అప్ఘనిస్తాన్‌లో మరోసారి వాయిదా పడ్డ అధ్యక్ష ఎన్నికలు

అప్ఘనిస్తాన్ స్వతంత్ర ఎన్నికల కమిషన్ హవా అలం నూరిస్తానీ దేశంలో అధ్యక్ష పదవీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఎన్నికలు జరుగుతాయని తాజాగా ప్రకటించారు. గతంలో ప్రకటించిన తేదీలకన్నా రెండు నెలల పాటు ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తలెత్తిన కొన్ని సమస్యలను పరిష్కరించడంతోపాటు బ్యాలెట్‌కు సంబంధించిన మరికొన్ని అంశాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను సవరించేందుకు సమయం అవసరమని కమిషన్ ఎన్నికలు వాయిదా వేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఏప్రిల్‌లో జరగాలి. వాటిని జులై 20 వరకు వాయిదా వేశారు. వాస్తవానికి అధ్యక్ష ఎన్నికలు దేశంలోని ఘజ్ని ప్రావిన్స్‌లో జిల్లా కౌన్సిల్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహించాలని భావించారు. అయితే లబ్ధిదారుల నుంచి అవసరమైన నిధులు సమకూరినపుడే ఎన్నకలు నిర్వహించగలుగుతామని అప్ఘన్ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. కాబుల్ ప్రభుత్వంతోపాటు అంతర్జాతీయ సమాజం కూడా నిధుల సమీకరణలో పాలుపంచుకోవాల్సి ఉంది. 2018 అక్టోబర్‌లో జరగాల్సిన ఎన్నికలు కూడా చాలా ఆలస్యంగా నిర్వహించారు. ఎలక్టోరల్ స్టాఫ్ గైర్హాజరీ, ఓటింగ్ మెటీరియల్ మాయం కావడం లాంటి సమస్యలతో ఎన్నికల నిర్వహణ చాలా ఆలస్యమైంది. అందుకే పార్లమెంట్ ఎన్నికలను ఒక నెల ముందుగానే సెప్టెంబర్ నెలలో నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఫలితంగా ‘‘ఎన్నికల చట్టాన్ని సమర్థవంతంగా అమలుపర్చడంతోపాటు వోటర్ నమోదు కార్యక్రమం పారదర్శకంగా సాగుతుంద’’నే అభిప్రాయం వ్యక్తమైంది.

అప్ఘనిస్తాన్‌లో భద్రతా స్థితిగతుల్లో ఏ మాత్రం మెరుగుదల లేదు. ఇటీవలి కాలంలో తాలిబన్లు బాగా పంజుకున్నారు. అధికారపరంగా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల రీత్యా చాలా బలంగా తయారయ్యారు. వాళ్లిపుడు అప్ఘనిస్తాన్‌లోని పర్యత సానువులు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పట్టు కలిగి ఉన్నారు. కాగా ఘనీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. అమెరికా ప్రభుత్వం రూపొందించిన ఒక నివేదిక ప్రకారం, కాబుల్ ప్రభుత్వం ఇపుడు అప్ఘన్ భూభాగంలోని 56 శాతంపైనే తన ఆధిపత్యం కలిగి ఉంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణల్లో రికార్డు స్థాయిలో పౌరులు మరణిస్తున్నారు. చొరబాటుదారులు గ్రామీణ ప్రాంతంలో ఇంకా తమ పట్టు నిలుపుకుంటూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో వారు సమాంతర ప్రభుత్వాలను నడుపుతున్నారు. 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి చరమ గీతం పాడేందుకు చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవలి కాలంలో భద్రతా పరిస్థితులు మరింత వేగంగా దిగజారాయి. మరో ముఖ్యమైన ఆందోళనకరమైన విషయం ఏమంటే అప్ఘనిస్తాన్ లాంటి భూభాగాలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు తమ కార్యకలాపాలు నెరవేర్చేందుకు ఎంతో అనువైనవి. చాంధస తీవ్రవాద సంస్థలు అప్ఘనిస్తాన్ లాంటి (నాటో దళాలు లేని) భూభాగాల కోసం తీవ్రంగా వెదుకులాడుతున్నాయి. నిలకడలేని ప్రభుత్వాలు, అస్థిరమైన పరిస్థితులు ఉన్న ప్రాంతాల కోసం అన్వేషిస్తున్నాయి. పశ్చిమాసియా నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కార్యకలాపాలతో భద్రతాపరమైన పరిస్థితులు మరింతగా క్షీణించాయి.

తాలిబన్లతో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఈ ప్రక్రియలో తమకు ఆశించినంత స్థానం లభించడం లేదని అసంతృప్తి అప్ఘన్ అధికారుల్లో వ్యక్తమవుతోంది. కాబుల్ ప్రభుత్వ చట్టబద్ధమైన ఉనికిని గుర్తించకుండా చిన్న చూపు చూస్తున్నారనే ఆరోపణ వారి నుంచి వినిపిస్తోంది. తాలిబన్లు ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని తోలుబొమ్మ సర్కారుగా అభివర్ణిస్తోంది. అమెనిక ప్రత్యేక ప్రతినిధి జల్మే ఖలిజాద్ వాషింగ్టన్‌తో ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు. దోహాలో ఈ నెల తొలి రోజుల్లో జరిగిన తాజా చర్చల్లో పురోగతి ఉందనీ, అయితే ఎలాంటి వాస్తవికమైన ఒప్పందం కుదరలేదని మాత్రం ఆయన వ్యాఖ్యానించారు. దళాలను ఉపసంహరించుకునే విషయంలో కూడా ఒక టైమ్ టేబుల్ రూపొందలేదని స్పష్టం చేశారు.

అప్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితులు మరింత దిగజారడానికి గల మరో కారణం సిరియా మతపర యుద్ధం సాగిస్తున్న షియా తిరుగుబాటుదారులు ఆ దేశంలో అడుగుపెట్టడం. ఇరాన్ వేలాది మంది అప్ఘన్ షియాలకు శిక్షణ ఇచ్చి వారిని దేశంలో వదిలిపెట్టింది. సిరియాలోని మత యుద్ధ బలగాలైన వీరు తమను తాము ఫతేమియూన్ ఫైటర్లుగా పిలుచుకుంటున్నారు. వేలాది మంది ఈ ఫైటర్లు తిరిగి అప్ఘనిస్తాన్‌కు చేరుకుంటున్నారు. ఉపాధి కోసం వెదుక్కుంటూ పోరాటం కోసం ప్రజల్ని సమీకరించే పనిలో వీరున్నారు. అప్ఘన్ రక్షణ దళాలు తమపై విరుచుకుపడతారేమోననే అనుమానంలో కూడా వారున్నారు. ఈ ఫైటర్లు ఇప్పుడు అధికారుల్లో ఒక రకమైన భయాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్ఘనిస్తాన్ ఇకపై షియాల రక్షణ కవచమైన ఇరాన్, ప్రపంచంలోనే సున్నీల ఆధిపత్యం కోసం సుదీర్ఘమైన పోరాటాన్ని ప్రోత్సహిస్తున్న సౌదీ అరేబియాకు మధ్య పోరాట ప్రాంతంగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

1990లో అప్ఘనిస్తాన్‌లో తలెత్తిన ప్రచ్ఛన్న యుద్ధంలోని ముఠా తత్వాన్ని విదేశీ శక్తులు తమ స్వార్థపర ప్రయోజనాల కోసం వాడుకున్నాయి. అయితే ఇపుడు దేశంలో ఒక సరికొత్త ఆందోళనాకరమైన పరిస్థితి కనిపిస్తోంది. అప్ఘనిస్తాన్‌లోని షియా మైనార్టీలపై ఇస్లామిక్ స్టేట్‌కు విధేయులుగా ఉండే సున్నీ తీవ్రవాదుల నుంచి దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్‌కు అవసరమైన నేపథ్యం సమకూరుతోంది. దీంతో అప్ఘనిస్తాన్‌లోని పాతతరం ఫైటర్ల జోక్యంతో శాంతి మెరుగుపడుతుందనే భావన వ్యక్తం అవుతోంది. ఇటీవలి కాలంలోనే ఇస్లామిక్ స్టేట్ అప్ఘన్ బ్రాంచ్ హజారా (షియా)లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులను మొదలుపెట్టింది.

రచన : డా. స్మిత, అప్ఘన్-పాక్ వ్యవహారాల వ్యూహాత్మక నిపుణులు