చైనా అసంబద్ధమైన నిరసన

ఊహించినట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా నిరసన వ్యక్తంచేసింది. సె లా దగ్గర టన్నల్ నిర్మాణ ప్రాజక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రానికి ప్రధాని మోదీ వెళ్లారు. ఈ టన్నల్ తవాంగ్‌ను రాష్ట్రం మొత్తంతో అనుసంధానం చేస్తుంది. చైనా నుంచి ఈ ప్రతిస్పందన ఊహించనిదేమీ కాదు. కొత్తదీ కాదు. నిత్యం చోటుచేసుకునేదే. నిరంతరంగా లాంఛనంగా చోటుచేసుకుంటుండేదే.

ఈ నిరసనలు కొత్తవి కావు. దశాబ్ద క్రితం అరుణాచల్ ప్రదేశ్ స్వతంత్ర రాష్ట్రంగా వెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2015, ఫిబ్రవరిలో మోదీ ఒక రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి అరుణాచల్ ప్రదేశ్ వెళ్లారు. అంతేకాదు విద్యుత్ ప్రాజక్టుకు అక్కడ పునాదిరాయి వేశారు. చైనా ఉప విదేశాంగ మంత్రి ప్రధాని పర్యటన పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అంతేకాదు మోదీ పర్యటనను తీవ్రంగా ఖండించారు. చైనాకు సంబంధించిన భారత రాయబారిని వెంటనే సమావేశపరిచి తమ నిరసనను దఖలు చేశారు. 2017 సంవత్సరంలో దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌ను సందర్శించడం పట్ల కూడా చైనా తీవ్ర నిరసనను వ్యక్తంచేసింది. అలాగే 2018, ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో మళ్లా పర్యటించారు. అప్పుడు కూడా ప్రధాని పర్యటనపై చైనా తీవ్ర విమర్శలు గుప్పించింది. విదేశాంగమంత్రిగా 2008లో ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు భారత సభ్యులు భారత పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించడాన్ని పేర్కొంటు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ అరుణా చల్ ప్రదేశ్ గానీ, అందులోని ఏ ఇతర ప్రాంతం గాని భారత్ నుంచి విడివడే సమస్య తలెత్తబోదని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా ఆయన పర్యటనపై చైనా అసంతృప్తితో వ్యవహరించింది.

అక్టోబర్, 2016లో అప్పటి అమెరికా రాయబారి రిజర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహ్వానంపై ఆ రాష్ట్రాన్ని సందర్శించారు. మెక్మోహన్ రేఖ భారత్, చైనా సరిహద్దు రేఖగా 1962ల్లో అమెరికా స్టేట్ డిపార్ట్‌ మెంట్ స్పష్టంచేసింది. కానీ, ఇప్పటికీ చైనా దాన్ని అంగీకరించడానికి ససేమిరా అంటోంది. అంతేకాదు జపాన్ విదేశాంగ మంత్రి తరో అసో అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి సార్వభౌమాధికారంపై భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం పట్ల చైనా తన తీవ్ర నిరసనను వ్యక్తంచేసింది.

అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి చైనాది ఏమీ చేయలేని పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్‌కు శక్తివంతమైన వ్యక్తుల సందర్శనను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు హోదాలో ఎంత పెద్ద అయినప్పటికీ, వారికి వీసాలను ఇవ్వడానికి చైనా నిరాకరించడం మొదలెట్టింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చైనాను సందర్శించలేకపోయారు. అంతేకాదు ఆ రాష్టానికి చెందిన ఎందరో ప్రభుత్వ ఉన్నతాధికారులు చైనాలో అడుగుపెట్టలేకపోయారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సామాన్య జనాలకు మాత్రం చైనా స్టేపుల్డ్ వీసాలను జారీచేస్తోంది. భారత్ 2009 నవంబరులో ట్రావల్ అడ్వైజరీని ఒక ముఖ్య విషయాన్ని తెలుపుతూ జివొ జారీచేసింది. అందులో పాస్‌పోర్టులకు జత చేస్తూ చైనా జారీ చేస్తున్న స్టేపుల్డ్ వీసాలు అక్కడ తిరగడానికి వీలుండదని హెచ్చరించింది.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని స్థానికులకు చైనా స్టేపుల్డ్ వీసాలను జారీ చేస్తోంది. ఇవి ప్రజలకు ఇబ్బందులు కలుగజేయడమే కాకుండా వారిని ఎంతో నిరాశపరుస్తున్నాయి కూడా. 2011 సంవత్సరంలో స్టేపుల్డ్ వీసాలతో చైనాలో పర్యటిద్దామనుకున్న కరాటే బృందాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ఆపేశారు. అలాగే 2012 సంవత్సరంలో స్టేపుల్డ్ వీసాలతో అక్కడ పర్యటిద్దామనుకున్న వెయిట్‌లిఫ్టింగ్ టీమ్‌కు కూడా అనుమతి లభించలేదు.

2014 లోక్ సభ ఎన్నికల సమయంలో తమ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి అరుణాచల్ ప్రదేశ్‌లోని పసిఘాట్‌కు వెళ్లినపుడు పరోక్షంగా పొరుగుదేశాలలో చైనా విస్తరణ ఆలోచనా ధోరణులను మోదీ విమర్శించారు. ఈ రకమైన పోకడలు ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఆటకం కలిగిస్తాయని మోదీ వ్యాఖ్యానించారు కూడా. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాకు సంబంధించి యాక్టివ్ పాలసీని చేపట్టారు. ఒకేరకంగా ఉండే చైనా పాలసీకి భారత్ కట్టుబడి ఉన్న విధానాన్ని పేర్కొంటూ చైనా నుంచి కూడా అలాంటి వ్యవహారశైలినే ఆశిస్తున్నామన్నారు. కానీ ఈ విషయంలో చైనా ఎలాంటి మాటగాని, ప్రతిస్పందన గానీ చూపలేదు. దీంతో భారత్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పలు మౌలికసదుపాయాల ప్రాజక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారుల నిర్మాణం, సరిహద్దు ప్రాంతాల్లోజనవాసాలు, అధునాతన లాండింగ్ జోన్స్ ను తగినరీతిలో ఎయిర్ ఫీల్డ్స్ గా రూపొందించడంతో పాటు ఈ రాష్ట్రంలో మూడు కొత్త ఎయిర్ బేసులతో పాటు మరెన్నో కార్యక్రమాలను భారత్ ప్రారంభించింది.

టిబెటన్ నియింగ్‌క్విలో చైనా సైనిక మౌలిక సదుపాయాల వృద్ధి చేపడుతున్న నేపథ్యంలో వాటి వెనుక అరుణాచల్ ప్రదేశ్‌ పట్ల వ్యతిరేకతతో కూడిన చర్యలు దాగున్నాయి. బిజెపి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం చైనాతో ఉన్న సరిహద్దు సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్టు పలుమార్లు స్పష్టంచేసింది.

ఏప్రిల్, 2018లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్ గ్జి జిన్‌పింగ్‌ల మధ్య వుహాన్ శిఖరాగ్ర మహాసభ జరిగినా, అర్థరహితంగా చైనా అరుణాచల్ ప్రదేశ్ అంశాన్ని ఆ
సదస్సులో లేవనెత్తింది. భారత్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వభౌమాధికార రక్షణకు వెనక్కితగ్గేది లేదని స్పష్టంచేసింది. మరో వివాదాస్పద ప్రాంతమైన అక్సాయ్ చిన్‌లో సైనిక శక్తిని చైనా వృద్ధిచేస్తోంది. అక్సాయ్ చిన్ భారత్, చైనాల మధ్య నలుగుతున్న మరో వివాదాస్పద అంశం. ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. శాంతియుతమైన, ప్రశాంతమైన ఇండో-చైనా సరిహద్దు కోసం గౌరవంగా చైనా నాయకత్వం తన వంతు నిబద్ధతను ప్రదర్శించాలి.

రచన: ప్రొ. శ్రీకాంత్ కొండపల్లి, ఛైర్మన్ తూర్పు ఆసియా కేంద్రం, జెఎన్‌యు