అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తమైన ఘర్షణలు

‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ (జెసిపివొఎ) కింద అంగీకరించిన కొన్ని కార్యక్రమాల విషయంలో వెనుకడుగు వేస్తున్నట్టు ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రొహానీ   ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఆదేశంతో మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక బలగాలను దింపడంతో దానికి ప్రతిగానే ఇరాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.  జెసిపివొఎ కింద కార్యక్రమాల విషయంలో ఇరాన్ వెనుకడుగు వేసినప్పటి నుంచి ఆ దేశానికి వ్యతిరేకంగా అమెరికా స్వీయ నిర్ణయాలను విజయవంతంగా తీసుకుంటోంది. దీంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణ మరింత తీవ్రతరమైంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు సంబంధించి సరికొత్త పాలసీని చేపట్టారు. దానిననుసరించి అమెరికా సర్దుబాటు వైఖరికి అస్సలు తావు లేకుండా ఇరాన్ పట్ల వ్యవహరిస్తోంది. అంతేకాదు ఇరాన్‌పై మళ్లా ఆంక్షలను విధించింది. వీటిని అంతకు మునుపు ఇరాన్‌పై ఎత్తివేయడానికి కారణం జెసిపివొఎను ఇరాన్ అమలు చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం తను ఒప్పుకున్న అంశాలను పూర్తిచేయడానికి సంబంధించి ఇరాన్ వెనక్కివెళ్లింది. దీంతో ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా ‘ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (ఐఆర్‌జిసి)ని ఉగ్రవాద జాబితాలో వేసింది.  అమెరికా మొట్టమొదటిసారి ఒక విదేశానికి సంబంధించిన ప్రభుత్వ విభాగాన్ని ఉగ్రవాదిగా చేర్చింది. అంతేకాదు గత నెలలో ఇండియా, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలపై ఆంక్షల ఎత్తివేతకు అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. దీనికి కారణం ఇరాన్ నుంచి చమురును ఇవి దిగుమతి చేసుకోవడమే. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీపగ్గాలు చేపట్టడానికి ముందు అమెరికా అధ్యక్షుడుగా ఉన్న బరాక్ ఒబామా అనుసరించిన విధానాన్ని ట్రంప్ పూర్తిగా మార్చేశారు.

అమెరికా చేపడుతున్న  ఈ తరహా చర్యల కారణంగా ఇరాన్, అమెరికాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం  బాగా కొనసాగుతోంది. దీనికి తోడు ఇటీవల అమెరికా నిఘావర్గాల సమాచారం ప్రకారం మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రయోజనాలను దెబ్బకొట్టేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందన్న  సమాచారం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఆ సమాచారాన్ని గాఢంగా విశ్వసించిన అమెరికా అందుకు ప్రతిగా అమెరికా నావల్ కేరియర్ అబ్రహాం లింకన్‌ను మధ్యప్రాచ్యానికి తరలించింది. అమెరికా చేపట్టిన  ఈ చర్యకు ప్రతిగా సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించింది. అందులోనే జెసిపివొఎ కింద ఒప్పందపడ్డ కొన్ని కమిట్‌మెంట్ల నుంచి పక్కకు తప్పుకోవాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్  ఆఫ్ ఇరాన్‌కు ఆ దేశ ప్రెసిడెంట్ హసన్ రొహానీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం అంటే జెసిపివొఎ నుంచి వైదొలగినట్టు కాదని ప్రపంచ దేశాలకు స్పష్టంచేశారు. ఫ్రస్తుతం ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా చేపట్టిన మార్గంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతోపాటు యురేనియం అభివృద్ధి, ఇంటర్‌మీడియరీ డెడ్‌లైన్‌ను కూడా ఇరాన్ స్వయంగా తనపై 60 రోజులపాటు విధించుకుంది.

అదే సమయంలో అణు ఒప్పందంలోని ఇతర పక్షాలు స్పందిస్తూ అణు ఒప్పందం నుంచి అమెరికా విరమించుకోవడంతో పాటు ఇరాన్‌పై ఆంక్షలను తిరిగి విధించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాయి. అణు ఒప్పందంలో ప్రధాన భాగస్వామి అయిన యురోపియన్ కూటమి కూడా అణు ఒప్పందాన్ని పరిరక్షించడానికి తనవంత ప్రయత్నాలన్నీ చేసింది కానీ అవన్నీ విఫలమయ్యాయి.   ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం ఉన్న ఘర్షణ వాతావరణం ఇలాగే కొనసాగిన పక్షంలో ఇరాన్ కూడా తను తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగిస్తూ పోతుంది. ఆ తర్వాత జరిగేది ఇరాన్ అణ్వాస్త్రాల అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వరకూ అమెరికా తీసుకెడుతుంది. ఇలాకనుక జరిగితే ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రతరం అవుతాయి. అంతర్జాతీయ సమాజం, యురోపియన్ కూటమి అది జరగకుండా ఘర్షణకు దిగిన  అమెరికా, ఇరాన్‌ల మధ్య స్నేహ వాతావరణం నెలకొనెలా ప్రయత్నాలు చేయాలి. ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరిగేలా చూడాలి. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్ఠంభనకు స్నేహపూర్వక పరిష్కారం సాధ్యమయ్యేలా కృషిచేయాలి.

మధ్యప్రాచ్యం ఇప్పటికే భారీగా సంక్షోభంలో మునిగితేలుతోంది. అక్కడు పలు రకాల ఘర్షణలు చోటుచేసుకోవడంతోపాటు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉన్న సంఘర్షణ కూడా వాటికి తోడై అక్కడి ఉద్రిక్త పరిస్థితులు ఆ ప్రాంతాన్ని మరింత ఛిద్రం చేస్తాయి. అంతేకాదు ప్రపంచం మొత్తానికీ ఈ పరిణామాలు హానికరంగా పరిణమిస్తాయి. ఏ వ్యక్తిగత దేశానికో బద్ధులై ఉండకుండా కేవలం ఐక్యరాజ్యసమతికి మాత్రమే భారత్ కట్టుబడి  వ్యవహరిస్తుందని మన ప్రభుత్వం పలుమార్లు స్పష్టంచేసింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని స్నేహపూర్వకంగా, పరస్పర ఆమోదకరమైన రీతిలో పరిష్కరించుకోవాల్సిందిగా భారత్ కోరుతోంది. అమెరికా తిరిగి ఆంక్షలను ఇరాన్‌పై రుద్దడం వల్ల ఆ ప్రభావం భారత ఎనర్జీ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారత అతి ముఖ్య చమురు సరఫరా దేశం ఇరాన్. ఘర్షణ పడుతున్న అమెరికా, ఇరాన్ రెండు దేశాలకూ భారత్ ఎంతో మంచి మిత్రదేశం. తన రెండు మిత్రదేశాల మధ్య ఇలాంటి ఘర్షణపూరితమైన వాతావరణం న్యూఢిల్లీకి ఏమాత్రం ప్రయోజనం కాదు.

రచన: డా. అసిఫ్ షుజా, ఇరాన్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు