శ్రీలంకలో చర్చీలపై, హోటళ్లపై ఉగ్రవాదుల బాంబు దాడుల తర్వాత ఆ దేశ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది. ఉగ్రదాడుల్లో మృతుల సంఖ్య 290కి పెరిగింది.

శ్రీలంకలో చర్చీలపై, హోటళ్లపై ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడిన తర్వాత గత అర్థరాత్రి నుంచి  ఆ దేశ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఇలా ఉండగా ఉగ్రవాద బాంబు దాడుల్లో మృతుల సంఖ్య 290కి పెరిగింది. ఇంకా మరో 500 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది భారతీయులతో పాటు మొత్తం 31 మంది విదేశీయులు ఉగ్రదాడిలో మరణించారు. శ్రీలంక ప్రభుత్వం జాతీయ సంతాప దినం ప్రకటించింది. ఉగ్రదాడులపై దర్యాప్తులో అంతర్జాతీయ సహాయం కోసం ఆ దేశ ప్రభుత్వం కోరింది. శ్రీలంకలో చర్చీలలో, హోటళ్లలో జరిగిన ఉగ్రదాడి వెనుక ఆ దేశంలోని నేషనల్ తాహీద్ జమాత్ అనే ఒక మత సంస్థ హస్తం ఉందని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. కేబినెట్ మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి రజిత సేనేరత్నే మీడియాతో మాట్లాడుతూ, తమ దేశంలో జరిగిన ఉగ్రదాడి వెనుక గల విదేశీ హస్తం గురించి కూడా దర్యాప్తు జరుపుతామని తెలిపారు. తమ దేశంలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందుగానే అంతర్జాతీయ నిఘా సంస్థలు హెచ్చరించాయని, అయినా ఆ దాడులను ఆపలేకపోయామని ఆ మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాంబు దాడులకు సంబంధించి శ్రీలంక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది అనుమానితులను అరెస్టు చేశారు.