ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించిన భారత్, నేపాల్

గతవారం నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలి నాల్గవ విడత ‘రైసినా డైలాగ్’కు హాజరవడానికి న్యూఢిల్లీ వచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఇండో-నేపాల్ సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చలు జరిపారు.  వివిధ రంగాలలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందిన తీరును వీరు సమీక్షించారు. ముఖ్యంగా 2018లో చేపట్టిన అనుసంధానం, వ్యవసాయం, జలమార్గాల ప్రగతిపై కూడా చర్చలు జరిపారు. వివిధ రంగాలలో ఇరుదేశాల సహకారం మీద రెండు దేశాల మంత్రులు సంతృప్తిని వ్యక్తంచేశారు. వీటిని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ వేగాన్ని మరింత పెంచుతామని తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అతి సన్నిహితమైన సంప్రదాయ, స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తామని ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

గత ఏడాది మేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటించారు(నాలుగు సంవత్సరాలలో ప్రధాని నేపాల్‌కు పర్యటించడం మూడవసారి). ఆర్థిక ప్రగతి పెంపుదలకు అనుసంధానం వహించే కీలకపాత్రను రెండు దేశాల నాయకులు గుర్తించారు. అంతేకాదు ఈ అనుసంధానం రెండు దేశాల ప్రజల మధ్య కూడా సంబంధాలను పెంపొందిస్తుంది. రైల్వేలు, వ్యవసాయం, జలమార్గాలకు సంబంధించి గత ఏడాది మూడు కొత్త కార్యక్రమాలను భారత్, నేపాల్ దేశాలు చేపట్టాయి. జలమార్గాల అనుసంధానం మటుకు ఈ రెండు దేశాలకూ పూర్తిగా నూతన రంగమని చెప్పాలి.

ఈ లక్ష్యాలను పూర్తిచేసే క్రమంలో, రెండు దేశాలకు చెందిన సీనియర్ నాయకులు ఇన్‌లాండ్ జలమార్గాల నిర్వహణా విధానాలపై చర్చించారు. ఈ జల మార్గాల ద్వారా కార్గో సేవలను నేపాల్‌లోని కోషి, నారాయణి నదుల్లో గంగా నది ద్వారా చేపట్టాలనే ఆలోచన ఉంది. ఈ అదనపు జలమార్గాల ప్రయత్నాలు నేపాల్, భారత్ సంబంధాలలో ఎంతో కీలకమైనవి. రెండు దేశాల మధ్య అదనంగా చేపడుతున్న ఈ జలమార్గాలను రవాణా ‘ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ ట్రియటీ’కి అనుగుణంగా చేపట్టాలన్న నిర్ణయాన్ని గత ఏడాది ఏప్రిల్‌లో నేపాల్ ప్రధాని కె.పి శర్మ ఓలి పర్యటనలో తీసుకున్నారు. సరిహద్దు రవాణా సేవలు నేపాల్‌ను సముద్రంతో అనుసంధానం చేయడంతో పాటు తక్కువ ఖర్చుతోనే కార్గో సేవలు అందించగలుగుతుంది. న్యూఢిల్లీ సమావేశంలో ఇరుదేశాల మంత్రులు దీనికి సంబంధించిన ప్రగతిపై సమీక్షను నిర్వహించారు.

 గత సంవత్సరం ఆగస్టులో ఖాట్మండులో జరిగిన బిఐఎంఎస్‌టిఇసి  శిఖరాగ్ర సదస్సు సమయంలో భారత, నేపాల్ దేశాలు భారత సరిహద్దు టౌన్ అయిన రాగ్ల్ టౌన్ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండు వరకూ అనుకున్న రైల్వే లైన్స్‌ పరంగా ‘మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌పై సంతకాలు చేశాయి. భారతదేశం అందించే ఆర్థిక సహాయంతో ఈ సరికొత్త ఎలక్ట్రిఫైడ్ రైల్వేలైన్‌ను  నిర్మించాలని రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. దీనికి సంబంధించిన సర్వే ఒక సంవత్సరం లోపు పూర్తి చేయాలి. ఈ ప్రాజక్టు ప్రగతిని కూడా రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు సమీక్షించారు. ఇదే కాకుండా భారత సహాయంతో మరికొన్ని రైల్వే ప్రాజక్టులు కూడా వివిధ స్థాయిల్లో అమలు దిశగా నేపాల్‌లో సిద్ధమవుతున్నాయి.

భారత, నేపాల్ దేశాలు గత సంవత్సరం తీసుకున్న మరో ముఖ్య కార్యక్రమం వ్యవసాయ రంగ రూపురేఖలను మార్చడం. ఎందుకంటే రెండుదేశాలూ వ్యవసాయ ఆధారిత మైనవే. అందుకే ఆర్థికంగా ఎంతో లాభకరమైన ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలూ కోరుకుంటున్నాయి.  ఈ రెండు దేశాలు సంయుక్తంగా నూతన వ్యవసాయ విధానాలలో అధ్యయనం, అభివృద్ధి, శిక్షణ పరంగా సమిష్టి ప్రాజక్టలపై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు విత్తన సాంకేతిక పరిజ్ఘానాన్ని పెంపొందించాలని నిర్ణయించుకున్నాయి. అలాగే ఆరోగ్యకరమైన మట్టి, యాగ్రో ఫారెస్ట్రీ, పశుసంపద, ఇతర సంబంధిత రంగాలపై కూడా ఈ రెండు దేశాలు దృష్టి నిలపాలనుకుంటున్నాయి. ఈ నిర్ణయాన్ని అనుసరించే దిశగా, నేపాల్ వ్యవసాయ, భూ నిర్వహణ మరియు కో-ఆపరేటివ్స్ మంత్రి చక్రపాణి ఖానాల్  గత ఏడాది జూన్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన భారత వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖా మంత్రి రాధా మోహన్ సింగ్‌తో వ్యవసాయరంగంలో చేపట్టిన కొత్త భాగస్వామ్యానికి సంబంధించి విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు.

భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, నేపాల్ మంత్రి గ్యావాలి ఈ కొత్త కార్యక్రమాలపై విశదంగా చర్చించారు. భారత సహాయంతో నేపాల్‌లో అమలుచేయనున్న పలు ప్రాజక్టుల ప్రగతికిపై కూడా వీరిరువురు విస్తృతంగా సమీక్షించారు. రైజినా డైలాగ్ సదస్సులో మాట్లాడుతూ నేపాల్ విదేశాంగ మంత్రి గ్యావాలి సాధారణ ప్రగతికి భారత్, నేపాల్ దేశాలు కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతేకాదు సంపద, భౌతిక అనుసంధానం, రెండు దేశాల ప్రజల మధ్య విస్తృత సంబంధాల ఆవశ్యకతను కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేపాల్‌కు భారత్ అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరైన 90 దేశాల ప్రతినిధులకు భారత్, నేపాల్ సంబంధాల ప్రత్యేకతను చెబుతూ భౌగోళికంగా, చారిత్రకంగా, మతపరంగా, సంస్కృతీ పరంగా రెండు దేశాలు ఎంత గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయో వివరించారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సంపూర్ణమైనవి, సమగ్రమైనవని అభిప్రాయపడ్డారు. భారత విదేశాంగమంత్రి  సుష్మా స్వరాజ్ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ భారత్ తన పొరుగుదేశమైన నేపాల్‌కు కావలసిన వనరులను అందించడమే కాకుండా తర్వాతి తరం ప్రాంతీయ అనుసంధానత వృద్ధిని పెంపొందించేందుకు , మౌలికసదుపాయాల పెంపుదలకు కృషిచేస్తోందన్నారు. రైజినా డైలాగ్‌ను భారత విదేశాంగ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(స్వతంత్రమైన థింక్-టాంక్)లు సంయుక్తంగా నిర్వహించాయి. దీని లక్ష్యం అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడమే.

రచన: రతన్ సాల్దీ, రాజకీయ వ్యాఖ్యాత