రచన: అంబాసిడర్ అశోక్ సజ్జనార్, మాజీ భారత దౌత్యవేత్త, ప్రెసిడెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ స్టడీస్

ఐబిఎస్ఎ దేశాల ‘షెర్పాస్’ ప్రతినిధుల సమావేశం కేరళలోని కొచ్చిలో జరిగింది. ఇండియా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా దేశాల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశం  తొమ్మిదవ ఐబిఎస్ఎ త్రైపాక్షిక మంత్రివర్గ కమిషన్ సమావేశానికి కొనసాగింపని చెప్పాలి. గత ఏడాది సెప్టెంబరులో న్యూయార్కులో జరిగిన యుఎన్ సర్వప్రతినిధుల సభ సందర్భంలో  వీరి సమావేశం జరిగింది. చెప్పాలంటే ఐబిఎస్ఎ ఒక విలక్షణ వేదిక. ఇది ఇండియా, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలను ఒకచోటకు చేర్చింది. ఇవి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్థలున్న దేశాలు. అంతేకాదు మూడు విభిన్న ఖండాలలోని పెద్ద ఆర్థికవ్యవస్థలు. ఈ దేశాలు ఒకేతరహా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలు. భిన్నత్వం కలిగిన దేశాలు కూడా. అంతేకాదు విభిన్న సంస్కృతులు, జాతులు, భాషలు, మతాలు కలిగిన దేశాలు. ఐబిఎస్ఎ 2003లో బ్రసెలియాలో ఆ దేశాల విదేశాంగమంత్రుల సదస్సు తొలుత జరిగింది. గత ఏడాదే ఐబిఎస్ఎ పదిహేనవ వార్షికోత్సవ సంబరాలను చేసుకుంది.

ఐబిఎస్ఎ సౌత్-సౌత్ కూటమి. ఈ దేశాలన్నీ ఒకే విధమైన అభిప్రాయాలు కలిగిఉన్న దేశాలు. అంతేకాదు అందరినీ కలుపుకుపోతూ సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్న దేశాలు. అంతేకాదు తమ దేశ ప్రజల నిరంతర క్షేమం కోసం కట్టుబడి ఉన్న దేశాలు. ప్రపంచాన్ని అభివృద్ధి దిశగా పయనించేలా చేయాలన్న తపన ఉన్న దేశాలు. ఐబిఎస్ఎ డయలాగ్ ఫోరమ్ వెనుక నిర్దిష్టమైన విలువలు, నీతి నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావడానికి ఇవి ప్రాధాన్యం ఇస్తాయి. మానవహక్కులను గౌరవిస్తాయి. చట్టపాలనను, బహుపక్షవాదాన్ని బలోపేతం చేస్తాయి. అందరికీ ఆవశ్యకమైన అంతర్జాతీయ అంశాల పరంగా, అలాగే సుస్థిర ప్రాజక్టులు లేదా ప్రాంతాలకు సంబంధించి మూడు దేశాల ప్రయోజనాలకనుగుణంగా త్రైపాక్షిక సహకారానికి ప్రభుత్వాల మధ్య (గవర్నమెంట్ టు గవర్నమెంట్ (జి2జి) మంతనాలకు ‘ఐబిఎస్ఎ కో-ఆపరేషన్’ ప్రాధాన్యం ఇస్తుంది. సహకారానికి పెద్దపీట వేస్తుంది. వీటితో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాజక్టులను ఐబిఎస్ఎ ఫండ్ ద్వారా చేపట్టడం కూడా దీని ప్రణాళికల్లో ఉంది.  సంప్రదాయంగా నిపుణులు, శిక్షణ ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటికి మించి సౌత్-సౌత్ సహకారం సాధ్యం చేయడంలో సైతం ఐబిఎస్ఎ సక్సెస్ ప్రతిఫలిస్తుంది.

ఇప్పటిదాకా ఐదు ఐబిఎస్ఎ నాయకత్వ శిఖరాగ్రసమావేశాలు జరిగాయి. ఐబిఎస్ఎ ఐదవ శిఖరాగ్ర సమావేశం 2011,  అక్టోబర్‌లో ప్రెటోరియాలో జరిగింది. ఆరవ ఐబిఎస్ఎ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఐబిఎస్ఎ ఆరవ శిఖరాగ్రసదస్సుకు మూడు దేశాలకు సంబంధించిన నాయకత్వాలకు అనువైన తేదీలు కలిసిరాక ఆలస్యమైంది. ఐబిఎస్ఎ ఆరవ శిఖరాగ్రసదస్సు భవిష్యత్తులో నిర్వహించాల్సిన ఆవశ్యకత, ప్రాధాన్యాలను మూడు దేశాలకు చెందిన నాయకులు సమిష్టిగా గుర్తించారు. మూడు దేశాలలో ఎన్నికలు ముగియగానే ఆరవ సదస్సును నిర్వహించాలని ఈ దేశ నాయకులు నిర్ణయించారు. అదే సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మూడు దేశాల మధ్య సహకారం పెంపొందించేందుకు మంత్రివర్గస్థాయి, కార్యనిర్వాహణ స్థాయి సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. అంతేకాదు మూడు దేశాలు తమ సమిష్టి కార్యక్రమాలద్వారా సంబంధాల విస్తృతిని, కార్యకలాపాలను పెంపొందించుకోవాలని కృషి చేస్తున్నాయి.

ఈ మూడు దేశాలు కలిసి ప్రతిష్ఠాత్మకంగా 2004లో చేపట్టిన కార్యక్రమమే ఐబిఎస్ఎ ‘ఫండ్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అండ్ హంగర్’. ఇది ఎంతో విలక్షణమైన  కార్యక్రమం. దీని ద్వారా అభివృద్ధి ప్రాజక్టులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేపడతారు. ఇంతదాకా ఐబిఎస్ఎ 20 అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్య దేశాలలో 31 ప్రాజక్టులకు  తోడ్పాటును అందించింది. ముఖ్యంగా తాగునీరు, వ్యవసాయం, పశుసంపద, సోలార్ ఎనర్జీ, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాలలో ప్రాజక్టులకు ఐబిఎస్ఎ అండగా నిలుస్తోంది. ఐబిఎస్ఎ ప్రధాన దృష్టి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(సస్టైనబుల్ డెవలెప్‌మెంట్ గోల్స్, ఎస్‌డిజి) సాధనకు తోడ్పడడమే.

 

ఐబిఎస్ఎ ఫండ్ పలు కీలక అవార్డులను సాధించింది. వాటిల్లో 2006 సంవత్సరంలో యుఎన్ సౌత్-సౌత్ పార్టనర్‌షిప్ అవార్డు (హైతి, గునియా-బిస్సాలలో చేపట్టిన ప్రాజక్టులకు సంబంధించి), 2010 సంవత్సరంలో సౌత్-సౌత్ కో-ఆపరేషన్ పరంగా ఎండిజి అవార్డను పొందింది. అభివృద్ధి అనుభవాలను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పంచుకోవడంలో వినూత్న విధానాలను తమ పనిలో  మూడు దేశాలూ ఉపయోగించినందుకుగాను 2012లో ఇది సౌత్-సౌత్ ఛాంపియన్స్ అవార్డను సాధించింది. ఐబిఎస్ఎ త్రైపాక్షిక సహకారానికి సంబంధించి మరొక కీలక అంశం ఏమిటంటే రక్షణ రంగంలో సమిష్టి నౌకా విన్యాసాలు ఐబిఎస్ఎఎంఎఆర్ (ఐబిఎస్ఎ మారిటైమ్ ఎక్సైర్‌సైజ్)ను చేపట్టడం. ఇప్పటివరకూ ఐబిఎస్ఎఎంఎఆర్ ను ఏడు ఎడిషన్లు నిర్వహించారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా తీరంలో ఇవి జరిగాయి. తాజాగా జరిగింది ఇదే.

 

కోచిలో జరిగిన షెర్పాస్ సమావేశంలో ఇటీవల చేపట్టిన పలు కార్యకలాపాలు చర్చకు వచ్చాయి. అంతేకాదు తమ మధ్య సహాకారాన్ని మరింత పట్టిష్టంచేసుకునేందుకు ఇతర మార్గాలపై కూడా చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా పర్యాటకం, సౌత-సౌత్ పార్టనర్‌షిప్ వంటి అంశాలపై దృష్టిసారించారు. జాయింట్ వర్కింగ్ గ్రూపుల పనితీరును కూడా షెర్పాస్ సమీక్షించారు. ఐబిఎస్ఎ పదిహేనవ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలపై ప్రశంసలు గుప్పించారు. ఈ ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో తొలి గాంధి-మండేలా మెమోరియల్ ఫ్రీడమ్ లెక్చర్‌ను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఇవ్వడంపై ఐబిఎస్ఎ ఆనందాన్ని వ్యక్తంచేసింది.  మూడు దేశాలకు సంబంధించిన షెర్పాల మధ్య సమావేశం ఐబిఎస్ఎ సభ్యదేశాల మధ్య సహకారాన్ని మరింత వేగవంతం చేయడంలో తోడ్పడుతుందనడంలో సందేహానికి తావు లేదు.