పదమూడవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఆసియాన్ పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్

 పదమూడవ తూర్పు ఆసియా వార్షిక శిఖరాగ్ర సమావేశం సింగపూర్‌లో విజయవంతంగా జరిగింది. ‘అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ నేషన్స్’ (ఎఎస్ఇఎన్)లోని పది సభ్యదేశాలు, ఈ కూటమికి చెందిన ఎనిమిది దేశాల చర్చల భాగస్వాములు ఈ సదస్సులో పాల్గొన్నారు.  

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. ‘ఆసియాన్’ సంబంధిత వేదికల్లో అతి పెద్ద వేదికగా ఈ సదస్సు గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇందులో ఎనిమిది దేశాల ప్రభుత్వాధిపతులు పాలుపంచుకుంటున్నారు. అందుకే ఇండో-ఫసిఫిక్ దేశాల వేదిక మల్లేనే ఈ శిఖరాగ్ర సదస్సు కూడా ఆగ్నేయాసియా ప్రాంతంతో భారత మరో పాజిటివ్ కార్యక్రమంగా పేర్కొనాలి.

ఇందులో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో శాంతియుతమైన, సంపద్వంతమైన పరిస్థితులు నెలకొల్పడంలో భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బహుపక్ష సహకారం, లక్ష్యాల పరంగా కూడా భారత్ అంతే నిబద్ధతతో వ్యవహరిస్తుందన్నారు. అలాగే తూర్పు దిశగా భారత్ చేపట్టే పలు కార్యకలాపాల్లో ఆసియన్ సభ్యదేశాలు కేంద్ర స్థానాన్ని ఆక్రమించుకున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధాని నొక్కిచెప్పారు. అంతేకాదు ఆసియన్ సభ్యదేశాలతో ఆర్థిక, సాంస్కృతిక పురోగతితో కూడిన సంబంధాలకు భారత్ తొలి  ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దీంతోపాటు ‘రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్’ (ఆర్‌సిఇపి)పరంగా కూడా నిబద్ధత కలిగి ఉందన్నారు. ఇది సమతుల్యతతో భారత్ వ్యవహరించేట్టు చేయడంతో పాటు భారత ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవడంలో తోడ్పడుతుందన్నారు.

తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఆసియన్-భారత్ ఇన్ఫార్మల్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో కూడా మోదీ పాల్గొన్నారు. 2018 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఆసియన్-ఇండియా కమోమరేటివ్ సమ్మిట్‌లో చర్చించిన అంశాల ఫాలోఅప్ ఈ సమావేశంలో చోటుచేసుకుంది. ఆ విధంగానూ ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఒక మంచి అవకాశం. ‘ఆసియన్’ పది సభ్యదేశాల అదిపతులనూ ఈ ఏడాది భారత గణతంత్రవేడుకలకు భారత్ ఆహ్వానించిన విషయం మరిచిపోలేము కూడా.

ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతాలలో ఆసియాన్ ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్య అంశం కూడా ఉంది. భారత్, ఇండొనేసియాలు సంయుక్తంగా తొలి ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను ‘సముద్ర శక్తి’ పేరుతో ఇండొనేసియాలోని సురబయలో ప్రారంభించాయి. ఇంతవరకూ ఈ రెండు దేశాల నౌకా విభాగాలూ ద్వైపాక్షికంగా ‘కో-ఆర్డినేటెడ్ పెట్రోలింగ్’ విన్యాసాల (ఇండ్ఇండోకార్పేట్)కే  పరిమితమయ్యాయి.

శిఖరాగ్ర సమావేశాలకు సమాంతరం ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతకాక ఆయన ఆస్ట్రేలియా, సింగపూర్, ధాయ్‌లాండ్ ప్రధాన మంత్రులతో కూడా భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్‌తో భేటీ అయినపుడు ప్రధాన మంత్రి మోదీ ఇండో-పసిఫిక్ ప్రాంతం విషయంలో తన దృక్కోణాన్ని ఆయనతో పంచుకున్నారు. మోదీ తన ఆలోచనలకు ఆమోదం లభిస్తోందనీ, రెండు దేశాలు ‘‘రానున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలను సమర్థవంతంగా ఉపయగించుకొని దాని ఆధారంగా సంబంధాలు నిర్మించుకోవాల’’ని తన అభిప్రాయమని చెప్పారు.

భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు ఇండో-పసిఫిక్ నిర్మాణాన్ని చాలా చురుగ్గా ప్రోత్సహిస్తున్నాయి. ప్రజాస్వామిక వ్యవస్థలైన ఈ నాలుగు దేశాలు ఒక ఆలోచనా విధానాన్ని కలిసి ఉన్నాయి. అందుకే ఇండో-పసిఫిక్ విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ఆ ఆలోచనను ప్రోత్సహిస్తున్నాయి. ఇండో-పసిఫిక్ విషయంలో ఇండోనేషియాకు తన సొంత ఆలోచన ఏదో ఉందని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు. భారత ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రకటన సారాంశం అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్, జపాన్ ప్రధాన మంత్రి షింజో ప్రసంగాల్లో ప్రతిబింబించాయి. మోదీ తరహాలోనే పెన్స్ కూడా ఆసియాన్ అమెరికా ఇండో-పసిఫిక్ వ్యూహానికి కేంద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు భారత్, అమెరికాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాల గురించి ఎత్తి చూపడంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆయన మాట్లాడుతూ ‘‘అమెరికా, భారత్ విషయంలో తన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. భారత దేశం మాకు ముఖ్యమైన రక్షణ రంగ భాగస్వామి. ఈ ప్రాంతంలోని భద్రతా పరమైన అంశాలపై కలిసి పని చేస్తున్నాం’’ అని అన్నారు. ఆసియాన్ 2018 ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సింగపూర్ ప్రధాన మంత్రి లీ సింగ్ లూంగ్ తమ ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ చైనా, ఆసియాన్ దేశాలు కోడ్ ఆప్ కాండక్ట్ (సీవోసీ)పై సంతకాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ చైనా సముద్ర జలాల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.

తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలకు సమాంతరంగా జరిగిన చర్చల్లో మరో ముఖ్యమైన అంశం భారత్-జపాన్-ఆస్ట్రేలియా, అమెరికాల మధ్య సంభాషణలు. సీనియర్ అధికారుల స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో నాలుగు దేశాల మధ్య మరింత సహకారం, అనుసంధానత పెంపొందాల్సిన అవసరాన్ని గురించి చర్చించారు. ప్రాంతీయ రక్షణ కోసం సంప్రదాయ, సంప్రదాయేతర రక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మొత్తంమీద చూస్తే, ప్రధాన మంత్రి తన ముప్పై ఆరు గంటల సింగపూర్ పర్యటన ఆసియాన్ విషయంలో భారత్‌కు ఉన్న చిత్తశుద్ధిని మరోమారు చాటిచెప్పింది. న్యూఢిల్లీ ఈ ప్రాంతం విషయంలో నిరంతర సంబంధాలను కొనసాగించే విషయంలో చూపిస్తున్న శ్రద్ధను ప్రదర్శించినట్లయ్యింది.

రచన: డా. రాహుల్ మిశ్రా, అసోసియేట్ ప్రొఫెసర్ (ఆసియన్ స్టడీస్), యూనివర్సిటీ ఆఫ్ మలయా, కౌలాలంపూర్