అమెరికా మద్దతు ఉన్న సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ (ఎస్డిఎఫ్) ఈ ఏడాది మార్చి 24న సిరియా ఈశాన్యంలోని బఘౌజ్ ఊరును ఆక్రమించుకున్నట్టు ప్రకటించింది. ఆ ఊరు ఎంతో అందచందాలతో నిండి ఉండే ఈఫ్రటిస్ లోయ మధ్యలో ఉంది. ఈ యుద్ధ ప్రాంతంలో దయేష్ (ఐఎస్) చిట్టచివరి అవుట్ పోస్ట్ ఇది. ఖాసి 2017 అక్టోబర్‌లో రాజధాని రఖాపై పట్టుకోల్పోయిన తర్వాతి పరిస్థితి ఇది.
2004 సంవత్సరంలో ఇరాక్‌లో ఆల్ ఖైదా శాఖగా దయేష్ ఏర్పడింది. 2006 సంవత్సరంలో స్వతంత్ర ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్’గా స్థిరపడింది. సిరియాలో ఏర్పడ్డ అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని ఇది దేశంలో విశాలమైన ప్రాంతాలను ఆక్రమించుకుంటూ తన శాఖలను అక్కడ విస్తృతపరచుకుంటూ వచ్చింది. 2014లో మసూల్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత దయేష్ నాయకుడు అబు బకర్ ఆల్-బగ్దాది దానికి ‘ఖలీఫ్’గా తనను తాను ప్రకటించుకున్నారు. అంతేకాదు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, లేవంట్స్ (ఐఎస్ఐఎల్ లేదా దయేష్)ను నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. దయేష్ ఉగ్ర సంస్థ అతి స్వల్పకాలంలోనే మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో ఎందరో తన బాట పట్టేలా తీవ్ర ప్రభావాన్ని చూపింది.
వేలమంది విదేశీ పోరాటదారులను సైతం దయేష్ ఆకట్టుకుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఒంటరిగా హింసాత్మక దాడులకు పాల్పడేలా స్ఫూర్తినిచ్చింది. మహిళలకు వ్యతిరేకంగా అది చేపట్టిన మతపరమైన ఎజెండా, అనాగరిక ధోరణులు ప్రాంతీయ శక్తులను తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఈ విషతుల్యమైన ధోరణులకు అడ్డుకట్టవేసే ప్రత్యామ్నాయ వ్యూహరచనలపై అవి దృష్టినిలిపాయి. రెండు భిన్న సంకీర్ణాలు దయేష్ను ఓటమిపాలు చేసేందుకు సిరియాలో సైనిక ఆపరేషన్‌కు సైతం పూనుకున్నాయి. ఇరాన్, సిరియా బషార్ ఆల్-అస్సాద్ రిజీమ్ సంకీర్ణంతో రష్యా చేతులు కలపగా, అమెరికా కుర్దులతో చేతులు కలిపి ఎస్డిఎష్ ఏర్పాటుకు సహాయపడింది.
2016 చివరల్లో కుర్దిష్ ఎస్డిఎఫ్ సైన్యం దయేష్కు వ్యతిరేకంగా పలుచోట్ల దాడులకు పూనుకుంది. అమెరికా సైన్యం వైమానిక దాడులకు పూనుకుంది. 2017 అక్టోబర్‌లో అపూర్వ విజయం సాధించింది. సిరియాలోని దయేష్ రాజధానిని పడగొట్టడం ద్వారా, కొన్ని అడ్డంకులు తలెత్తినా, రఖా, ఎస్ డిఎఫ్లు ఉగ్రవాదుల బృందాన్ని ఓటమిపాలు చేయడంలో విజయవంతమయ్యాయి.
దయేష్ ఓటమిపాలు అయినప్పటికీ, సిరియా కుర్దుల భవిష్యత్తు అటు ఇటు కాకుండా త్రిశంకుస్వర్గంలా వేల్లాడుతోంది. దయేష్ను ఎదుర్కోవడంలో కుర్దు దళాలు ఎంతో శక్తివంతమైన పోరాటదారులుగా నిలిచాయి. ఎస్డిఎఫ్ ప్రస్తుతం మొత్తం సిరియా ఈశాన్య భాగమంతా నియంత్రిస్తోంది. అంతేకాదు తన నియంత్రణలోని ప్రాంతాలతో స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఏర్పడింది. ఈ ప్రాంతం రొజావాగా ప్రసిద్ధి చెందింది. సిరియా డెమోక్రాటిక్ కౌన్సిల్ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ తన సామర్థ్యాన్ని చూపారు. ఎస్ డి ఎఫ్ రూపంలో బలమైన పోరాట శక్తిగా వృద్ధిచెందారు. దయేష్ అనంతర సిరియాలో ప్రస్తుతం రాజకీయ పరిష్కార సాధన పెద్ద సవాలు. ఎందుకంటే అక్కడి పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉంది. కుర్దులు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, సిరియా భవిష్యత్తు కోసం అసాద్ ప్రాంతంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తమ సంసిద్ధతను స్పష్టంచేశారు.
సిరియా అంతటా తమ సార్వభౌమాధికారాన్ని ఏర్పాటు చేసుకోవాలని అసాద్ ప్రాంతం గట్టిగా కోరుతోంది. ఇది అమెరికా మద్దతు ఉన్న కుర్దులకు, రష్యా, ఇరాన్ దేశాల మద్దతు ఉన్న అస్సాద్ ప్రాంతం వారికి మధ్య పెద్ద వివాదం కాగలదు. సిరియాను పూర్తి నియంత్రణలోకి తీసుకురావాలనే సిరియా ప్రాంత అభిప్రాయంపై రష్యా, ఇరాన్‌లు తమ మద్దతును తెలిపాయి. కానీ మాస్కోతో పోలిస్తే, కుర్దులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి టెహ్రాన్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
వాయివ్య సిరియా సంఘర్షణరహిత ప్రాంతంగా చేయడానికి టర్కీ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు అరబ్‌లు అధికసంఖ్యాకంగా ఉన్న ప్రతిపక్షంతో పాటు ఫ్రీ సిరియా ఆర్మీ (ఎఫ్ఎష్ఎ)లు సైతం కుర్దులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎస్డిఎఫ్, అందులోని పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్ (వైపిజి)లను టర్కిస్ భద్రతకు ప్రమాదంగా అంకారా భావిస్తోంది. ఇందుకు కారణం నిషేధిత టర్కిష్ వేర్పాటు గ్రూపు అయిన కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పికెకె)తో ఉన్న సాన్నిహిత్యమే. ఉత్తర సిరియాలో అమెరికా సైన్యం కొనసాగింపుకు సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తిగా లేరు. దీంతో కుర్దుల చాయిస్‌ను మరింత క్లిష్టతరం అయింది.
అంతర్జాతీయ, ప్రాంతీయ శక్తులు సిరియాకు రాజకీయ పరిష్కారం సాధించేందుకు కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ క్రమంలో స్థానిక శక్తుల సెంటిమెంట్లను నిర్లక్షం చేయరాదు. దయేష్ ముగింపు సిరియాకు కీడును సూచించనప్పటికీ సిరియాకు రాజకీయ పరిష్కార మార్గంకు అవకాశం ఉంటుంది. చర్చల ద్వారా పరిష్కారం త్వరలో సాధ్యంకాకపోతే చీలికలుగా ఉన్న దయేష్ ఉనికి తిరిగి బలపడి గతంలో మల్లే ఉగ్రచర్యలు పున: ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది.
రచన: డా. మొహమ్మద్. ముద్దాస్సిర్ ఖమర్, పశ్చిమాశియా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు