ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న కృషికి భారత దేశం, అయిదు మధ్య ఆసియా ప్రాంత దేశాలు మద్దతుగా నిలిచాయి.

ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న కృషికి భారత దేశం, అయిదు మధ్య ఆసియా ప్రాంత దేశాలు మద్దతుగా నిలిచాయి. ఉజ్బెకిస్తాన్ రాజధాని సమర్ ఖండ్ లో నిన్న జరిగిన భారత్- మధ్య ఆసియా దేశాల మొదటి ఒప్పందంలో ఈ మేరకు ఈ దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ చర్చలకు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఉజ్బెకిస్తాన్ మంత్రి అబ్దుల్ అజీజ్ కమిలోవ్ అధ్యక్షత వహించారు. ఈ చర్చల్లో ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు కజకిస్తాన్ విదేశాంగ శాఖ మొదటి సహాయ మంత్రి పాల్గొన్నారు. ఆఫ్గనిస్తాన్ ఆర్ధిక పునర్నిర్మాణంలో తోడ్పాటు అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సుష్మ స్వరాజ్ స్పష్టం చేశారు. ఇండియా, ఆఫ్గానిస్తాంతో సహా మధ్య ఆసియా దేశాలన్నీ ఈ సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉగ్రవాద కార్యకలాపాలను ఖండించాయి.