తెలంగాణ‌, రాజ‌స్థాన్‌ల‌లో రేపు జ‌రిగే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

తెలంగాణ‌, రాజ‌స్థాన్‌ల‌లో రేపు  జ‌రిగే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్‌కు విస్తృత‌మైన ఏర్పాట్లు జ‌రిగాయి. రెండు రాష్ర్టాల్లో ప్ర‌చారం నిన్న సాయంత్రం ముగిసింది. రాజ‌స్థాన్‌లో 51 వేల 687 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం ఒక్క మ‌హిళా పోలింగ్ కేంద్రం ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఓట‌ర్ల జాబితాలో పేరున్న వారంతా ఓట‌రు గుర్తింపు కార్డు, లేదా ఆమోదం పొందిన మ‌రేదైనా గుర్తింపుతో ఓటు వేయ‌వ‌చ్చున‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ఆనంద్ కుమార్‌ తెలిపారు. త‌మ‌కు వీలున్న స‌మ‌యాన్ని ఆప్‌ద్వ‌రా న‌మోదు చేసుకొని ఆ స‌మ‌యానికే ఓటు వేసే వీలు క‌ల్పించార‌ని మా విలేక‌రి తెలియ‌జేస్తున్నారు.

తెలంగాణ‌లో స్వేచ్చ‌గా, స‌జావుగా పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ల‌క్షా 60 వేల మంది సిబ్బందిని  పోలింగ్ కేంద్రాలల్లో నియ‌మించారు. 270 కంపెనీల కేంద్ర సాయుధ ద‌ళాలు, 30 వేల మంది రాష్ట్ర పోలీసుల్ని నియ‌మించారు. అద‌నంగా 18 వేల మంది పోలీసుల‌ను ఆరు రాష్ర్టాల‌నుంచి ర‌ప్పించారు. సుమారు 2 ల‌క్ష‌ల 80 వేల‌మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకొనేందుకు 32 వేల 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట‌య్యాయి. మొత్తం 119 శాస‌న‌స‌భ నియోజ‌క‌వర్గాల్లో క‌లిపి 1821 మంది అభ్య‌ర్థులు పోటీలో వున్నారు.

తెలంగాణ‌, రాజ‌స్థాన్‌ల‌లో ఛ‌త్తీస్‌ఘ‌ర్‌, మ‌ద్య‌ప్ర‌దేశ్ ల‌తోపాటు ఈ నెల 11న ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.