ర‌క్ష‌ణ భ‌ద్ర‌తా సంబంధాల పెంపు కోసం ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫ్రాన్స్‌లో మూడు రోజులు ప‌ర్య‌టిస్తున్నారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ లో నేటి నుండి 3 రోజుల పాటు  పర్యటించనున్నారు.  ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత ఒప్పందాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ సందర్భంగా  రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ తో నిర్మలా సీతారామన్ చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి. పరస్పర ప్రయోజనాల కోసం అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. సైనిక ఆయుధాలను ఉమ్మడిగా తయారు చేసుకునేందుకు ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరుపుతారని భావిస్తున్నారు.  మార్చిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మాక్రాన్ ఇండియా ను సందర్శించినప్పుడు ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల యుద్ధ నౌకలకు నౌకా స్థావరాలను పంచుకోవడంతో పాటు సైనిక సదుపాయాలను కూడా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయి.