పాక్ ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టిన నవాజ్ షరీఫ్

రచన : కౌశిక్ రాయ్, ఏఐఆర్, వార్తా విశ్లేషకులు

 పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తనను తాను, తన దేశ అధికార యంత్రాంగాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టారు. షరీఫ్ ప్రస్తుతం తన రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారు. పాకిస్తాన్ సుప్రీం కోర్టు ‘‘పనామా గేట్’’ కుంభకోణంలో ఆయనను ప్రధాన మంత్రి పదవికి అనర్హునిగా ప్రకటించింది. అంతేకాదు ఆయన తన సొంత పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఛైర్మన్‌గా కూడా కొనసాగేందుకు అర్హుడు కాదని సర్వోన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అధికారంలో ఉన్న ఆయన పార్టీ రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో పాల్గొనబోతోంది.

ఒక ఇంటర్వ్యూలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్ ఉగ్రవాద సంస్థలైన జమాత్-ఉద్-దావా, జైష్-ఎ-మహమ్మద్‌ల పేర్లు ప్రస్తావించకుండానే పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు చేపడుతున్నాయని అన్నారు. ‘‘వాళ్లకు ప్రభుత్వంతో సంబంధం లేదు. వాళ్లు సరిహద్దులు దాటి పక్క దేశంలోని వెళ్లి ముంబైలో 150 మందిని చంపెస్తే మేం చూస్తూ ఊరుకోవాలా? మనం ఎందుకు విచారణ పూర్తి చేయకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు.

షరీఫ్ తన మాటల్లోని ఉద్దేశాన్ని స్పష్టంగానే వెళ్లడించారని చెప్పవచ్చు. బాహ్య ప్రపంచానికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన అంశం ఏమంటే 2008 నవంబర్ 26 నాటి భయంకరమైన ముంబై దాడి వెనక పాకిస్తాన్ ప్రభుత్వ బాధ్యులు కూడా ఉన్నారు. ఈ దాడిలో అమాయకులైన 165 మంది భారతీయ, విదేశీ ప్రజలున్నాయి. ముంబై దాడుల తర్వాత నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు సంయుక్త విచారణ కోసం ఇంటర్ సర్వీసెస్ ఇంటలీజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్‌ను భారత దేశానికి పంపించేందుకు అంగీకరించారు. కానీ నాటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

దాడుల్లో పాల్గొన్న ఒకే ఒక ఉగ్రవాదిని మాత్రం భారత భద్రతా దళాలు పట్టుకోగలిగాయి. అమీర్ అజ్మల్ కసబ్ తనకు పాకిస్తాన్ ప్రభుత్వం శిక్షణను ఇచ్చిందని అంగీకరించాడు. అంతేకాక ఈ దాడులతో సంబంధం ఉన్న పాకిస్తానీ మిలటరీ అధికారుల పేర్లను కూడా వెల్లడించాడు. కాగా, ఈ కుట్రలోని సహ సూత్రధారి జకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అసలు సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేసినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం ప్రదర్శించింది. ఈ క్రమంలో భారత దేశం ముంబై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల వెనక పాకిస్తాన్ పాత్ర ఉందని రుజువు చేయగలిగింది. కానీ, ఇస్లామాబాద్ మాత్రం ఇందుకు ‘‘తగిన ఆధారాలు లేవని’’ అంటూ వస్తోంది.

లఖ్వీ, సయీద్‌లను ఏళ్ల తరబడి సకల మర్యాదలు చేస్తూ వస్తున్న పాకిస్తాన్ అధికారులు (ముఖ్యంగా సైనిక) షరీఫ్ తాజా అంగీకారంతో ఇరకాటంలో పడి పోయారు. అయితే విశ్లేషకులు మాత్రం షరీఫ్ మాటలను తప్పు పడుతున్నారు. 2017 సంవత్సరం నడుమ వరకు ఆయనే అధికార పగ్గాలు చేపట్టి ఉన్నారు. ఒకవేళ షరీఫ్‌కు తమ దేశం ఈ భయంకరమైన దాడుల వెనక ఉందని తెలిసినపుడు ఆయనే ఆయన హయాంలో వారి పట్ల కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని వారు వాదిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన మరో అంశం ఉండంటున్నారు. షరీఫ్ ప్రభుత్వ హయాంలోనే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాహార్ పర్యటనకు వచ్చి వెళ్లిన కొద్ది రోజులకే పథాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతకు ముందు షరీఫ్ అధికారంలో ఉన్న 1999లోనే కార్గిల్ యుద్ధం జరిగిన విషయం గమనార్హం.

భారత దేశంతోపాటు అంతర్జాతీయ సమాజానికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో అవలంబించే మెతక వైఖరిని గురించి స్పష్టంగా తెలుసు. కాగా, పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి మాటలతో ఆయన దేశం ఉగ్రవాదాన్ని ఒక విదేశాంగ విధానంగా వాడుకుటుందని స్పష్టమైంది. ఉగ్రవాదం విషయానికి వచ్చే సరికి పాకిస్తాన్ అనుసరించే ద్వంద్వ వైఖరికి కూడా అందరికీ తెలిసిందే.

పాకిస్తాన్‌లో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపధ్యంతో అవినీతి, ఇతర అంశాల్లో షరీఫ్, ఆయన కుమారులు, కూతురు పాకిస్తాన్ సుప్రీం కోర్టు నుంచి విచారణను ఎదుర్కొంటున్నారు. ముంబై దాడుల వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందని అంగీకరించే వ్యూహం వెనుక ఆయన తన అనుచరుల నుంచి సానుభూతిని, మద్దతును కోరుతున్నట్లుగా కూడా భావించవచ్చు. ఆయన ఒక ‘అమర వీరుని’ పాత్ర పోషించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ అది ఆయనకు ఎన్నో ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. ఆయన పార్టీ పీఎంఎల్, పాకిస్తాన్ సైన్యం షరీఫ్ ఇచ్చిన ప్రకటనను ఖండించాయి.

పీఎంఎల్ ఎన్ ఒక ప్రకటనలో నవాజ్ షరీఫ్ మాటలను భారత మీడియా వక్రీకరించిందని తెలిపింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్‌లోని కొందరు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు ఉద్దేశపూర్వకంగానో, తెలిసో, తెలియకో ‘‘ఇండియన్ మీడియా’’ అంటూ జరగుతున్న తప్పుడు ప్రచారానికి వంత పాడాయి. షరీఫ్ మాటల్లోని వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండానే తొందరపాటుకు లోనయ్యాయి. పాకిస్తాన్‌లోని జాతీయ భద్రత, విదేశాంగ విధానాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్‌సీ) షరీఫ్ మాటలను ‘‘ఆధారరహిత’’మైనవిగా కొట్టి పారేసింది. 26/11 ముంబై దాడులను పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపారనే షరీఫ్ బహిరంగ అంగీకారాన్నివాస్తవ విరుద్ధమైనదని ఖండించింది.

అయితే, షరీఫ్ ఒక బహిరంగ సభలో ఉగ్రవాదానికి, ప్రస్తుత పరిణామాలకి ఎవరు బాధ్యులో గుర్తించాల్సిన సమయం పాకిస్తాన్‌కు వచ్చిందన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ ఒంటరిగా మారేలా ఎవరు చేశారు. ఎందుకు అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ చెప్పిన మాటలను విశ్వసించడం లేదు’’ అని ప్రశ్నించారు. ఈ దుస్థితి వచ్చేందుకు ఎవరు బాధ్యులు అని నిలదీశారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పై ఉంది.

షరీఫ్ ప్రకటనతో భారత దేశం ఇంత కాలంగా చెబుతూ వస్తున్న మాటలు నిజమే అని తేలింది. అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడైనా ముంబై దాడులకు కారణమైన ఉగ్రవాదులను శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.