పుల్వామా ఉగ్రదాడుల్లో అసువులు బాసిన అమరవీరులకు దేశం కన్నీటి నివాళులర్పిస్తోంది. నేడు దేశంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో బీజేపీ సంతాప సభలను నిర్వహిస్తోంది

పుల్వామా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల జవాన్ల స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దేశం యావత్తూ వారికి కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. కేంద్ర మంత్రులు, నేతలే గాక… సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారు – అమరవీరులకు తుది నివాళులర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో 12 మంది జవాన్లకు, పంజాబ్ లో నలుగురు CRPF అమరవీరులకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉత్తరాఖండ్ కు చెందిన ఇద్దరు అమర వీరులకు తుది వీడ్కోలు పలికారు. బీహార్ లోని ఫతునా, ఖహల్గావ్ వద్ద గంగాతీరం వద్ద ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు అంతిమ వీడ్కోలు పలకగా… జార్ఖండ్ లో వేద మంత్రోచ్ఛారణల నడుమ CRPF జవాను విజయ్ కు ఆయన స్వస్థలం లో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, కేంద్రమంత్రి జయంత్ సిన్హా, పలువురు అధికారులు, పెద్దసంఖ్యలో ప్రజలు అమరవీరులకు తమ నివాళులర్పించారు. ఒడిశ్శాలో ఇద్దరు CRPF అమర వీరులకు వారి స్వగ్రామాల్లోని వేలాది మంది ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళలో అమరుడైన జవాను వివి.వసంత్ కుమార్ కు కడపటి నివాళి ఇచ్చిన వారిలో కేంద్రమంత్రి కె.అల్ఫోన్స్ కూడా ఉండగా…. తమిళనాడుకు చెందిన ఇద్దరు అమర CRPF జవాన్లకు వారి స్వగ్రామాల్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు.