రైల్వే, పవర్ ట్రాన్స్ మిషన్ ప్రాజక్టులను బంగ్లాదేశ్‌కు అంకితం చేసిన భారత్

 వేగవంతమైన పరిణామాల నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ షేక్ హసీనాలు సంయుక్తంగా మూడు అభివృద్ధి ప్రాజక్టులను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌లతో కలిసి ప్రారంభించారు.

బంగ్లాదేశ్ అభివృద్ధి నుద్దేశించిన ప్రాజక్టులు ఇవి. వీటిల్లో భారత్ అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ పంపిణీతో పాటు రెండు రైల్వే ప్రాజక్టులు, అఖారా-అగర్తలా రైలు మార్గం, అలాగే బంగ్లాదేశ్ రైల్వేస్‌కు సంబంధించిన కులారా-షహబాజ్‌పూర్ సెక్షన్ పునరుద్ధరణ వంటివి ఉన్నాయి. ఈ రెండింటి ఉద్దేశం రైల్వే అనుసంధానాన్ని మరింత మెరుపరచడంతో పాటు దక్షిణాశియా పొరుగు దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య  వ్యాపార, వాణిజ్యాలను అభివృద్ధి పరచాలనే.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు ప్రధాన ప్రాజక్టుల ప్రారంభం జరిగింది. ఇది న్యూఢిల్లీ, ఢాకాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పటిష్టపరుచుకోవాలన్న ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ‘అదనపు అనుసంధాన చర్యల ద్వారా ప్రజల జీవితాలను కాంతివంతం చేయడంతోపాటు బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య స్నేహాన్ని మరింత పెంపొందించు కోవాలనకుంటున్నాం’ అంటూ ఈ కార్యక్రమం జరిగిన వెనువెంటనే ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మోదీ మాటలు చాలు ఈ మూడు ప్రాజక్టుల ప్రాధాన్యం అర్థమవడానికి.

ప్రస్తుతమున్న భెరామరా (బంగ్లాదేశ్ లోని), బహరాపూర్ (భారత్ లోని) ట్రాన్స్‌ మిషన్ లైన్ల ద్వారా భారత్ అదనంగా 500 మెగావాట్ల విద్యుత్ పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.   మిడిల్ ఇంకమ్ దేశంగా 2021 నాటికి మారాలని బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయాణంలో భారత్ పాలుపంచుకోవాలన్న ఉద్దేశం స్పష్టంగా గోచరమవుతోంది. అలాగే 2041 నాటికి అభివృద్ధి దేశంగా బంగ్లాదేశ్ ప్రయాణం సాగాలనే లక్ష్యంలో కూడా భారత్ పాత్ర పోషించాలని భావిస్తోంది. ఈ ప్రారంభోత్సవ సమావేశంలో ఇదే విషయాన్ని భారత ప్రధాని తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ ప్రధాని హసీనా చేపట్టిన అభివృద్ధి లక్ష్యాల మీద ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా రానున్న రెండు దశాబ్దాల కాలాంలో బంగ్లాదేశ్‌ని మిడిల్ ఇంకమ్ దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశం దాకా వృద్ధి చేయాలన్న ఆమె ఆలోచనలను మెచ్చుకున్నారు. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఇరువురూ కూడా ఢిల్లీ, ఢాకాల నుంచి వీడియా కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

విద్యుత్ బదిలీ అనుసంధాన ప్రక్రియ పూర్తి అవడంతో బంగ్లాదేశ్‌కు అందిస్తున్న విద్యుత్ 1.16 గిగావాట్లకు చేరుతుందని ప్రధాని మోదీ చెప్పారు.  ఈ ప్రయాణాన్ని ఆయన మెగావాట్స్ నుంచి గిగావాట్స్ కు చేరమంటూ అభివర్ణించారు. అంతేకాదు ఇది భారత్, బంగ్లాదేశ్ సంబంధాలలో సువర్ణ శకంగా అభివర్ణించారు.

అఖారా-అగర్తలా రైల్ అనుసంధానం గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల సరిహద్దుల అనుసంధానంగా పేర్కొన్నారు. ‘రెండుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా దేశ అభివృద్ధి, సంపదలను నూతన స్థాయికి చేర్చవచ్చ’ని  ఆయన అన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ దిశగా స్థిరమైన ప్రగతి కొనసాగుతోందని కూడా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మూడు ప్రాజక్టులకు శ్రీకారం చుట్టడం వలన భారత్, బంగ్లాదేశ్‌ల మధ్యవి ద్యుత్, రైల్వే అనుసంధానతలు మరింత పెరిగాయని మోదీ అన్నారు.

 బంగ్లాదేశ్‌కి విద్యుత్ అదనపు పంపిణి, అలాగే త్రిపురలోని అగర్తలా, బంగ్లాదేశ్ లోని అఖారా రైలు మార్గ నిర్మాణాలతో పాటు బంగ్లాదేశ్‌ రైల్వేస్ కు చెందిన కులారా-షాబాజ్‌పూర్ సెక్షన్ పునరుద్ధరణ  రెండు దేశాలకు లాభాలు చేకూర్చేవే. ఇరు దేశాలు పరస్పర అభివృద్ధి సాధన దిశగా సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయి.

ఈ రైలు ప్రాజక్టులు భారత ఈశాన్యరాష్ట్రాలను బంగ్లాదే, ఆగ్నేయాసియాలతో రైల్వేల ద్వారా అనుసంధానం చేయాలనుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకూ ఆ దేశం నిర్లక్ష్యం  చేసిన వ్యాపార, వాణిజ్యాలను కూడా పెంపొందించాలనే ఉద్దేశంలో ఉన్నాయి.

బంగ్లాదేశ్‌కు చెందిన కులరా-షాబాజ్‌పూర్ సెక్షన్‌ను రెండు దేశాలు కలిపి పునరుద్ధరించాలని భావిస్తున్నాయి. భారత ఉపఖండం విడిపోయే ముందు నుంచి ఇవి ఉన్నాయి. ఈ రైల్వే లైన్‌ను ఒకసారి పునరుద్ధరించిన తర్వాత ట్రాన్స్ ఆసియన్ రైల్వే ప్రాజక్టులో ప్రధాన భాగం అవుతుంది. ఈ ట్రాన్స్ ఆసియన్ రైల్వే ప్రాజక్టు దక్షిణ ఆసియాను ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం చేసే లక్ష్యంతో ఏర్పడింది.

15.5 కిలోమీటర్ల పొడవు ఉన్న అఖారా-అగర్తలా రైలు మార్గం చిట్టాగాంగ్ పోర్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించడానికి ఉపకరిస్తుంది. ఈ చిట్టాగాంగ్ ఓడరేవు ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే ఓడరేవుల్లో ఒకటి. 2010లో షేక్ హసీనా భారత్ పర్యటించినపుడు ఈ రైల్వే లైన్ ప్రాజక్టుకు మార్గం సుగమమైంది. దీనివల్ల త్రిపుర, అస్సాం, పశ్చిమబెంగాల మధ్య దూరం తగ్గుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌లోని అఖారా ద్వరా కొల్‌కతాకు చేరుతుంది. వేసుకున్న పథకం ప్రకారం అంతా సవ్యంగా సాగితే ఈ ప్రాజక్టు రెండు సంవత్సరాలలో పట్టాలెక్కుతుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్రమోదీ భారత్-బంగ్లాదేశ్‌ దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలను ఒక మోడల్‌గా చూపాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పొరుగుదేశాల నాయకులు ఇరుగుపొరుగువారిలాగ మసలాలి. అలాంటి సంబంధాలు పొరుగుదేశాల ప్రజల మధ్య ఉండాలి. ప్రొటోకాల్ వంటి అంశాలకు తావు లేకుండా తరచూ పొరుగు దేశాలకు వెడుతూ వస్తూ ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు.

రచన: దిపాంకర్ చక్రవర్తి, స్పెషల్ కరస్పాండెంట్, ది స్టేట్స్‌ మన్