అమెరికాతో బలోపేతమవుతున్న భారత్ సంబంధాలు

అమెరికాతో భారత్ సంబంధాలు పటిష్టంగా కొనసాగుతూనే వస్తున్నాయి. భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉన్నారు.  2+2 సంభాషణల ఏర్పాటు పనుల్లో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు. అందులో భాగంగా రెండు దేశాలకు చెందిన విదేశ విధాన అధిపతులు,  భారత, అమెరికా దేశాల రక్షణ సంస్థల అధిపతుల మధ్య   చర్చలు చోటుచేసుకోనున్నాయి.

వచ్చే సెప్టెంబరులో  2+2 ఇండో-యుఎస్‌ల మధ్య సంభాషణ న్యూఢిల్లీలో జరుగుతుంది. అందులో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపే, భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, అమెరికా రక్షణ కార్యదర్శి జిమ్ మాటిస్, భారత రక్ష మంత్రి నిర్మలా సీతారామన్‌లు పత్యక్ష చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత నాణ్యమైన దిశగా, విస్తృతంగా పెంచుకునే దిశగా ఈ చర్చలు చేయనున్నారు.

భారత, అమెరికాల్లో నాయకత్వ మార్పు ఎప్పుడు సంభవించినా వ్యూహాత్మక సంభాషణల తీరుతెన్నులు, పద్ధతులు మార్పులకు గురవుతుంటాయి. కానీ ఇరుదేశాల ప్రభుత్వాల దృక్కోణంలో మాత్రం మార్పు ఉండదు. సుస్థిర సంబంధాలకే రెండు దేశాలూ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ప్రస్తుతం జాతీయ భద్రతా పరిస్థితులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు ఒకదేశంతో మరొక దేశం సంబంధాలు ఆధారపడి ఉన్నాయి.  అందుకే దౌత్య, రక్షణ సంభాషణల విషయంలో భారత్, అమెరికాలు నిరంతరాయంగా తమ కృషిని కొనసాగిస్తున్నాయి.

2+2 సంభాషణల నిర్వహణ సులభమే. అంతేకాదు  ఎంతో మృదువుగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే భారత, అమెరికాల విస్తృత రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలు వ్యతిరేకించలేనివి. కొన్ని రంగాలలో అభిప్రాయ విభేదాలు కూడా ఈ దేశాల మధ్య తీవ్రంగానే ఉన్నాయి. ఇవి పరిష్కరించుకోవాలంటే నిర్మాణాత్మక, వ్యూహాత్మక , సంపూర్ణ సంభాషణల ద్వారానే సాధ్యమవుతుంది. అలా తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఈ రెండు దేశాలు కొంతవరకూ తగ్గించుకునే లేదా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన అంశాలపై దృష్టిపెటేట అవకాశం ఉంది. అలాగే సంబంధాలు ఏ స్థాయిలోనూ దెబ్బతినకుండా ఈ ప్రయత్నం ఎంతగానో సహాయపడుతుంది కూడా.

ఇరుదేశాల మధ్య గతంలో  తగినంత దౌత్య ప్రయత్నాలు చోటుచేసుకోవడం వల్ల అమెరికా, భారత్‌ల మధ్య సంభాషణలు ప్రతిష్ఠంభనకు సైతం గురయ్యాయి. ఇవి ఎంత దూరం వెళ్లాయంటే ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రతిబంధకంగా నిలిచాయి. దీంతో రక్షణ, భద్రతా రంగాలలో ఇరుదేశాల మధ్య ఉన్న అవకాశాలు సైతం బెడిసికొట్టాయి. ఇలాంటి ప్రతిష్ఠంభనా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తకుండా నిరోధించడానికి 2+2 సంభాషణలు ఎంతగానో సహాయపడతాయి.

వాస్తవికమైన విషయం ఏమంటే కొన్నిఅంశాల్లో భారత్, అమెరికాల మధ్య కొన్ని తీవ్రమైన ద్వైపాక్షిక విబేధాలు ఉన్నాయి. అయితే వీటిని చర్చల ప్రక్రియ ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడం సాధ్యమవుతుంది. ఇలాంటి వివాదాస్పదమైన అంశాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న విధానం. అమెరికా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలగడమే కాకుండా దానిపై కొత్తగా మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇంధన దిగుమతుల ద్వారా భారత దేశ అవసరాలు తీర్చే అతి పెద్ద దేశాల్లో ఇరాన్‌ది మూడో స్థానం. దీంతో ఉత్తర-దక్షిణ కారిడార్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ ఎంతో ఉత్సాహంగా సహకరిస్తున్న విధానానికి ప్రతిబంధకం ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. అప్ఘనిస్తాన్, దక్షిణాసియా మార్కెట్లను చేరుకునేందుకు భారత్ ఈ కారిడార్ నిర్మాణానికి తనవంతు దోహదం చేస్తోంది. కానీ అమెరికా ఆంక్షలతో ఇది తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి వచ్చింది. భారత దేశం పెట్టుబడులు పెడుతున్న ఇరాన్‌లోని ఛబహర్ నౌకాశ్రయ అభివృద్ధి నెమ్మదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంక రెండో అంశం ట్రంప్ ప్రభుత్వం రష్యా విషయంలో అనుసరిస్తున్న వైఖరి. అమెరికా, భారత దేశంలో రక్షణ రంగ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అది ఆహ్వానించకూడని పరిణామమేమీ కాదు. భారత దేశం గత దశాబ్ధ కాలంగా అమెరికా నుంచి 15 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే రక్షణ పరికరాలను కొనుగోలు చేసింది. వాషింగ్టన్ ఈ లాభసాటి రక్షణ రంగ మార్కెట్‌లోని రష్యా ప్రవేశించకుండా విధించే ఆంక్షలు, ఇతర చర్యలు ఆశించిన ప్రయోజనాన్ని నెరవేరుస్తున్నట్లుగా కనిపించడం లేదు. భారత దేశానికి మినహాయింపులు ఇచ్చినా, అమెరికా అనుసరించే ఇలాంటి న్యాయాతీత, ఏకపక్ష ధోరణి మరింత అపనమ్మకాన్ని పెంచి, వ్యూహాత్మక భాగస్వామ్యం సున్నితంగా అమలు కాకుండా అనేక అడ్డంకులను కల్పిస్తుంది.

ఇక మూడో బలమైన విబేధం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పురోభివృద్ధిని ప్రోత్సహించడం, శాంతిని పరిరక్షించడం, సంక్షోభాలను నివారించడానికి సంబంధించిన యంత్రాంగాన్ని తయారుచేయడం. భారత ప్రభుత్వం ఇండో-పసిఫిక్ అనే విధానానికి ఎప్పుడైతే ఆమోదం తెలిపిందో అపుడే దాన్ని వ్యూహంగా భావించడం లేదు. భారత దేశం స్వేచ్ఛాయుతమైన, ప్రతిబంధకాలు లేని, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతం అనే భావనకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతోంది. భారత దేశం ఆసియన్-ఆఫ్రికన్ గ్రోత్ కారిడార్ అనే భావన పట్ల ఎంతో సౌకర్యంగా ఉంది. అంతేకాక ఇది వాస్తవ రూపం దాల్చేందుకు జపాన్‌తో కలిసి పని చేస్తోంది కూడా. పౌర యుద్ధం లాంటి నియంత్రణ, మినహాయింపులతో కూడిన వ్యూహాన్ని భారత దేశం ఎప్పుడైనా చాలా అసౌకర్యంగా భావిస్తుంది.

దక్షిణ చైనా సముద్ర జాలాల విషయంలో చైనా ఘర్షణ పూరితమైన వైఖరి, కొన్ని సైనో-ఇండియన్ సరిహద్దుల వివాదాలు, వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రతిపాదన విషయంలో అనుసరిస్తున్న శతృపూర్వకమైన కొన్ని ఆర్థిక కార్యకలాపాల కారణంగా భారత దేశం ఘర్షణతో కూడుకున్న విధానాన్ని అనుసరించే పరిస్థితి లేదు. ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి ధోరణితో వెళ్తున్నా భారత్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

2+2 చర్చలు ఇలాంటి పలు అనుమానాలను నివృత్తి చేయగలవు. పరస్పర నమ్మకాన్ని పెంచగలవు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల నడుమ ఉభయతారకమైన భాగస్వామ్యానికి అవసరమయ్యే వ్యూహాత్మక సంబంధాలను అభివృద్ధి చేయగలవని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

రచన: ప్రొ. చింతామణి మహాపాత్ర, ప్రొ. వైస్ ఛాన్సలర్, జెఎన్‌యు