బిలాయ్ ఉక్కు క‌ర్మగారంలో సంభ‌వించిన అగ్ని ప్ర‌మాదం బాధితుల‌కు 30 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు.

భిలాయ్ ఉక్కు కర్మాగారంలో మంగళవారం జరిగిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 30 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందజేస్తామని కేంద్ర ఉక్కు శాఖామంత్రి చౌదరి బీరేందర్ సింగ్ ప్రకటించారు. గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు వల్ల  12 మంది మరణించడంతో పాటు 10 మంది గాయపడ్డ ఉక్కు కర్మాగారాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి వారసులకు  ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆ కుటుంబాలలోని పిల్లలకు డిగ్రీ స్థాయి వరకు ఉచిత విద్య అందజేయాలని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాల సభ్యులతో మంత్రి మాట్లాడారు. తీవ్రంగా గాయపడ్డవారికి 15 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆయన ప్రకటించారు. మంత్రి ప్రకటించిన నష్టపరిహారాన్ని తోడు మరణించిన వారి కుటుంబ సభ్యులు 33 నుండి 90 లక్షల రూపాయల స్టాట్యూటరీ కాంపెన్సేషన్ పొందుతారు. ప్లాంట్ ముఖ్య కార్య నిర్వహణాధికారితో పాటు  ఇద్దరు సీనియర్ అధికారులను నిన్న సస్పెండ్ చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ ఉక్కు కర్మాగారంలో ఈ దుర్ఘటన జరిగింది.