మూడోవిడత లోక్ సభ ఎన్నికలకు ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది.

మూడోదశ లోక్ సభ ఎన్నికలకు ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ దశలో మంగళవారం నాడు 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతుంది. వాటిలో గుజరాత్ లోని మొత్తం 26, కేరళలో 20, మహారాష్ట్ర, కర్ణాటకలో 14 చొప్పున, ఉత్తరప్రదేశ్ లో 10, ఛత్తీస్ గఢలో 7, ఒడిశ్శాలో 6, బీహార్, వెస్ట్ బెంగాల్ లో 5 చొప్పున, అస్సోంలో 4, గోవాలో 2, జమ్ము-కాశ్మీర్ లో 1, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యు, త్రిపురల్లో ఒక్కొక్క నియోజక వర్గంలో ఈ దశలో పోలింగ్ జరుగుతుంది. వివిధ పార్టీల నాయకులు పలు ప్రాంతాల్లో రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు.

కాగా – ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో ర్యాలీల్లో పాల్గొని మాట్లాడారు. బీహార్ లో ఫోర్ బెస్ గంజేర్ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ… ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే అవినీతి, వారసత్వ రాజకీయాలు, పేదల పేరుతో దోపిడి, కులమత రాజకీయాలకు చరమగీతం పాడతామని అన్నారు. BJP అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ నాయకుడు యడ్యూరప్పతో కలిసి కర్ణాటకలోని భద్రావతిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్ గఢ్, బీహార్ లలో ప్రచారం నిర్వహించారు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదరికంపై మెరుపుదాడి చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ పోటీచేస్తున్న కేరళలోని వాయనాడ్ లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. కాగా – పార్టీ నాయకులు సిద్ధరామయ్య, కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో ఎన్నిక  ర్యాలీల్లో మాట్లాడారు. బీహార్ లో జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ – సోపాల్, మాధేపురల్లో ఎన్నికల ప్రచారం చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, BSP అధినేత్రి మాయావతి, RJD అధ్యక్షుడు అజిత్ సింగ్ రాంపూర్, ఫిరోజాబాద్ ర్యాలీల్లో ప్రసంగించారు.

ఇదిలాఉండగా.. నాల్గవ విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ దశలో ఏడు రాష్ట్రాల్లోని 71 నియోజక వర్గాల్లో ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది.