భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య బహుముఖ సంబంధాలు

ఫ్రెంచి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మక్రాన్ భారత్‌ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది భారత్, ఫ్రాన్సు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి పరుస్తుం.ది మరీ ముఖ్యంగా వ్యూహాత్మక స్థాయిలో చూస్తే  ఈ పరిణామం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత్ ఎదుగుతున్న గొప్ప ప్రపంచ శక్తిగా ఫ్రాన్స్ గుర్తించింది. ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌ది. నామమాత్రపు జిడిపి 2.45 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. ఇది కాకుండా విస్తృతస్థాయిలో మానవాభివృద్ధి శక్తిసామర్థ్యాలు సైతం భారత్‌లో పుష్కలంగా ఉన్నాయి.

భారత్, ఫ్రాన్సుల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఫలితంగా వాటి పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలు సైతం నిరాటంకంగా సాగుతున్నాయి. భారత తొలి శాంతియుత అణ్వాయుధ పరీక్ష పోఖ్రాన్-1  1974 సంవత్సంలో జరిగింది. ఆ సమయంలో ఫ్రెంచి అధ్యక్షుడు వాల్రే గిస్‌కార్డు డి ఎస్టేటింగ్ ప్రభుత్వం భారత నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపింది. పోఖ్రాన్-2 తర్వాత, అంటే 1999లో ఇతర పశ్చిమదేశాల వైఖరిలో  మార్పు వచ్చింది. అతి పెద్ద అణ్వాయుధ శక్తి ఉన్న దేశాల బృందంలో భారత్ కలవడాన్ని పశ్చిమదేశాలు ఇష్టపడలేదు. అణ్వాయుధ దేశాల బృందంలో భారత ప్రవేశాన్ని ఆ దేశాలన్నీ నిరాకరించాయి. కానీ ఫ్రాన్స్ వైఖరి మటుకు ఇందుకు భిన్నంగా ఉంది. పోఖ్రాన్-2 అణ్వాయుధ పరీక్షానంతరం ఫ్రాన్స్ భారత్‌పై ఎలాంటి ఆంక్షలూ విధించలేదు.

భారత, ఫ్రాన్సు దేశాల మధ్య సంబంధాలు విస్తృతమైనవి, వైవిధ్యమైనవి. ఈ సంబంధాలు ఫ్రెంచి అడ్వాన్స్ వెపన్ ఫ్లాట్‌ఫారమ్ అంశం మొదలు మిలిటరీ టెక్నాలజీ, పరస్పరం అత్యున్నత విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం, పైరసీ నియంత్రణ, మిలిటరీ బందోబస్తు వంటి అంశాలన్నీ ఇరుదేశాల మధ్య నిర్ధిష్ట ఫ్రేమ్‌వర్కులో కొనసాగుతున్నాయి. ఫ్రాన్సు, భారత్ దేశాలు పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాత్మక సముద్ర కారిడార్స్ ను స్వేచ్ఛా అంతర్జాతీయ వాణిజ్యానికి, అలాగే మిలటరీ డిప్లాయిమెంట్స్ కు నిర్వహిస్తున్నారు. అలాగే ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలోని సముద్రతీర దేశాలకు కూడా వర్తించేలా వాటిని కొనసాగిస్తున్నాయి. ఫ్రాన్స్, భారత్‌ల మధ్య పటిష్టమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. గ్లోబల్ అంశాలైన సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, ఐక్యరాజ్యసమితి సంస్కరణల పరంగా విస్తృతస్థాయిలో  ఈ రెండుదేశాల మధ్య ఒప్పందాలు సైతం చోటుచేసుకున్నాయి.

అధ్యక్షుడు మెక్రాన్, ప్రధాన మంత్రి మోదీ తమ మధ్య సంబంధాలను మెరుగుపరుచుకొని మరింత ఉన్నతమైన వ్యూహాత్మక దిశగా తీసుకువెళ్తున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర జలాల అంతర్జాతీయ నిఘా, భద్రతల విషయంలో ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి లక్ష్యాల్లో సహకరించుకునేందుకు సంసిద్ధత వ్యక్త పర్చుకున్నారు. దీని కోసం ఇరు దేశాలు తమ  సైనిక వసతులను వినియోగించుకోవడం, దక్షిణాసియా, ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలోని ఉగ్రవాదాన్ని కూడా అంతమొందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఈ విషయంలో ప్యారిస్ కూడా తన ఆసక్తులన ప్రదర్శించింది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతాలు ఫ్రాన్స్‌కు వలసలుగా ఉన్న నేపథ్యం ఉంది.

36 రాఫెల్ ఫైటర్ జెట్స్‌ను సరఫరా ఒప్పందం, రాఫెల్ పరికరాల సహ ఉత్పత్తి, దానికి సంబంధించిన ఇతర వ్యవస్థలకు సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, భారత్‌కు చెందిన నాగ్‌పూర్‌లోని రిలయన్స్ డిఫెన్స్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమీక్షించారు. భవిష్యత్తులో మరికొన్ని జెట్‌లను సమకూర్చుకునే విషయం కూడా పరిగణలో ఉంది. వీటితోపాటు స్టీల్త్ ఫ్రిగేట్ ఉత్పత్తి ప్రాజెక్టు ‘ప్రాజెక్ట్-75’, భారత్ నిర్మిస్తున్న తొలి ‘స్కార్పీన్’ జలాంతర్గామి, భారత దేశ దేశీయ పరిజ్ఞానంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) రూపొందిస్తున్న ఇంటర్‌సెప్టార్ ‘తేజాస్’కు ప్రత్యామ్నాయ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్‌లకు ఫ్రెంచ్ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ ‘సాఫ్రాన్’ సహకారంపై కూడా చర్చ జరిగింది.

ఇరు దేశాలు సుమారుగా 10 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వ్యాపారాన్ని సాగిస్తాయనే ఒక అంచనా వుంది. 2017 జనవరి-జులైలలో ఇరు దేశాల మధ్య మొత్తం 6.06 బిలియన్ యూరోల వ్యాపారం జరిగింది. 2008లో అణు సరఫరా బృందం (ఎన్ఎస్‌జీ) ఆంక్షలు ఎత్తి వేస్తూ పౌర వినియోగంలో అణు ఇంధన వ్యవస్థకు అనుమతులు ఇవ్వడంతో భారత్‌కు సరఫరాలు చేసేందుకు ఫ్రాన్స్‌కు మంచి అవకాశం వచ్చింది. భారత దేశం తన అణు ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఉన్నందున ఫ్రాన్స్‌కు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి.

అధ్యక్షుడు మెక్రాన్‌కు ముందు పదవిలో ఉన్న ఫ్రాంకోయిస్ హోలాండ్, భారత ప్రధాన మంత్రి నాడు ఒక ముఖ్యమైన ముందడుగు వేశారు. వాతావరణ మార్పులపై ఒక ఒప్పంద బృందాన్ని ఏర్పాటు చేశారు. 121 దేశాలతో కూడిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)ని ఏర్పాటు చేశారు. సుమారు 30 దేశాలు ఐఎస్ఏకు ఆమోదం తెలిపాయి. ప్రపంచం ప్రత్యామ్నాయ సంతులిత ఇంధన ఉత్పత్తి వాతావరణాన్ని నెలకొల్పే అవకాశాన్ని ఇది కల్పించింది. దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గడంతోపాటు ఓజోన్ పొర క్షీణించడం తగ్గిపోతుంది. అధ్యక్షుడు మెక్రాన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో డజన్ ప్రపంచ దేశాధినేతలతో కలిసి ఐఎస్ఏ ఏర్పాటు సదస్సుకు హాజరయ్యారు. దీంతో ఐఎస్ఏకు ఒక ఊపు వచ్చింది. ఈ క్రమంలో ఐఎస్ఏ విధించిన లక్ష్యం దిశగా ప్రపంచం పయనించే అవకాశం కనిపిస్తోంది. 2030 నాటికి 1000 గిగా వాట్ల సౌర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యం ప్రపంచం ముందు ఉంది. దీని కోసం 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆయా దేశాలు సమకూర్చాలనే అవగాహన ఉంది. ఇది అతి పెద్ద సవాలే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. ఫ్రెంచ్ అధ్యక్షుడు, భారత ప్రధాన మంత్రి ఇద్దరూ కలిసి ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో అతి పెద్ద సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ఇరు పక్షాలు అన్ని దేశాలకు బలమైన పిలుపునిచ్చాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం గానీ, మౌలిక వసతులు సమకూర్చడం లాంటి చర్యలకు పాల్పడకూడదని కోరాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వసం చేయాలని పిలుపునిచ్చాయి. అంతేకాదు వారికి నిధులు అందుతున్న దారులను కూడా మూసి వేయాలని కోరాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా నివారించాలని పిలుపునిచ్చాయి. మెక్రాన్, మోదీలు ఉగ్రవాద సంస్థల చర్యలపై సహకరించుకనేందుకు భారత్, ఫ్రాన్స్‌లు సహకారం అందజేసుకోవాలని ఒక అంగీకారానికి వచ్చారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు సరికొత్త ప్రయత్నాలు చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాల్ని నివారించాలని నిర్ణయించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ ఆశిస్తున్న శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఫ్రాన్స్ మరోసారి స్పష్టం చేసింది. భారీ విధ్వాంసాలకు దారి తీసే అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్, భారత్‌లు తమ ఆందోళనను కలిసి పంచుకున్నాయి. ఈ రంగంలో లక్ష్యాలను పంచుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

ఫ్రెంచ్ అధ్యక్షుని పర్యటన ద్వారా న్యూఢిల్లీ, ప్యారిస్‌ల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త ఊపు వస్తుందని భావించవచ్చు.

రచన: గౌతమ్ సేన్, వ్యూహాత్మక విశ్లేషకులు