నాగరికతా సంబంధాలను పటిష్టం చేసుకునే దిశగా భారత్, దక్షిణ కొరియాలు

దక్షిణ కొరియా తొలి మహిళ కిమ్ జంగ్-సూక్ భారతదేశాన్ని పర్యటించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆమెను భారతదేశానికి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. భారత, దక్షిణ కొరియాల దేశాలు చారిత్రాత్మక నాగరికత, సంస్కృతీ సంబంధాల ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా మిసెస్ కిమ్ జంగ్ దీపోత్సవ్‌ను తిలకించారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ అయోధ్యలో క్వీన్ సురిరత్నా (హె వాంగ్-ఓక్) మెమోరియల్ ఉత్సవంలో కూడా పాల్గొన్నారు.  48సిఇలో అయోధ్యకు చెందిన ప్రిన్సెస్ సురిరత్నా కొరియాకు చెందిన రాజు కిమ్-సురోను వివాహం చేసుకున్నారు. నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌లతో దక్షిణ కొరియా తొలి మహిళ చర్చలు జరిపారు. చారిత్రక, సాంస్కతిక, వారసత్వ సంపదలకు సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించాలన్న అంశాలపై వారితో ఆమె చర్చించారు. తద్వారా రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంచుకోవాలని భావిస్తున్నారు.

నాగరికత, చారిత్రక, ఆధ్యాత్మిక సంబంధాలు ఇరుదేశాల మధ్య పెంపొందించడమనేది ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రధాన అంశం. కొరియా యుద్ధానంతరం శాంతిస్థాపనలో భారత్ కీలకపాత్ర వహించింది. ప్రముఖ భారత దౌత్యవేత్త కెపిఎస్ మీనన్ 1947లో తొమ్మిదిమంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్యసమితి కమిషన్ ఛైర్మన్‌గా కొరియా ఎన్నికల నిర్వహణ పర్యవేక్షించారు. దీంతో పాటు కొరియా యుద్ధ సమయంలో భారత్ చేపట్టిన   తీర్మానాన్ని యుద్ధం చేస్తున్న ఇరుపక్షాలూ అంగీకరించాయి. తదనుగుణంగా 1953, జులై 27న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాయి. భారత మాజీ సైనికాధికారి జనరల్ కె.ఎస్. తిమ్మయ్య న్యూట్రల్ నేషన్స్ రిపాట్రిషన్ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన యుద్ధ కారణంగా తలెత్తిన మానవతా సమస్యల పరిష్కారంలో ఎంతో సానుకూల పాత్రను నిర్వహించారు.

 దక్షిణ కొరియా ‘న్యూ సౌద్రన్ పాలసీ’, ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ కలయిక ద్వారా సమైక్య ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛా విపణి ఆర్థిక విధానం, చట్టపాలన వంటి అంశాలను ఇచ్చిపుచ్చుకోవడం లక్ష్యంగా పనిచేయాలని భారత్, కొరియాలు భావించాయి. అలాగే 2018, జులైలో దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జా-ఇన్ భారత్‌లో పర్యటించారు. భారత్, దక్షిణ కొరియాలు భవిష్యత్తులో రెండు దేశాల మధ్య  ప్రజాసంబంధాల పెంపుదల, సంపద, శాంతి స్థాపనలపై చర్చించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ ’లో దక్షిణ కొరియా ముఖ్య అభివృద్ధి భాగస్వామి.

 ఆర్థిక, ఇతర అవకాశాల పరంగా భారత శక్తిసామర్థ్యాలు, వర్కుఫోర్సు , దక్షిణ కొరియా సాంకేతిక విజ్ఘానాల సమ్మేళనం, తయారీ సామర్థ్యం, అభివృద్ధి అవగాహనల సమ్మేళనంతో రెండు దేశాలు పరస్పర ఆర్థిక ప్రగతి సాధన లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్నాయి. భారత్‌లో శక్తివంతమైన మౌలిక సదుపాయాల మార్కెట్‌ ఉంది. రెండు దేశాలూ కొరియా ఎకనామిక్ డెవలెప్‌మెంట్ కో-ఆపరేషన్ ఫండ్ (ఇడిసిఎఫ్) ద్వారా వివిధ ప్రాజక్టులను చేపట్టాలనుకుంటున్నాయి. అంతేకాదు ఎక్స్‌ పోర్టు క్రెడిట్ పరంగా కూడా దృష్టి పెడుతున్నాయి. భారత్ చేపట్టిన ఎంతో ముఖ్యమైన మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీస్ కార్యక్రమాల్లో దక్షిణ కొరియా ముఖ్య భాగస్వామి కూడా.

ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత లోతుగా పెంపొందించేందుకు భారత్, దక్షిణ కొరియాలు భద్రత, రక్షణ రంగాల్లో మరింత సహకాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగా సైనిక సహకారం, శిక్షణ, రక్షణ రంగ పరిశ్రమల సహకారం, పరిశోధన, నూతన ఆవిష్కరణల పరిజ్ఞాన అభివృద్ధి విషయంలో ఈ సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. దక్షిణ కొరియా రక్షణ పరిశ్రమ ఎంతో శక్తివంతమైనది. అందుకే భారత్ ఈ దేశం నుంచి సహకారం పొందేందుకు ముందుకు వచ్చింది. రక్షణ రంగ పరికరాలను అత్యంత తక్కువ ఖర్చుతో, దృఢమైన తయారీ యూనిట్లు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం కలిగి వుంది. ఈ విషయంలో భారత్, దక్షిణ కొరియాలు 2017లో ఓడల తయారీలో రక్షణ రంగ పరిశ్రమ సహకారానికై ఒక ప్రభుత్వాంతర అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు రక్షణ రంగంలో షిప్‌యార్డుల అభివృద్ధికి సహకారాన్ని పెంచాలని నిర్ణయించాయి.

ఇరు దేశాలు అనేక ప్రాంతీయ భద్రతాపరమై అంశాలపై ఒకేరకమైన ఆందోళనను వ్యక్తం చేశాయి. ఉగ్రవాదం, హింసాత్మకమైన తీవ్రవాదం, రాడికలిజం, భారీ విధ్వాంసానికి పాల్పడేందుకు జరుగుతున్న ఆయుధాల సరఫరా, వాటి పంపిణీ తీరుపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీటితోపాటు ఉగ్రవాద ప్రోత్సాహం, ఇతర దేశాల సహకారంపై తీవ్ర ఆందోళలను వ్యక్తం చేశాయి. భారత దేశం తొలి నుంచి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జీ-ఇన్ చేపడుతున్న నిర్మాణాత్మక అభివృద్ధిని గట్టిగా సమర్థిస్తూ ఉంది. కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర రహిత కార్యక్రమానికి దక్షిణ కొరియా చేస్తున్న ప్రయత్నానికి మద్దతు పలుకుతోంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు జరుగుతున్న ప్రయత్నానికి భారత్ అన్ని రకాల తన మద్దతు తెలియజేసింది. అయితే ఈ ప్రక్రియ చర్చలు, దౌత్యపరమైన వ్యూహంతో కొనసాగాలని ఆశిస్తోంది. దీంతోపాటు కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యకలాపాలు ఇతర ప్రాంతాలకు విస్తరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో ‘మోదినామిక్స్’ను అనుసరిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధిలోని తీసుకువెళ్తున్నందుకు గాను, పేద ధనికుల మధ్య ఆర్థిక అంతరాలు తగ్గించినందుకుగానూ ఆయనకు సియోల్ పీస్ ప్రైజ్ బహుకరించారు.  భారత్-దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు 1973 నుంచి కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య అప్పటి వరకు ఉన్న ద్వైపాక్షిక కాన్సులర్ సంబంధాలు కాస్తా నాటికి రాయభార స్థాయికి ఎదిగాయి. భారత్-దక్షిణ కొరియాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సుస్థిరతలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు, దృఢమైన భద్రతా సహకారాన్ని కూడా పెంపొందించుకునేందుకు దోహదపడుతాయి.

రచన: డా. తిత్లీ బసు, తూర్పు, ఆగ్నేయాసియాల వ్యూహాత్మక విశ్లేషకులు