చ‌ట్ట‌స‌భ స‌భ్యుడు నేర విచార‌ణ ఏ ద‌శ‌లో అన‌ర్హుడ‌వుతాడ‌న్న అంశంపై సుప్రీంకోర్టు ఈ రోజు వాద‌న‌లు వింటుంది.

క్రిమిన‌ల్ కేసుల విచార‌ణ సంద‌ర్భంగా వాటిలో నిందితులైన ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఏ ద‌శ‌లో అన‌ర్హులుగా ప్ర‌క‌టించాలో తేల్చ‌డానికి సుప్రీం కోర్టు ఇవాళ విచార‌ణ ప్రారంభిస్తుంది.  ఈ అంశంపై దాఖ‌లైన పిటిష‌న్ల విచార‌ణ చేప‌ట్టిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం 2016 మార్చి నెల‌లో వీటిని చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని పంచ స‌భ్య రాజ్యాంగ ధ‌ర్మాసనానికి నివేదించింది. ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై అభియోగాల న‌మోదు లేదా దోష నిర్ధార‌ణ సంద‌ర్భాల్లో ఎప్పుడు అన‌ర్హ‌త ప్ర‌క‌టించాల‌న్న‌ది విస్తృత ధ‌ర్మాస‌నం నిర్ణ‌యిస్తుంద‌ని అప్ప‌ట్లో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌దిత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై క్రిమిన‌ల్ కేసుల విచార‌ణ‌ను ఏడాదిలోగా పూర్తిచేయాల‌ని కింది కోర్టుల‌కు గ‌డువు కూడా నిర్దేశించింది. అలాగే వాయిదాల‌తో నిమిత్తం లేకుండా రోజువారీగా విచార‌ణ సాగాల‌ని ఆదేశించింది.