దేశంలో స్వ‌యం స‌హాయ బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో కీల‌క‌ పాత్ర పోషిస్తున్నాయ‌ని ముఖ్యంగా కుటీర ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌కుల‌కు, కూలీల‌కు ఎంత‌గానో తోడ్పాటునిస్తున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ చెప్పారు.

దేశంలోని స్వ‌యం స‌హాయ బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ముఖ్య‌మైన పాత్ర పోషిస్తున్నాయ‌ని, ప్ర‌త్యేకించి కుటీర ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌కులు, కూలీల‌కు ఎంతో తోడ్పాటునిస్తున్నాయ‌ని ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ స్వ‌యం స‌హాయ బృందాల్లోని కోటి మందికిపైగా స‌భ్యులతో ఈ ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాన‌మంత్రి మాటామంతీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. పేద‌ల ఆర్థిక వృద్ధికి… ప్ర‌త్యేకించి మ‌హిళ‌లను ప్ర‌గ‌తి ప‌థంలో న‌డ‌ప‌డంలో స్వ‌యం స‌హాయ బృందాలు మూల స్తంభాలుగా నిలుస్తున్నాయ‌ని మోదీ ఈ సంద‌ర్భంగా కొనియాడారు. సామాజికంగాగానేగాక‌ ఆర్థికంగా కూడా మ‌హిళ‌లను ఈ బృందాలు శ‌క్తిమంతులుగా రూపొందిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. దృఢ సంక‌ల్పానికి, ప‌ట్టుద‌ల‌కు ఈ మ‌హిళ‌లంద‌రూ తిరుగులేని నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌శంసించారు. మ‌హిళ‌లు త‌మ శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను, నైపుణ్యాల‌ను గుర్తించే అవ‌కాశం క‌ల్పించ‌డమే వారికి సాధికార‌త క‌ల్ప‌న‌లో అత్యంత ముఖ్య‌మ‌న్నారు. దేశమంత‌టా ప్ర‌తి రంగంలోనూ మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో ప‌నిచేస్తున్నార‌ని, ముఖ్యంగా మ‌హిళ‌ల పాత్ర‌లేని వ్య‌వ‌సాయ‌, పాడి ప‌రిశ్ర‌మ రంగాల‌ను ఊహించ‌లేమ‌ని చెప్పారు. దేశంలోని 2.5 ల‌క్ష‌ల పంచాయ‌తీల ప‌రిధిలోగ‌ల ల‌క్ష‌లాది గ్రామీణ పేద‌ల‌కు సుస్థిర జీవ‌నోపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాని చెప్పారు. ఈ మేర‌కు జాతీయ గ్రామీణ జీవ‌నోపాధి క‌ల్ప‌న కార్య‌క్ర‌మం కింద దీన‌ద‌యాళ్ అంత్యోద‌య ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని గుర్తుచేశారు.