పాకిస్తాన్‌లో తీవ్రతరమవుతున్న రాజకీయ చీలికలు

పాకిస్తాన్ అధికార పార్టీ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ)లో చీలకలు ప్రస్తుతం పూర్తిగా బహిరంగమయ్యాయి. పార్టీలో రెండు వర్గాలు తయారయ్యాయి. ఒక వర్గానికి విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి నాయకత్వం వహిస్తుండగా, మరో వర్గానికి జహంగీర్ తహ్రీన్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. రెండు వర్గాలు కత్తులు నూరుకుంటున్నాయి. అంతేకాదు ట్విట్టర్‌లో ఈ రెండు వర్గాలు ద్వేషపూరితమైన మాటల యుద్ధానికి పాల్పడుతున్నాయి. ఈ రెండు వర్గాలకు  దేశంలోని దక్షిణ ప్రాంతానికి సంబంధించిన పంజాబ్ ఎంతో కీలకమైనది. పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగంపై రెండు వర్గాల కన్ను పడింది. ఖురేషి పంజాబ్ ప్రాంత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో సల్మాన్ నయీం చేతిలో పరాజయం పాలయ్యారో ఆయన కలలు కల్లలు అయ్యాయి. సలీ నయీం కూడా పిటిఐలో ప్రముఖ నాయకుడు. కానీ పిటిఐ ఖురేషిని తన ప్రదేశంలో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడడ్డాడంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు అతని అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తూ తీర్పు ఇవ్వడంతో తరీన్ ఎన్నికల బరిలోంచి తప్పుకున్నారు.

ప్రస్తుత సమస్య ఏమిటంటే జహంగీర్ తరీన్‌ను  పాక్ ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకురావాలంటే పిటిఐ ఛైర్మన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం లేనిదే సాధ్యం కాదు. తరీన్ ఇటీవల జరిగిన ప్రభుత్వ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. అంతేకాదు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండానే ఆ సమావేశంలోమంత్రులకు వ్యవసాయరంగ అభివృద్ధి గురించి  వివరించారు. ఇది సహజంగానే షా మొహమద్ ఖురేషిని, అతని మద్దతుదారులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య మళ్లా కొత్తగా వివాదానికి తెరలేచింది.

ఎంతోమంది స్వతంత్ర్య అభ్యర్థులను పిటిఐలోకి చేర్చడంలో తరీన్ కీలకంగా వ్యవహరించడంతో పంజాబ్‌లో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది. పైగా తరీన్ ఇమ్రాన్‌ఖాన్‌కి నమ్మిన బంటు. అందుకే పంజాబ్‌ని జాగ్రత్తగా చూడమంటూ తిరిగి తరీన్‌ని పిటిఐ నాయకత్వం ఆహ్వానించింది. పార్టీ ధన బలాన్ని ప్రదర్శిస్తూ  దేశ రాజకీయాలను ఇమ్రాన్ ఖాన్ నడుపుతున్నారంటూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) ఆరోపణలు చేసింది.

2016లో జరిగిన ఒక సంఘటనతో రెండు గ్రూపుల మధ్య విద్వేషాలకు బీజం పడింది. తరీన్ ఇంట్లో జరిగిన డిన్నర్ విందులో ఖురేషి, అతని వ్యతిరేక వర్గీయులు ఒకరిపై ఒకరు నిందించుకోవడం జరిగింది. పరిస్థితులు చేయి దాటడంతో ఇమ్రాన్ ఖాన్ విందు నుంచి మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య అంతరం రాను రాను పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు అందరూ తమకు ఇష్టం వచ్చిన రీతిలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు.

పిటిఐ (క్యూ) ఏర్పడడానని అంగీకరించబోమని పిటిఐలోని ‘నజ్రియాతి’ పక్షం స్పష్టంచేసింది. రాజకీయ అనాథలందరినీ పార్టీ వ్యవహరాలలో ఇది చేరుస్తోందని ‘నజ్రియాతి’ పక్షం వ్యాఖ్యానించింది.

ఈ పక్షాల మధ్య జరుగుతున్న సంఘర్షణ సహజంగానే ప్రభుత్వ పాలనపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పార్లమెంట్, శాసనసభలు పూర్తిగా స్తబ్దంగా తయారయ్యాయి. దీనిపై ప్రతిపక్షంతో సంప్రదించే ఉద్దేశంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కనిపించడంలేదు. దీంతో పాకిస్తాన్ ఎన్నికల సంఘంలోని ఖాళీలను పూరించలేని పరిస్థితి తలెత్తింది. కారణం ఇందుకు బోర్డులో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలి. ఇది తప్పనిసరిగా పాటించాల్సిన రాజ్యాంగ నిబంధన.

ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని బహిరంగంగానే ఖురేషి ఇటీవల పలు పర్యాయాలు ప్రకటించారు. వీటిల్లో బెనజీర్ ఇంకమ్ సపోర్టు ప్రోగ్రామ్  పేరు మార్పుపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం కూడా ఉంది. ఈ విషయంపై ఖురేషి తన అభిప్రాయాన్ని వెల్లడించకుండా పక్కకు తప్పుకున్నారు.

పార్టీలోకి ఒక పక్షం ప్రతి అంశాన్ని ధన బలంతో పరిష్కరించాలని చూస్తోందంటూ షా మెహమూద్ ఖురేషి చేసిన అభియోగం చాలా సీరియస్ అనే చెప్పాలి. ఈ ఆరోపణ ముందు ముందు తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు కూడా. ఒక పక్క ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త పాకిస్తాన్ నిర్మాణంలో ప్రభుత్వం మునిగి ఉందని అనడం, అందులో పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదానికి చోటే లేదని వ్యాఖ్యానించడం గమనించవచ్చు. మరోవైపు పిటిఐ పార్టీ నిలువునా చీలపోతున్న దిశగా పయనిస్తోంది. దీన్ని నివారించడానికి ప్రధాని తగిన చర్యలు చేపడితేనే పార్టీ చీలికను నిరోధించడం సాధ్యమవుతుంది.

పాకిస్తాన్ పొరుగుదేశంగా, మిత్రుడిగా ఆ దేశంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై భారత్ ఆందోళన కలిగి ఉండడం సహజం. ఈ పరిస్థితి పలు అంశాలపై ప్రభావం చూపుతుంది. స్థిరమైన, శాంతియుతమైన పాకిస్తాన్‌ని భారత్ కోరుకుంటోంది. ఇది రెండు దేశాల ప్రయోజనాలకూ ఎంతో మంచిది.  కొత్త పాకిస్తాన్ నిర్మాణం పరంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిజాయితీగా వ్యవహరించిన పక్షంలో, అలాగే దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించాలనుకుంటే, దేశంలోని రాజకీయ పరిస్థితులు చేయిదాటి పోకుండా తన నియంత్రణలోకి ఖాన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాయంటూ ఇతర దేశాలను వేలుపెట్టి చూపి నిందించే ముందు ఇస్లామాబాద్ తన ఇంటి పరిస్థితులు అస్తవ్యస్తం కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం   ఎంతైనా ఉంది.

రచన: అశోక్ హాందూ, రాజకీయ వ్యాఖ్యాత