భారత్ – మారిషస్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంతో సహా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను అధికం చేసే అంశాలపై ఉభయ దేశాల ప్రధానమంత్రులు చర్చించారు.

భారత్, మారిషస్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఖరారుతో సహా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను అధికం చేసే అంశాలపై ఉభయదేశాల ప్రధానులు నరేంద్రమోది, ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ చర్చించారు. వారణాసిలో ప్రారంభమైన 15వ ప్రవాస భారతీయుల దివస్ సందర్భంగా ఈ ఇద్దరు చర్చలు జరిపారు. ఈ దివస్ ను ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభించగా జుగ్నాథ్ ముఖ్య అతిథిగా కీలకోపన్యాసం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల తీరు తెన్నులు, సంబంధాలు మరింత బలోపేతం కావడానికి అనుసరించాల్సిన పద్దతులపై ఇద్దరు ప్రధానులు చర్చించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ద్వైపాక్షిక అభివృద్ధి సహకార ప్రాజెక్టులపై కూడా మోది, జుగ్నాథ్ లు చర్చించారు. కొత్త ప్రాజెక్టులైన ఆరోగ్యం, వైపరీత్యాల నిర్వహణ, ఇంధన రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా వీరు చర్చించారు. సముద్ర వనరులతో సంక్రమించే ఆర్థిక వనరులను మరింత విస్తృత పరుచుకునేందుకు అవసరమైన సహకారంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఈ సముద్ర వనరులకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వనరులు పెరగడంతో పాటు జీవనభృతి, ఉద్యోగుల లభ్యత, సముద్ర పర్యావరణ వ్యవస్థ మెరుగు పడటానికి దోహదపడుతుంది. ఆఫ్రికాలో పెట్టుబడులపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. అంతకు ముందు ప్రవాస భారతీయ దివస్ ను ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభిస్తూ, భారత్ లో స్టార్టప్, స్టాండ్ అప్, రక్షణ పరికారల తయారీ రంగాలలో ప్రవాస భారతీయులు గొప్ప పాత్రను పోషించగలరన్నారు. తమ పూర్వీకులకు జన్మనిచ్చిన భారతదేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించాలని ప్రధానమంత్రి  ప్రవాస భారతీయులను కోరారు.