శ్రీలంక పార్లమెంటుకు ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీలంకలో నూతన ప్రభుత్వ స్థిరత్వంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో నిన్నసాయంత్రం ముగ్గురు కొత్త మంత్రులు పదవీ స్వీకార ప్రమాణాలు చేశారు. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రమాణం చేయించిన వారిలో నూతన ప్రధానమంత్రి, సోదరుడు, మాజీ స్పీకర్ అయిన చమర్ రాజపక్సే కూడా ఉన్నారు. కాగా వచ్చే బుధవారం పార్లమెంట్ సమావేశమైనప్పుడు స్థిరమైన ప్రభుత్వం గురించి మెజార్టీ వర్గం అభిప్రాయం తెలియజేసేందుకు తప్పక అవకాశం కల్పించాలని స్పీకర్ జయసూర్య అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు పార్లమెంటును రద్దుచేసి.. కొత్త ఎన్నికలకు పిలుపునివ్వనున్నారన్న ఊహాగానాల మధ్య నిన్న ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరగడం గమనార్హం. అయితే ప్రభుత్వ వర్గాలు ఈ వాదనలను కొట్టిపారేశాయి. ఈ నెల 14 పార్లమెంట్ మొదటి సమావేశంలో అధ్యక్షుడి ప్రసంగం మాత్రమే ఉండగలదని, మెజార్టీ నిరూపణ అంశం మరోసారి జరుగుతుందని ఆ దేశ మంత్రి ఒకరు తెలియజేశారు. పార్లమెంటు సమావేశమైన మొదటిరోజే విశ్వాస పరీక్ష జరగాలన్న స్పీకర్ అభిప్రాయానికి ఇది విరుద్ధమైనది కావడం గమనార్హం.