ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌పంచంలో ఎవ‌రికీ లేనంత‌మంది ఫాలోవ‌ర్లున్న ప్ర‌పంచ‌నాయ‌కునిగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఘ‌న‌త సాధించారు.

సామాజిక మాధ్య‌మాల్లో ఒక‌టైన ఇన్‌స్టాగ్రామ్‌లో 14.8 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్ల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అత్యంత ప్రాచుర్యం క‌లిగిన ప్ర‌పంచ నాయ‌కుడిగా ఆవిర్భ‌వించారు. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ట్వైప్లోమ‌సి ప్ర‌చురించిన జాబితాలో ఈ విష‌యం వెల్ల‌డ‌య్యింది. ఇండోనేషియా అధ్య‌క్షుడు జోకో విడోడోకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ త‌ర్వాతి స్థానం ద‌క్కింది. ఆయ‌న‌ను 12.2 మిలియ‌న్ మంది అనుస‌రిస్తున్నారు. ఫోటో షేరింగ్ ఫ్లాట్‌ఫాంలో ఆ త‌ర్వాతి స్థానం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ద‌క్కింది. ఆయ‌న‌కు 10 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్నారు. నూత‌న వ‌ధూవ‌రులు భార‌త క్రికెట్ జ‌ట్టు సార‌ధి విరాట్‌కొహ్లీ ఆయ‌న భార్య న‌టి అనుష్క‌శ‌ర్మ ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన సంద‌ర్భంలో తీసిన ఛాయాచిత్రం ప్ర‌పంచ నాయ‌కులతో తీసిన‌ ఛాయాచిత్రాలన్నిటిక‌న్నా ఎక్కువ‌గా ఆద‌ర‌ణ‌ పొందింది. ఈ చిత్రాన్ని సుమారు 18 ల‌క్షల 35 వేల మంది ఇష్ట‌ప‌డ్డారు. మిగ‌తా ముగ్గురు దేశాధినేత‌ల చిత్రాల‌న్ని క‌లిపి 55 మిలియ‌న్లు చూశారు. అలాగే న‌రేంద్ర‌మోదీ దావోస్‌లో ప్ర‌పంచ ఆర్థిక వేదిక 2018 సంద‌ర్భంగా ఒక బ‌స్‌స్టాప్ వ‌ద్ద నిల‌బ‌డి ఉండ‌గా తీసిన ఫోటోకు 16 ల‌క్ష‌ల 35వేల 978 మంది లైక్ కొట్టారు.