సరికొత్త శక్తి పెంపుదలలో భారత్ అనూహ్య స్థాయిలో ముందంజ

కేంద్ర ప్రభుత్వ నూతన, పునరుత్పత్తి మంత్రిత్వ శాఖ ‘ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్’  (ఐఎస్ఎ), రెండవ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (ఐఒఆర్ఎ) ఎనర్జీ మంత్రిత్వస్థాయి సమావేశం, అలాగే రెండవ గ్లోబల్ రీ-ఇన్వెస్ట్ మీట్ అండ్ ఎక్స్‌ పోలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ మూడు కార్యక్రమాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.పునరుత్పత్తి శక్తిని వేగవంతం చేసే దిశగా ప్రపంచవ్యాప్తంగా  ప్రయత్నాలను పెంచడమే దీని లక్ష్యం. అంతేకాదు భారత ఎనర్జీ వాటాదారులను గ్లోబల్ పెట్టుబడిదారీ కమ్యూనిటీతో అనుసంధానం చేయాలన్న ఉద్దేశం కూడా దీని వెనుక ఉంది.

రెండవ గ్లోబల్ రీ-ఇన్వెస్ట్ ఇండియా-ఐఎస్ఎ పార్టనర్‌షిప్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్ పోలో 77 దేశాల నుంచి 20,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రతినిధుల్లో 40 దేశాల నుంచి మంత్రివర్గస్థాయి ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఈ అసెంబ్లీలో ఐక్యరాజ్యసమితి, మల్టీలేటరల్ డెవలెప్‌మెంట్ బ్యాంక్స్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, కార్పొరేట్ రంగ ప్రతినిధులు ఉన్నారు. 2018 ‘రీ-ఇన్వెస్టెంట్‌లో తొమ్మిది దేశాల సెషన్లు జరిగాయి. వీటిని ప్రధాన ఆర్ఇ దేశాలు అంటే ఫ్రాన్స్, అమెరరికా, ఫిన్లాండ్, యురోపియన్ యూనియన్లు నిర్వహించాయి.

గ్లోబల్ సోలార్ పవర్ స్పేస్‌లో ఐఎస్ఎ పోషిస్తున్న ప్రధాన పాత్రను పేర్కొంటూ, ప్రధాని నరేంద్రమోదీ ‘వాతావరణ న్యాయం’ ను తెలుసుకునేందుకు ఐఎస్ఎ ఒక వేదిక. అంతేకాదు భవిష్యత్తరాలవాళ్లకు మనం ఇస్తున్న అపురూపమైన కానుక. ప్రపంచంలో ప్రస్తుతం ఓపిఇసి (ఒపెక్) పొందుతున్న ప్రాధాన్యాన్ని భవిష్యత్తులో ఐఎస్ఎ పొందుతుంద’ని వ్యాఖ్యానించారు. చమురు బావులు నేడు పోషిస్తున్న పాత్రను సోలార్ ఎనర్జీ భవిష్యత్తులో పోషిస్తుంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కూడా ఇందులో పాల్గనడం ఐఎస్ఎకు ఐక్యరాజ్యసమితి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మాట్లాడుతూ ‘ఐఒఆర్ఎ’ దేశాల  ఎనర్జీ సవాళ్లు ఒకేరీతిలో ఉంటాయన్నారు. అందుకే వాటిని పరిష్కరించాలంటే పునరుత్పత్తి శక్తిసామర్థ్యంపై మనం దృష్టి కేంద్రీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2030 సంవత్సరం నాటికి శిలారహిత ఇంధన వనరుల ద్వారా 40 శాతం శక్తిని ఉత్పత్తి చేయాలని  భారత్ టార్గెట్‌ నిర్దేశించుకుంది. అలాగే 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పత్తి శక్తి టార్గెట్‌ను సులభంగా దాటగలమని భారత్ భావిస్తోంది. ప్రారంభ సమావేశంలో ప్రధాని ఒక ముఖ్యమైన ప్రతిపాదనను సైతం ముందు పెట్టారు. అదే ‘వన్ వరల్డ్, వన్ సన్ అండ్ వన్ గ్రిడ్’.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మనం అంతర్జాతీయంగా పునరుత్పత్తి శక్తి  విప్లవాన్ని చూస్తున్నామన్నది విస్పష్టం. అయితే  పెట్టుకున్నలక్ష్యాలను సాధించడంలో రాజకీయ నిబద్ధత లోపించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలనే బలీయమైన కోరిక ఉండాలి. అంతకన్నా ఎక్కువగా దాన్ని చేతల్లో చూబించాల్సిన అవసరం ఉంది’ అని అభిప్రాయపడ్డారు.

కేంద్ర పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ సహాయమంత్రి రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘మన ప్రధాని మనకు మరో సవాలు విసిరారు. అదే ‘వన్ వరల్డ్, వన్ సన్ అండ్ వన్ గ్రిడ్’. ఇది సుసాధ్యమే. ఈ లక్ష్యాన్ని మనం తప్పకుండా సాధిస్తాం’ అన్నారు.

పునరుత్పత్తి శక్తిపై న్యూఢిల్లీ చేసిన ప్రకటనను 21 దేశాలు స్వీకరించాయి. ఇది ఐఒఆర్ఎ  సభ్యదేశాల మధ్య హిందూమహాసముద్రం తీరప్రాంతాలతో పాటు, హిందూ మహాసముద్ర ప్రాంతానికి సంబంధించి సాధారణ పునరుత్పత్తి శక్తి ఎజెండా, సామర్థ్య పెంపుదల సవాళ్లను పరిష్కరించుకునే రీతిలో సహకారం అవసరమని ఢిల్లీ ప్రకటన పేర్కొంది.

భారత్ విజన్ 2020 సుసాధ్యం చేయాలంటే 76 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడి అవసరమవుతుంది. దీనికి కేవలం ప్రభుత్వ నిధులు మాత్రమే సరిపోవు. అందుకోసమే వినూత్నమైన ప్రైవేట్ క్యాపిటల్ అవసరం. అదే ప్రధాని మోదీ కలను సాకారం చేస్తుంది. పరిశుభ్ర శక్తి ప్రమాణాలను స్థిరీకరించేందుకు వ్యూహాత్మకమైన గ్లోబల్ భాగస్వామ్యం అవసరం. పునరుత్పత్తి శక్తి రంగంలో వేగంగా చెల్లింపులు జరిగేందుకు వీలు కల్పించే చెల్లింపుల భద్రతా యంత్రాంగ స్థాపన కూడా అవసరం. అలాగే సుదీర్ఘమైన పరస్పర సహాయసహకారాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. పునరుత్పత్తి శక్తి పెరుగుదల సాధ్యం అవాలంటే వేగవంతమైన రాజకీయ నిర్ణయాలతో పాటు, ఆఫ్రికాతో పాటు పలు ఖండాల మధ్య పరస్పర సహాయసహకారాలు అవసరం. అప్పుడే వాతావరణ మార్పులనే పెద్ద ప్రమాదకర సవాలును దృఢంగా ఎదుర్కోగలుగుతాం. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ‘గో గ్రీన్’ మార్గంలో పయనిస్తూ భారత్   పునరుత్పత్తి శక్తి ఉత్పాదనను గత మూడు సంవత్సరాల కాలంలో అంటే 2015-2018 సమయంలో 81 శాతానికి తీసుకురాగలిగింది. ముందరే పేర్కొన్నట్టు 2030 నాటికి శిలాజరహిత శక్తిని 40 శాతానికి పెంపొందించాలని లక్ష్యంగా భారత్ పెట్టుకుంది. అలాగే 2022 సంవత్సరం నాటికి 175 గిగావాట్ల పునరుత్పత్తి శక్తి ఉత్పత్తి సాధనను  లక్ష్యంగా పెట్టుకోవడం పెద్దదిగా కనిపిస్తున్నప్పటికీ దాన్ని సాధించడం సుసాధ్యమే. భారత్‌లో పునరుత్పత్తి శక్తికి మార్కెట్ బాగా ఉంది. గ్లోబల్‌గా ఉన్న ఎన్నో కంపెనీలు ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టి బాగా అభివృద్ధి చెందగలవు కూడా.

రచన: యోగేష్ సూద్, జర్నలిస్ట్