భారత-దక్షిణ కొరియా సంబంధాలు: భవిష్యత్ సహకారంపై చూపు

భారత ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’, దక్షిణ కొరియా ‘న్యూ సౌందరన్ పాలసీ’ సమ్మేళనంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జె-ఇన్‌లు  సంయుక్తంగా భారత-దక్షిణ కొరియాల ద్వైపాక్షిక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ నాలుగురోజులు భారతదేశ పర్యటనలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భారత ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’, ‘స్మార్ట్ సిటీస్’ వంటి ముఖ్య కార్యక్రమాలలో దక్షిణ కొరియా ముఖ్య అభివృద్ధి భాగస్వామి. అంతేకాదు మనదేశం 10 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను అభివృద్ధి సహాయంగా ఆ దేశానికి అందిస్తానని కూడా ప్రతిపాదించింది. అంతేకాదు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మినహాయింపులతో కూడిన క్రెడిట్‌ను కూడా ఇవ్వనున్నట్టు 2015 సంవత్సరంలో సియోల్‌లో ప్రధాని మోదీ పర్యటించినప్పుడు మాటిచ్చారు. కొరియా ‘ఎకనామిక్ డెవలెప్‌మెంట్ కో-ఆపరేషన్ ఫండ్ అండ్ ఎక్స్ పోర్టు క్రెడిట్’ కింద రెండు దేశాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.

భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం వల్ల దక్షిణ కొరియా తయారీరంగం బలపడింది. మూన్ బారత పర్యటనలో  సాంసంగ్ తయారీ ప్లాంట్‌కు బీజం పడింది. 2020 సంవత్సరం నాటికి  సంవత్సరానికి 120 మిలియన్ల మొబైల్ ఫోన్ల ఉత్పత్తులను లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పెట్టుకుంది. దీన్ని ఇరుదేశాల నాయకులు కలిసి ప్రారంభోత్సవం చేశారు. దీని వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశంతోపాటు ఫోన్లను అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశించేలా ఎగుమతులను కూడా చేపడుతున్నారు. 2017 లో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఆటోమొబైల్ తయారీ విభాగం ఏర్పరచడానికి కియో మోటర్స్ ఎంవొయు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అదనంగా దక్షిణ కొరియా ప్రెసిడెంట్ పర్యటనలో పలు ఎంవొయులు ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వాణిజ్యం, యాంటీ-డంపింగ్, సబ్సిడీలు, కమర్షియల్ ప్రయోజనాలకు అనుగుణంగా నూతన సాంకేతికపరిజ్ఘానాన్ని ప్రవేశపెట్టడం వీటిల్లో ఉన్నాయి. ఇందులో ‘ఇంటర్నెట్ థింగ్స్’ తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, అత్యాధునిక టెలికమ్యూనికేషన్ సేవలను అభివృద్ధి పరచడం,  ఖరీదు తక్కువగా ఉండే నీటి శుద్ధి సాంకేతిక పరిజ్ఘానం ప్రగతి, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌ పోర్టు సిస్టమ్, శాస్త్రీయ అధ్యయనాలు, పట్టణ మౌలికవ్యవస్థ, స్టార్టప్ ఎకోసిస్టమ్, నైపుణ్య శిక్షణ, పునరుత్పత్తి శక్తి, రైల్వేస్ పరంగా సంయుక్త అధ్యయన ప్రాజెక్టులు, అలాగే అత్యాధునిక ఆర్ అండ్ డి సౌకర్యం, అంతర్జాతీయ పోటీకి తగ్గట్టుగా చిన్న, సూక్ష్మ, మధ్యంతర పరిశ్రమల పురోభివృద్ధి వంటివి  కూడా ఉన్నాయి.

నౌకా నిర్మాణం, సెమి కండక్టర్లు, ఆటోమోబైల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో దక్షిణ కొరియాకు ఉన్న నైపుణ్యం ఆ దేశాన్ని ఎగుమతి ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దగా, భారత దేశం వాటికి అవసరమైన మార్కెట్‌గా విస్తరిస్తోంది. భారత దేవంలోని ఐటీ సాఫ్ట్‌వేర్ రంగంలోని నైపుణ్యం, దక్షిణ కొరియా ఐటీ హార్డ్‌వేర్‌, డిజైనింగ్, ఇంజనీరింగ్, ఉత్పత్తిలోని నిపుణత ఇరు దేశాల మధ్య ఒక బంధం పెనవేసుకుపోయాలా దోహదపడుతోంది. ఒకవేళ భారత దేశం కొరియా దిగుమతుల మార్కెట్‌లో ప్రవేశించాలనుకుంటే ప్రాధమిక సరకులతోపాటు హైటెక్ ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. 2017లోని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గమనించినట్లయితే అది 20 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. భారతదేశానికి కొరియా నుంచి వచ్చే ఎఫ్‌డీఐ 6.8 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇరు పక్షాలు తమ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సీఈపీఏ)ని మరింత పటిష్టం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఒక సంయక్త ప్రకటన కూడా చేశాయి. సీఈపీఏని నవీకరణ చేసేందుకు స్వేచ్ఛా వాణిజ్యానికి ఆస్కారం ఉన్న కీలకమైన రంగాలను కూడా గుర్తించింది. ఇందులో భాగంగా తొలి దశలో రొయ్యలు, మొల్కుస్క్‌లు, శుద్ధీకరణ చేపల మార్కెట్‌పై దృష్టి సారించాయి.

భారత్-రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన సీఈవోల ఫోరమ్ ఆరు కార్యాచరణ గ్రూపులుగా విడిపోయి పలు సంస్థలను సందర్శించింది. ఇందులో ఆటో, మౌలిక వసతులు, సేవలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, అంకుర సంస్థలులతోపాటు ఆవిష్కరణ వ్యవస్థలైన ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు, రక్షణ ఉత్పత్తుల రంగాలు కూడా ఉన్నాయి.

‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’లో భాగంగా ఇరు దేశాల నేతలు రక్షణ రంగ పరిశ్రమల విషయంలో సహకారాన్ని మరింత పుంజుకునేలా చూడాలనే అంశంపై లోతుగా చర్చించారు. 2017 తొలి రోజుల్లో ఇరు పక్షాలు ‘నౌకా నిర్మాణంలో రక్షణ రంగ పరిశ్రమ సహకారం’ విషయంలో ప్రభుత్వాంతరం ‘ఎంవోయు’ని కూడా కుదుర్చుకున్నారు.

ప్రాంతీయ స్థాయిలో చూస్తే భారత్-దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు ప్రజాస్వామిక విలువలు, స్వేచ్ఛా విఫణి ఆర్ధిక వ్యవస్థ, చట్టబద్ధత, శాంతి, సుస్థిర, భద్రతల పట్ట నిబద్ధత లాంటి కీలకమైన మూల స్థంబాలపై ఆధారపడి ఉంది. అంతేకాదు బహిరంగ, నియమబద్ధమైన పాలనల ఆధారంగా సాగే వ్యవస్థలు ఇరు దేశాల  మధ్య సారూప్యంగా ఉంటాయి. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలు నెలకొల్పేందుకు అవసరమైన సహాయం అందించడంలో భాగంగా న్యూఢిల్లీ, సియోల్‌లు మూడో దేశాల్లో త్రైపాక్షిక అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలనీ, ఈ క్రమంలో అప్ఘనిస్తాన్‌లో కూడా నైపుణ్యాభివృద్ధికి దోహదపడాలని నిర్ణయించాయి.

ఇంకా చెప్పాలంటే ఈశాన్య ఆసియా, దక్షిణాసియా మధ్య ఆయుధ సరఫరా సంబంధాలను దృష్టిలో పెట్టుకొని భారత్, దక్షిణ కొరియాలు అక్రమాయుధాల సరఫరాను అరికట్టేందుకు పరస్పరం సహకారం అందించుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. భారీ విధ్వంసానికి కారణమయ్యే ఈ ఆయుధాల సరఫరా వ్యవస్థను నాశనం చేయాలనీ, ముఖ్యంగా ఇవి ఉగ్రవాద సంస్థలు, ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు అందకుండా చూడాలని నిర్ణయించాయి. కొరియా ద్వీపకల్పం పూర్తి స్థాయిలో అణ్వస్త్ర రహితంగా తయారయ్యే క్రమంలో తీసుకున్న నిర్ణయాన్ని భారత్ అన్ని విధాలా సమర్థించింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి పునరుద్ధరింపబడేందుకు అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధపడింది. ఇటీవల ద్వీపకల్పంలో చోటుచేసుకున్న అంతర్ కొరియా శిఖరాగ్ర సదస్సు, సింగపూర్లో గత నెలలో జరిగిన చారిత్రాత్మక అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర సదస్సులను మంచి పరిణామాలని ఆహ్వానించింది. గతంలో కొరియా యుద్ధంలో భారత దేశ చారిత్రాత్మక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కొరియాలో శాంతి స్థాపనలో కూడా ‘‘లబ్ధిదారునిగా’’ సహకారం అందించేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, మూన్‌లు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించుకోవాలనీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు కృషి చేయాలని ఒప్పందానికి వచ్చారు.

 

రచన: డా.తిత్లీ బసు, తూర్పు, ఆగ్నేయాసియా వ్యూహాత్మక విశ్లేషకులు