సవాళ్ల తరుణంలో భారత-అమెరికా సంభాషణలు

తొమ్మిదవ భద్రత, వ్యూహాత్మక సంభాషణలు భారత్, అమెరికాల మధ్య జరిగాయి. రెండు దేశాల మధ్య ఎంతో క్లిష్టమైన అంశాలకు సంబంధించిన తీర్మానాలు చోటుచేసుకోవాల్సిన తరుణంలో ఈ చర్చలు చోటుచేసుకున్నాయి. ఇరాన్, రష్యాలపై అమెరికా విధించిన పరిమితులు, భారత్‌కీ పరిత్యాగం విస్తరించాల్సిన అవసరాన్ని ట్రంప్ యంత్రాంగం భావించడం, భారత్‌ని జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎస్‌పి) పరిధి జాబితా నుంచి తొలగించాలన్న అమెరికా నిర్ఝయం, అలాగే వెనుజులా నుంచి చమురును భారత్ కొనుగోలు చేయరాదంటూ భారత్‌పై అమెరికా డిమాండ్, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్యపరమైన సంఘర్షణలు, పెండింగ్‌లో పెట్టిన హెచ్1బి వీసాల తీర్మానం వంటి అంశాలు భారత్, అమెరికాల  మధ్య నేడు రగులుతున్న సంక్లిష్టమైన తాజా పరిణామాలు.

భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఇటీవల వాషింగ్టన్, డిసిలో పర్యటించారు.   నేటి ద్వైపాక్షిక భద్రత, వ్యూహాత్మక సంభాషణలను అమెరికా సంబంధిత అధికారులతో ముఖ్యంగా ఆర్మ్స్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండర్‌స్టేట్ సెక్రటరీ ఆండ్రియా ధాంప్సన్‌తో చర్చలు చేయాలని వాషింగ్టన్ డిసి పర్యటనను ఆయన చేపట్టారు.

అలాగే  విదేశాంగ శాఖ నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా విభాగం అదనపు కార్యదర్శి ఇంద్రా మణి పాండే కూడా వాషింగ్టన్ డిసిని సందర్శించారు. మూడవ పర్యాయం జరుగుతున్న అమెరికా-భారత్ అంతరిక్ష సంభాషణల కార్యక్రమానికి అమెరికా ఆర్మ్స్ కంట్రోల్, వెరిఫికేషన్ అండ్ కాంప్లియన్స్‌ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ తో పాటు కో-ఛైర్‌గా వ్యవహరించేందుకు అమెరికాకి వచ్చారు.   

తొమ్మిదవ ఇండో-అమెరికా సంభాషణలు ఎంతో సహృదయ, స్నేహపూరిత వాతావరణంలో జరిగాయన్నదాంట్లో అనుమానం లేదు. విస్తృత స్థాయిలో వివిధ అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. వాటిల్లో అణ్వాయుధ సేకరణను నిరోధించడంతోపాటు  అణ్వాయుధాలు ఉగ్రవాద సంస్థలకు చిక్కకుండా అడ్డుకోవడం, అమెరికా న్యూక్లియర్ రియాక్టర్లను ఇండియాలో ఏర్పరచడం ద్వారా సివిల్ న్యూక్లియర్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్ (ఎన్ఎస్‌జి)లో భారత సభ్యత్వానికి అమెరికా మద్దతు కొనసాగింపు వంటి అంశాలు ఉన్నాయి. అంతరిక్ష సంబంధిత ప్రమాదాలకు సంబంధించిన అభిప్రాయాలు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, అంతరిక్ష రంగానికి సంబంధించి పలు అంశాలపై ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంకు సంబంధించిన కొత్త అవకాశాలను శోధించడం కూడా వీటిల్లో ఉన్నాయి.

జైష్-ఇ-మొహమ్మద్ (జెఇఎం) జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామాలో భారత సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పూనుకున్న సమయంలో ఈ సంభాషణలు ఇరుదేశాల మధ్య జరిగాయి. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగా ఖండిచింది. పాక్ స్థావరంగా చేసుకుని జరగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్తాన్ గట్టిగా దృష్టి పెట్టి కఠిన చర్యలు చేపట్టాలని ట్రంప్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అమెరికా పంపిణీ చేసిన ఎఫ్-16 విమానాలను భారత్‌పై  చట్టవిరుద్ధంగా ప్రయోగించడంపై కూడా ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది.

భద్రతా, వ్యూహాత్మక అంశాలకు చెందిన విస్తృత ఎజెండాతో కూడిన సంభాషణలు ఇవి కావడంతో నిర్దిష్ట సంఘటనల వివరాలను రెండు దేశాల సంభాషణల అనంతరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రస్తావించలేదు. కానీ ఎఫ్-16ని పాక్ దుర్వినియోగం చేసిన దానికి సంబంధించిన సాక్ష్యాలను భారత విదేశాంగ కార్యదర్శి తప్పకుండా అమెరికాకు అందించి ఉంటారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఉగ్రవాద అంశాలకు సంబంధించి అమెరికా ఇటీవల కాలంలో పాక్ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు పాక్‌కి అందించే ఆర్థిక సహాయాన్ని కూడా అమెరికా ఆపేసింది.

పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ ఉగ్రవాద బృందాలకు మౌనంగా పాక్ ఇస్తున్న మద్దతుకు వ్యతిరేకంగా అమెరికా ప్రస్తుతం చేపట్టిన చర్యలు సరిపోవు. పుల్వామా ఉగ్రదాడి, ఆప్ఘనిస్తాన్‌లో అవిశ్రాంతంగా కొనసాగుతున్ ఉగ్రదాడులు  దక్షిణ ఆసియాలో భారత, అమెరికా ప్రయోజనాలకు గట్టి దెబ్బ.

దక్షిణ ఆసియాలో ఉగ్రవాదంపై పోరులో చైనా సహకారం లోపించడాన్ని భారత్ లేవనెత్తింది. గ్జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ఉధృతమవుతున్న తరుణంలో బీజింగ్ ఎప్పటిలాగానే తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ‘యుఎనన్ డిసిగ్నేటడ్ టెర్రరిస్ట్’ జాబితాలో మసూద్ అజర్‌ను చేర్చే విషయంలోనూ చైనా మోకాలొడ్డింది.

ఇండో-అమెరికా వాణిజ్య సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య విభేదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి. అలాగే రెండు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని పరిరక్షించుకోవాలి.

ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ యంత్రాంగం టారిప్‌ను  ఏకపక్షంగా పెంచింది. అంతేకాదు హెచ్1బి వీసాలపై అదనపు పరిమితులను చేపట్టింది. మేధో హక్కుల అంశాల్లోకి ఇండియాను లాగింది. ఇప్పుడు భారత్‌ని జిఎస్‌పి (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తామంటూ అమెరికా భయపెడుతోంది.   అమెరికాకు ఎగుమతి చేసే ఐదు బిలియన్ అమెకన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఈ అంశాలన్నింటిపై పరిణితితో కూడిన సంభాషణలు జరగాలి. సమయానికి తీర్మానాలు చేసుకోగలగాలి. ఇండో-అమెరికా భద్రతా, వ్యూహాత్మక సంభాషణలతో పాటు ఆర్థిక, భద్రతా సంభాషణల కొనసాగింపు కూడా ఈ  దేశాలు తప్పనిసరిగా చేపట్టాలి. ఎందుకంటే సమకాలీన ప్రపంచ క్రమంలో ఆర్థిక, భద్రతా అంశాలు రెండూ సహజీవనతత్వాన్ని సంతరించుకున్నాయి.

రచన: ప్రొ. చింతామణి మహాపాత్ర, ప్రొ విసి అండ్ ఛైర్మన్, అమెరికన్ స్టడీస్ సెంటర్, జెఎన్‌యు