రానున్న కొద్ది రోజుల్లో వ్య‌వ‌సాయ ఎగుమ‌తి విధానాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి సురేష్ ప్ర‌భు తెలిపారు.

ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఎగుమ‌తి విధానాన్ని రూపొందిస్తుంద‌ని కేంద్ర వాణిజ్య ప‌రిశ్ర‌మ‌లు, పౌర విమాన‌యాన శాఖ‌ల మంత్రి సురేష్ ప్ర‌భు చెప్పారు.  ఈ విధానం ప్ర‌కారం సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి ఆయా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను గుర్తించి నిర్దిష్ట‌మైన ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పి ఈ రంగాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ముంబ‌యిలో రెండు రోజుల పాటు జ‌రిగిన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిన్న ముగిసింది.  ముగింపు స‌భ‌లో ప్ర‌భు మాట్లాడుతూ రానున్న కొద్దీ రోజుల్లో వ్య‌వ‌సాయ ఎగుమ‌తి విధానాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చెప్పారు.  ఈ విధానం కింద రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌కు మంచి ధ‌ర‌ను పొంద‌డానికి వీలుగా  పండ్ల తోట‌లు, మొక్క‌ల పెంప‌కం, మ‌త్స్య‌, పాడి , వ్య‌వ‌సాయ విభాగాల‌ను బ‌లోపేతం అవుతాయ‌ని కేంద్ర మంత్రి తెలిపారు.  భార‌త‌దేశంలోని వ్య‌వ‌సాయ రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి యూనైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌- సౌదీ అరేబియాలు ఆస‌క్తి చూపాయ‌ని  ఆదేశాల ఆహార భ‌ద్ర‌త‌కు  భార‌త్‌ను  ఆధారం చేసుకోనున్నాయ‌ని మంత్రి తెలిపారు. స్వ‌ల్ప‌కాలంలో చెడిపోయే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను త్వ‌రిత‌గ‌తిన ఎగుమ‌తి చేసేందుకు ప్ర‌భుత్వం మొట్ట‌మొద‌టి సారిగా ఎయిర్‌కార్గో విధానాన్ని రూపొందిస్తుంద‌ని ప్ర‌భు చెప్పారు.  భార‌తీయ లాజిస్టిక్స్ రంగంలో సౌదీ అరేబియా, యూనైటెడ్ అర‌బ్ ఎమిరెట్స్‌తో పాటు  ప్ర‌పంచంలోని మ‌రో 15 నుంచి 20 దేశాల నుంచి పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు 46 దేశాల నుంచి వెయ్యి  మందికి పైగా ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.