జి20 సదస్సులో అత్యున్నత స్థాయిలో క్రియాశీలకంగా మారిన రష్యా-ఇండియా-చైనా ఫార్మెట్

పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్, రష్యా, చైనా (ఆర్ఐసి) దేశాలు జి20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా బ్యూనస్ ఐరస్‌లో కలిశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొరవతో ఈ మూడు దేశాల ప్రత్యేక సమావేశం జరిగింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్ గ్జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు మూడు దేశాలు కలిసి పనిచేయగలిగే అంశాలపై సంయుక్తంగా చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాన్ని అత్యద్భుతమైన సమావేశంగా వ్యాఖ్యానించారు. దీని వల్ల ఈ మూడు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని, శాంతి పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ మూడు దేశాల మధ్య సహకారం, స్నేహ సంబంధాల వల్ల అంతర్జాతీయ వేదికలు కూడా బలోపేతమవుతాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ పరిణామం వల్ల పలు అంతర్జాతీయ వేదికల మధ్య పరస్పర సంబంధాలు పెరిగి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుందన్నారు.

సంస్కరణల ఆవశ్యకతను కూడా  ఈ మూడు దేశాలు అంగీకరించాయి. అంతేకాదు బహుళపక్ష వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంతోపాటు, ఐక్యరాజ్యసమితి, డబ్ల్యుటివొ, ఏసియన్ డెవలెప్‌మెంట్ బ్యాంక్లాటి గ్లోబల్ ఆర్థిక సంస్థలను కూడా పటిష్టపరుచుకోవాలని ఒక అంగీకారానికి ఈ మూడు దేశాలూ వచ్చాయి. బహుళపక్ష సంస్థల వల్ల అంతర్జాతీయంగా ఎంతో లబ్ది చేకూరుతుందని మూడు దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు. అలాగే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థ ప్రాధాన్యం, దాని లాభాలను కూడా ఈ మూడు దేశాల నాయకులు గుర్తించారు.  ప్రపంచ ఆర్థిక విధానం అంతర్జాతీయ అభివృద్ధికి, సుసంపన్నతకు తొడ్పడుతుందన్నారు.

అంతర్జాతీయ, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను పెంపొందించేందుకు, బహుళపక్ష సంస్థల ద్వారా సహకారాన్ని బలోపేతం చేసేందుకు ‘ బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా), ఎస్‌సివొ (షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్), ఈస్ట్ ఏసియా సమ్మిట్ (ఇఎఎస్)లాంటి యంత్రాంగాలు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఈ మూడు దేశాలకు చెందిన నాయకులు  త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు మూడు దేశాల మధ్య క్రమం తప్పకుండా తరచూ చర్చలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి అంతర్జాతీయ బహుపక్ష సంస్థల ద్వారా ప్రపంచానికి సవాళ్లుగా నిలిచిన ఉగ్రవాదం, వాతావరణ మార్పులు వంటి అంశాలను వేదికల మీద లేవనెత్తవచ్చు. వాటిని పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు దేశాల మధ్య ఉన్న పలు విభేదాలకు శాంతియుత పరిష్కారాలను కూడా సాధించవచ్చు. ప్రకృతివైపరిత్యాలు సంభవించినపుడు, మానవతా సహాయం అవసరమైనపుడు, అలాగే పలు ఇతర సమస్యలపై సంయుక్తంగా కలిసి సేవలు అందించవచ్చని  ఈ మూడు దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డిజిఎస్)ను నొక్కిచెప్పారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు వంటి అంశాలపై అభివృద్ధి చెందిన దేశాలు బలహీనంగా  వ్యవహరిస్తున్న నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రాధాన్యం ఎంతో ఉందని ప్రధాని మోదీ ఉద్దేశం.

 

పశ్చిమదేశాలకు, మరీ ముఖ్యంగా అమెరికాకు తమ త్రైపాక్షిక సమావేశం పట్ల ఎలాంటి సందేహాలు తలెత్తకుండా ఉండేందుకు తాము కలిసి పనిచేయడం వెనుక ఏ మూడవ దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలనే ఉద్దేశం తమకు లేదని కూడా ఈ సందర్భంగా మూడు దేశాలు స్పష్టంచేశాయి. అంతర్జాతీయంగా మంచి పరిణామాల కోసమే మా వంతు కృషి చేయాలనుకుంటున్నట్టు ఈ దేశాల నాయకులు స్పష్టంచేశారు. మొత్తానికి ఆర్ఐసి ఒకటిగా కలిసి పనిచేయడం అనేది ఒక ముఖ్యమైన శుభపరిణామమనే చెప్పాలి.

 

అంతర్జాతీయ సుస్థిరతకు తమ మూడు దేశాలలోని విలక్షణ బలాబలాలు సహాయపడతాయని నాయకులు భావించారు. దాంతోపాటు అంతర్జాతీయ ఆర్థిక పాలనను తాము ముందుకు నడిపించగలమన్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఇదెంతో లబ్దిని చేకూరుస్తుందని వీరు అభప్రాయపడ్డారు.

 

చాలా కారణాలవల్ల ఈ దేశాలు లేదా ప్రభుత్వాల మధ్య ఆర్ఐసి ఫార్మెట్ క్రియాశీలకంగా రూపుదిద్దుకోలేదు. అయితే ఈ దేశాల విదేశాంగ మంత్రులు మటుకు తరచూ సమావేశమవుతూనే ఉన్నారు. వీరి చివరి సమావేశం 2018 జూన్‌లో జరిగింది.

 

ఆర్ఐసి ఫార్మెట్ మూడు దేశాలకూ ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే దీని ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కాదు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేయొచ్చు. ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ పలురకాల అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్ఐసి ఫార్మెట్‌లో మూడు దేశాలు సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాయి. ఇలాంటి త్రైపాక్షిక సమావేశాలు మరికొన్నింటిని బహుళపక్ష శిఖరాగ్ర సమావేశాల సందర్భంలో నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నారు. అంతేకాదు మూడు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు, ఏకాభిప్రాయాన్ని నిర్మించుకోవడం, త్రైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, ప్రపంచ శాంతికి సంయుక్తంగా కృషిచేయడంతో పాటు సుస్థిరత, అభివృద్ధుల విషయంలో కూడా సహకారాన్ని పెంపొందించుకోవాలని మూడు దేశాల నాయకులు అంగీకరించారు.

 

జి20 సదస్సు సమయంలో ఆర్ఐసి గ్రూపు సమావేశాన్ని గమనిస్తే, ఇది ఏకపక్ష సిద్ధాంతానికి, ఐక్యరాజ్యసమితి చేయని ఆంక్షలకు, రక్షణవాదానికి, గ్రూపులు ఏర్పడడానికి వ్యతిరేకమనేది స్పష్టమవుతుంది. మూడు దేశాలకు చెందిన నాయకులు బహుళపక్షానికి, అంతర్జాతీయ చట్టం, సంస్థలు, నిబంధనలతో కూడిన క్రమాన్ని గౌరవించడానికి గట్టిగా   మద్దతు పలికారు.

జి20 శిఖరాగ్రసదస్సు సమయంలో భారత్ కూడా జపాన్‌, అమెరికాలతో పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపింది. బహుళపక్ష ప్రయోజనాలపై తొలిసారి జరిగిన  ఈ త్రైపాక్షిక సమావేశంలో భారత్ చర్చించింది. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో చైనా తన బలాన్ని పెంపొందించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో ‘భాగస్వామ్య ఆర్థిక వృద్ధి’ పట్ల తన నిబద్ధతను స్పష్టంచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘విలువల భాగస్వామ్యం’తో కలిసి పనిచేయాలని భారత్ కోరుకుంటోందని అన్నారు. ‘జై’ సమావేశానికి ఒక కొత్త అర్థం చెప్పారు. జెఎఐ అంటే జపాన్, అమెరికా, ఇండియా.  ఈ మూడింటినీ భారతీయ భాషలో ‘జై’గా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘జై’ అంటే విజయం అని   అర్థమని కొత్త స్ఫూర్తిని ఈ మూడుదేశాల సమావేశాని ఆయన జోడించారు.

 

ఎంతో వేగంగా మారుతన్న భౌగోళిక-రాజకీయాలు, భౌగోళిక-ఆర్థిక లాండ్‌స్కేప్ ల నేపథ్యంలో పెద్ద దేశాలన్నింటితోనూ సమాన, సమతుల వైఖరితో ముందుకు పోవడం ప్రస్తుతం భారత్  అనుసరించాల్సిన వివేకవంతమైన వైఖరి.