ముంబైలో ఛ‌త్ర‌ప‌తి శివాజి మ‌హ‌రాజ్ టెర్మిన‌ల్ స‌మీపంలోని ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి కూలిపోయిన దుర్ఘ‌ట‌న‌లో క‌నీసం ఆరుగురు మ‌ర‌ణించారు. 31 మంది గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న‌పై ఉన్న‌త‌స్థాయి క‌మిటీ విచార‌ణ‌కు ఆదేశించారు.

ముంబై న‌గ‌రంలో ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ ట‌ర్నిన‌ల్ స‌మీపంలోని ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలో ఒక భాగం నిన్న సాయంత్రం కూలిపోయిన దుర్ఘ‌ట‌న‌లో క‌నీసం ఆరుగురు మ‌ర‌ణించారు. 31 మంది గాయ‌ప‌డ్డారు. నిన్న‌సాయంత్రం ఏడున్న‌ర‌కు ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. దుర్ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే జాతీయ విప‌త్తు స్పంద‌న ద‌ళం (ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌) ర‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌ల్లోకి గాయ‌ప‌డిన వారినంద‌రినీ స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై ఉన్న‌త స్థాయి క‌మిటీ విచార‌ణ జ‌రుపుతుంద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. స‌హాయ కార్య‌క్ర‌మాలు త్వ‌రితంగా సాగేలా అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విలేక‌రుల‌తో చెప్పారు. 1980వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి, భద్రంగానే ఉన్నట్టు గత ఏడాది పరీక్షల్లో తేలిందని, ఆ తర్వాత కొన్ని స్వల్ప మరమ్మతులు చేపడుతున్నారని, ఈ లోగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. బ్రిడ్జి లోపాలను కనిపెట్టడంలో పరీక్ష విఫలమై ఉంటే, ఆ వైఫల్యంపై కూడా విచారణ కమిటీ దర్యాప్తు చేస్తుందని,  దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ దుర్ఘటనకు సంబంధించి సెంట్రల్ రైల్వే అధికారులపై, బృహన్ ముంబై నగర పాలక సంస్థ అధికారులపై ఇప్పటికే కేసు నమోదైనట్టు పోలీసులు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఐదులక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి అవసమైన చికిత్సతోపాటు 50వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ దుర్ఘటనలలో మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్వర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఎనిమిది మాసాల క్రితం బ‌ర్బ‌న్ అంధేరిలో మ‌రో వంతెన కూలి అయిదురుగు మ‌ర‌ణించిన ఎనిమిది మాసాల అనంత‌రం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.