సైనికుల కృషి వల్లే 125 కోట్ల మంది ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరాఖండ్ లోని మారుమూల ప్రాంతాల్లో ఒకటైన హార్సిల్ లో పని చేస్తున్న ఐటిబిపి జవానులతో ఆయన ఈ దీపావళిని జరుపుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ఈ రోజు – దీపాల పండుగ దీపావళిని – సాంప్రదాయ బద్దమైన భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.   చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా గృహాలను, దేవాలయాలను, ఇతర భవనాలనూ – రంగు రంగుల దీపాలతో అందంగా అలంకరించారు.  ఈ సందర్భంగా ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పండుగను నిన్న జరుపుకున్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దీపావళిని ఉత్తరాఖండ్ లోని మారుమూల ప్రాంతాల్లో ఒకటైన హార్సిల్ లో పనిచేస్తున్న ఐటిబిపి జవానులతో, భారత సైనికులతో జరుపుకుంటున్నారు.  మారుమూల ప్రాంతాల్లో సైనికుల కృషి వల్లే దేశం బలీయమైన శక్తిగా ఉండగలుగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా జవాన్లతో అన్నారు.  125 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును, స్వప్నాలను జవాన్ల కృషి నిలబెడుతోందని ఆయన చెప్పారు.  మంచి ని వ్యాప్తి చేసి, భయాన్ని దూరం చేసే వెలుగుల పండుగగా దీపావళి ని ఆయన పేర్కొన్నారు.  అంకిత భావంతో, క్రమశిక్షణ తో పని చేస్తూ దేశప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ భయ రహితంగా ఉండేందుకు సైనికులు కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా జవాన్లకు మిఠాయిలు పంచారు. దీపావళి సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సమీప గ్రామాల ప్రజలతో ఆయన ముచ్చటించారు. రుద్ర ప్రయాగ జిల్లా లోని కేదారనాథ్ దేవాలయంలో – ప్రధానమంత్రి – ఈ రోజు ఉదయం  ప్రత్యేక పూజలు చేశారు.

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కు – నరేంద్రమోదీ – కృతజ్ఞతలు తెలియజేశారు.  రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ – అరుణాచల్ ప్రదేశ్ లోని దిన్ జన్, ఆండ్రా లా – ఓంకార్, అనిని ల వద్ద విధులు నిర్వహిస్తున్న భారత సైనిక దళాలతో – దీపావళి – జరుపుకుంటారు.  పాఠశాల విద్యార్థులు వేసిన చిత్రాలను – సైనికులకు – దీపావళి బహుమతిగా – అందజేస్తారు. అమరవీరుల కుటుంబాలను – ఆమె – కలుసుకుంటారు.

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  – దేశ ప్రజలకు – దీపావళి శుభాకాంక్షలు – తెలియజేశారు.   దేశ ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని, ఏకత్వ భావన కు కలిగించేందుకు దీపావళి దోహదపడుతుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. చెడుపై మంచి విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకుంటామని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఈ పండుగ అందజేయాలన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. దేశ ప్రజల జీవితాల్లో ఈ పండుగ  వెలుగులు వెదజల్లాలని ఆయన ఆకాంక్షించారు.