కొరియా ద్వీపకల్పంలో ఉదయించిన కొత్త శకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా ఛైర్మన్ కిమ్ జాంగ్-యున్‌ల మధ్య సింగపూర్‌లో మంగళవారం చారిత్రక సమావేశం జరిగింది. వీరి సమావేశం కొరియా ద్పీపకల్పంలో నూతన శకానికి నాంది పలికింది. అంతర్జాతీయ అగ్రశక్తులు కొరియా ప్రజలను విడగొట్టిన తర్వాత, 1950-53లో జరిగిన కొరియాన్ యుద్ధం అనంతరం, అలాగే యున్ కమాండ్, చైనీస్ వలంటీర్స్ ఆర్మీ, ఉత్తర కొరియా సైన్యం మధ్య 1953 జులైలో యుద్ధవిరమణ ఒప్పందం సంతకాల అనంతరం… ఈ మధ్య ఎలాంటి సంబంధాలూ లేవు. ఎలాంటి శాంతి సంధి కూడా వీటి మధ్య జరగలేదు.
గత సంవత్సర కాలంగా ఉత్తర, దక్షిణ కొరియా ప్రజలు అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటు న్నారు. కొన్నిసార్లు వీటిపై యుద్ధ మేఘాలను అమెరికా సృష్టించింది. మరికొన్ని సార్లు శాంతి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించింది. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఎంతో శ్రద్ధ, నిబద్ధతలతో ఉత్తర కొరియా, ఆ దేశ ఛైర్మన్ కిమ్ జాంగ్-యున్‌తో సయోధ్యా ప్రయత్నాలు చేశారు. వాటికి కిమ్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎంతో సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అక్కడ పరిస్థితుల్లో మార్పు పొడసూపింది.

ఎంతకాలం నుంచో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న అస్థిర పరిస్థితులను మలుపు తిప్పిన సంఘటన ఏప్రిల్ 27న జరిగింది. ఆ రోజు రెండు కొరియా దేశాల అధినాయకులు ప్రెసిడెంట్ మూన్ జె-ఇన్, ఛైర్మన్ కిమ్ జాంగ్-యున్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం చోటుచేసుకుంది. శాంతి, సంపదల స్థాపనకు, ఇరు కొరియాల ఐక్యతలకు పిలుపునిస్తూ వీరు విడుదల చేసిన పాన్‌మున్జోమ్ డిక్లరేషన్ ఎంతో చారిత్రాత్మకమైంది. అదే ట్రంప్-కిమ్‌ల శిఖరాగ్ర సదస్సు సాధ్యమయ్యేలా బీజం వేసింది. చరిత్రలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది.
మంగళవారం ట్రంప్, కిమ్‌ల మధ్య సమావేశానికి ముందు అమెరికా, ఉత్తర కొరియా వర్గాల మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. గత నెల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కిమ్‌తో శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం లేదని ప్రకటించడంతో సదస్సు జరగలేదు. అయితే ట్రంప్ తెలివిగా ఆ దేశంతో చర్చల కొనసాగింపుకు ద్వారాలు తెరిచే ఉంచారు. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ వెంటనే రెండవసారి ఉత్తర కొరియా ఛైర్మన్ కిమ్‌తో సమావేశమయ్యారు. ఈ సదస్సు జరిగేలా సహకరించాలని ట్రంప్, కిమ్‌లను ఆయన కోరారు.

మొత్తానికి మంగళవారం (జూన్ 12)న ట్రంప్, కిమ్‌ల మధ్య జరిగిన సమావేశం ఆశించిన ఫలితాలను సాధించింది. ఇందులో ఉత్తర కొరియాకు సమానమైన అధికార స్థాయిని కల్పించడం ప్యోంగ్యాంగ్‌కు గొప్ప విజయంగానే చెప్పాలి. అమెరికా అధ్యక్షడు ట్రంప్, ఉత్తర కొరియా ఛైర్మన్ కిమ్ ఇరువురు ఒకరిపట్ల మరొకరు ఎంతో సుహృద్భావంతో మెలిగారు. సంతకాలు జరిగే కార్యక్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ ఛైర్మన్ కిమ్‌ని కలవడం ఎంతో గౌరవపూర్వకమైన అవకాశంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇరు దేశాల నాయకుల మధ్య ప్రత్యేకమైన ఆత్మీయానుబంధం ఉందని అన్నారు. నిజంగానే ఇరుదేశాల నేతలు ఒకరి పట్ల మరొకరు మాటల ప్రశంసలు కురిపించుకున్న వైనం చూస్తే గత ఏడాది వీరిరువురు ఎంతో నాటకీయంగా ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలకు, ప్రస్తుతం వారిరువురి మధ్య నెలకొన్న ‘సన్నిహిత బంధం’ ఊహించనిది.
ఇద్దరు నాయకులు సమగ్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ చర్యతో ఇంతవరకూ కొరియా ద్వీపకల్పంలో కొనసాగుతూ వచ్చిన ఒత్తిడులతో కూడిన వాతావరణం నుంచి బయటపడ్డట్టయింది. ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ అందరూ ఊహించిన దానికన్నా కూడా చర్చలు బాగా జరిగాయని సంతృప్తిని వ్యక్తంచేశారు. అంతేకాదు అణునిరాయుధీకరణం కూడా చాలా వేగంగా ప్రారంభం కానుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
రెండు పేజీల ఒప్పందం ఎంతో సంక్షిప్తంగా ఉంది. వివరాలు గోప్యంగా ఉన్నాయి. కానీ భవిష్యత్ లక్ష్యాల పరంగా ఇరుదేశాల నాయకుల మధ్య స్పష్టత బాగా ఉంది. శాంతి, సంపదల స్థాపనకు నూతన యుఎస్-డిపిఆర్‌కె సంబంధాల పరంగా నిబద్ధులమై ఉన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో సుస్థిరమైన, శాంతియుతమైన పాలనకు సమిష్టి ప్రయత్నాలు చేస్తామని కూడా ఈ ప్రకటన పేర్కొంది. ఉత్తర కొరియా భద్రతకు సంబంధించిన గ్యారెంటీని కూడా ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. మూడవది, ముఖ్యమైనది ఏమిటంటే కొరియా ద్వీపకల్ప ప్రాంతం పూర్తిగా అణ్వాయుధ నిరాయుధీకర జరిగేలా డిపిఆర్‌కె నిబద్ధతతో పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఉత్తర కొరియా మీద విధించిన ఆంక్షల ఎత్తివేత గురించి మాత్రం ఈ ప్రకటనలో లేదు. కానీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ డిపిఆర్‌కె అణ్వాయుధాల నిరాయిధీకరణ విషయంలో శక్తివంతంగా వ్యవహరిస్తోందని అమెరికాకు నమ్మకం కలిగిన వెంటనే ఉత్తర కొరియాపైనున్న ఆంక్షలు ఎత్తివేయడం జరుగుతుందని ప్రకటించారు.

చాలా రకాలుగా అక్టోబర్ 1994లో చేసుకున్న ‘అగ్రీడ్ ఫ్రేమ్‌వర్కు ఫర్ డిపిఆర్‌కె అణునిరాయుధీకరణ ఒప్పందాన్నే జూన్ 12న చేపట్టిన ఒప్పందం కూడా పోలి ఉంది. ఈ ఒప్పందం ఉత్తరకొరియా,అమెరికాల మధ్య జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా క్లింటన్ ఉన్నారు. కానీ తర్వాత ఇరుదేశాల మధ్య అవిశ్వాస పరిస్థితులు నెలకొని, పరస్పర ఆరోపణల యుద్ధం తీవ్రతరం కావడంతో ఆ ఒప్పందం కాస్తా అటక ఎక్కింది.

ఈ ఒప్పందం అమలుచేసే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపెకి పెను సవాళ్లే ఎదురుకానున్నాయని చెప్పాలి. ఈ ఒప్పందం అమలుకు ఆయన బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమావేశ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఉత్తరకొరియా ఛైర్మన్ కిమ్ ఇరువురూ మంచి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు సుస్థిరమైన వ్యక్తిగత సంబంధాలు వృద్ధి చెందేలా ఇరు దేశాల మధ్య మంచి కెమిస్ట్రీకి వీరిరువరూ గట్టి పునాదులు వేశారు. ఇది రానున్న కాలంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ట్రంప్, కిమ్‌ల మధ్య విజయవంతంగా జరిగిన సమావేశాన్ని అభివృద్ధికి సానుకూల మలుపుగా భారత్ అభివర్ణించింది. మన:స్ఫూర్తిగా ఆహ్వానించింది. యుఎస్-డిపిఆర్‌కె శిఖరాగ్ర సదస్సు నిర్ణయాలు అమలు అవుతాయని, కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని భారత్ ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. గతంలో పాకిస్తాన్, డిపిఆర్‌కెల మధ్య రహస్యంగా కొనసాగిన అణు,క్షిపణి సాంకేతిక పరిజ్ఘానాన్ని గురించి ప్రస్తావిస్తూ, కొరియా ద్వీపకల్ప తీర్మానం దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని భారత పొరుగున వ్యాపిస్తున్నఅణ్వాయుధసమీకరణ సంబంధాల విస్తృతికి సంబంధించిన ప్రమాదాన్ని కూడా చర్చిస్తారనే ఆశను భారత్ ఈ సందర్భంగా వ్యక్తంచేసింది.

సంక్షిప్తం చేస్తే, ఇరు కొరియాల మధ్య గత సంవత్సర కాలంగా పరచుకున్న యుద్ధ మేఘాలు తొలిగాయి. కానీ కనపడుతున్న రహదారి ఎత్తుపల్లాలతో ఉందనడంలో సందేహం లేదు. ఎందుకంటే తన అణ్వాయుధ శక్తిని వినాశనం చేయడానికి ఉత్తర కొరియా గట్టి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పరస్పర మినహాయింపులను కూడా గట్టిగా డిమాండ్ చేస్తోంది.

రచన: ఎఎంబి. స్కంద్ రంజన్ తయాల్,  దక్షిణ కొరియాకు భారత మాజీ రాయబారి