విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోన్న మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.

విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోన్న మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. విద్యా సంస్థలలో ప్రవేశాల లోనూ, ఉద్యోగాలలోనూ ఆర్థికంగా వెనుకబడినవారికి 10 శాతం కోటా ప్రయోజనాలు ఈ అర్ధరాత్రి నుండి గుజరాత్ లో అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాంఘిక సమానత్వం నెలకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి విజయ్ రూపాని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. జనరల్ కేటగిరీలోని పేద విద్యార్థుల కోసం ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని మా అహ్మదాబాద్ విలేకరి తెలిపారు.

ఇదిలా ఉండగా వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఉన్నత విద్య సంస్థ‌ల్లో కొత్త కేట‌గిరి కింద వేలాది సీట్లు ల‌భ్య‌మవుతాయ‌ని  కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వదేక‌ర్ చెప్పారు. నిన్న సాయంత్రం జైపూర్‌లో జ‌రిగిన ఒక కార్య్ర‌క‌మంలో జ‌వ‌దేక‌ర్ మాట్లాడుతూ ఆర్థిక న్యాయం కోసం మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం విప్ల‌వాత్మ‌క‌మైన‌ద‌ని అన్నారు. విద్యా సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌య్యే వ‌చ్చే జూన్ నుంచి ఐఐటీ , ట్రిపుల్ ఐటీ, నీట్ త‌దిత‌ర విద్యా  సంస్థ‌ల్లో ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ కింద వేలాది సీట్లు ల‌భ్య‌మ‌వుతాయ‌ని కేంద్ర మంత్రి చెప్పారు. ఇత‌ర వ‌ర్గాల వారికి చెందిన  ఏ ఒక్క‌రి రిజ‌ర్వేష‌న్ కోటాను  ర‌ద్దు చేయ‌డం ఉండ‌ద‌ని , జ‌న‌ర‌ల్ కేట‌గిరి నుంచి  ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు అద‌నంగా ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని జ‌వ‌దేక‌ర్ చెప్పారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్‌కు రాష్ర్ట‌ప‌తి రాంనాథ్ కోవింద్  ఆమోదం తెలుప‌డంతో రాజ్యాంగ‌బ‌ద్ధ‌త లభించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 9న పార్ల‌మెంట్ ఆమోదించింది.