీ, బీపీఆర్ఎల్ కంపెనీలు ఈ కూటమిలో ఉన్నాయి. మానవ శక్తికి సంబంధించిన భారత్, యూఏఈల నడుమ మరో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎమిరేట్స్‌లో భారత దేశానికి చెందిన 3.3 మిలియన్ భారతీయ కార్మికులు పని చేస్తున్నారు. రైల్వే మార్గాలకు సంబంధించిన అవకాశాల అధ్యయనం కోసం భారత రైల్వే మంత్రిత్వ శాఖ, యూఏఈకి చెందిన ఫెడరల్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీల మధ్య ఒక ఎంవోయు కూడా కుదిరింది.

గల్ఫ్ దేశాలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవడానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే క్రమంలోనే తాను ఈ పర్యటనను చూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా చెప్పారు. సముద్ర జలాలను పంచుకునే పొరుగు దేశాలతో బహిరంగ సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత్, ఎమిరేట్స్‌తో బహుముఖ అంశాల్లో భాగస్వామ్యం ఏర్పర్చుకుంటుందని పేర్కొంది. ఈ భాగస్వామ్యంలో కొత్త స్థంభాలు నెలకొల్పుతున్నామని తెలిపింది. భారత దేశం కొత్తగా ఆర్థిక స్థంభాన్ని కూడా నెలకొల్పుతోంది. అరబ్ ప్రపంచంతో, లేదా గల్ఫ్ ప్రాంతంతో వ్యవహారాల విషయంలో ఇది భారత ప్రభుత్వ ఎజెండా అని పేర్కొంది. ఎమిరేట్స్‌లో హిందూ దేవాలయాన్ని నిర్మించుకునేందుకు అబు ధాబీ రాజు భూమిని కేటాయించినందుకుగాను ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

తన పర్యటనలో చివరి దశగా ప్రధాని మోదీ మస్కట్‌ను సందర్శించారు. సుల్తాన్ ఖబూస్ బిన్ సెయిద్ ఆహ్వానం మేరకు ఆయన మస్కట్‌లో పర్యటించారు. సుల్తాన్, భారత ప్రధాన మంత్రి తమ భేటీ సందర్భంగా పరస్పర ఆసక్తులు ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఈ చర్చలు అత్యంత స్నేహపూర్వక, సుహుద్భావ వాతావరణంలో జరిగాయి. అరేబియా, హిందూ మహా సముద్ర జలాలను పంచుకుంటున్న పొరుగు దేశాలుగా ఉన్న భారత్, ఒమన్‌లు సన్నిహితమైన, లోతైన చారిత్రక సంబంధాలను నెరపుతున్నాయని వారు అభిప్రాయానికి వచ్చారు. చారిత్రాత్మకంగా ఉన్న ద్వైపాక్షిక బంధాలను మరింత ఉత్సాహపూరితంగా సముద్ర వాణిజ్యానికీ, సాంస్కృతిక సమ్మేళనానికి విస్తరించుకోవడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చని వారు తమ భేటీ సందర్భంగా భావించారు. తద్వారా ఇరు దేశాలు పరస్పరం గౌరవించుకునే వీలు కలుగుతుందని ఆశించారు.

ఇరు పక్షాలు ప్రస్తుతం తమ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రత్యేకంగా బలోపేతమైన భద్రతా, రక్షణ రంగ సహకారంపై సంతృప్తిని వ్యక్తం చేశాయి. పరస్పర ఆసక్తులు ఉన్న మరిన్ని నూతన రంగాల్లో సహకారం అందజేసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. అంతరిక్ష, సైబర్ సెక్యూరిటీ, ఇంధన భద్రత, ఉనరుత్పాదక ఇంధనం, ఆహార భద్రత లాంటి అంశాల్లో కూడా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోడం ద్వారా సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఎనిమిది అంశాల్లో ఎంవోయూలు కుదిరాయి. తద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయనే నమ్మకం కుదిరింది.

భారత్, ఒమన్‌లు ఇరు దేశాలకు పరస్పర ఆసక్తి కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ ఆలోచనలు పంచుకున్నాయి. ఇందులో పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యం, దక్షిణాఫ్రికాలోని భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఈ చర్చలు ఫలవంతం కావడమే కాకుండా ఆయా అంశాలపై ఇరు దేశాలకు ఉన్న అందోళనలు, వ్యూహాలపై పరస్పర అవగాహన కుదిరింది. గల్ఫ్ ప్రాంతంలోని భద్రతా, సుస్థిర పరిస్థితులు భారత ఉప ఖండంతో ముడిపడి ఉన్నాయనే విషయం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

ఇరు పక్షాలు కూడా ఉగ్రవాదంతో పొంచి ఉన్న సాధారణ ముప్పును గుర్తించాయి. శాంతి, సుస్థిరతలకు ఇది ఆటంకం కలిగిస్తుందని అంగీకరించాయి. అందుకే దీనిపై ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన ఆవశ్యతను గుర్తించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దాని ఉద్దేశం ఏదైనా తీవ్రంగా ఖండించి తీరాల్సిందేనని తీర్మానానికి వచ్చాయి. అంతేకాదు ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్న దాన్ని సమర్థించలేమని ప్రకటించాయి.

ప్రధాన మంత్రి గల్ఫ్ పర్యటనలో ఇప్పటికే ఆ ప్రాంతంతో ఉన్న దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపును ఇచ్చినట్లైంది.